కర్నూలు (Karnool) జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది. వర్షాకాలం ఆరంభమవుతూనే ప్రజలు పొలాల్లో వజ్రాల (Diamonds) కోసం వెతకడం ప్రారంభించారు. మద్దికెర మండలం పెరవలిలో ఒక వ్యవసాయ కూలీకి వజ్రం దొరకగా, దానిని రూ.1.5 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. తుగ్గలిలో కూడా మరో కూలీకి వజ్రం దొరికింది. దీన్ని రూ.1.3 లక్షలకు విక్రయించినట్టు తెలుస్తోంది. ఈ వేటలో ఇప్పటికే మూడు వజ్రాలు దొరికాయని తెలుస్తోంది.
Pawan Kalyan : OG రిలీజ్ డేట్ ఫిక్స్..మనల్ని ఎవడ్రా ఆపేది !!
వజ్రం దొరుకుతుందనే ఆశతో అనంతపురం, బళ్లారి, నంద్యాల, గుంటూరు, విజయవాడ నుంచి ప్రజలు ఇక్కడకు వస్తున్నారు. వ్యాపారులు వారికి వసతి కల్పిస్తున్నారు. తాజాగా మద్దికెర మండలం కొల్హాపూర్ లక్ష్మీదేవి ఆలయం దగ్గర ఓ వ్యక్తికి రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికినట్లు సమాచారం. ఇది బహిరంగ మార్కెట్లో రూ.60 లక్షల విలువ చేయవచ్చని అంచనా. వజ్రాల కొనుగోళ్లలో గోప్యత పాటించబడుతున్నా, సమాచారం పోలీసులకు చేరుతోందని తెలుస్తోంది.
వజ్రాల వెతుకులాట కారణంగా పంట పొలాల్లోకి వేలాదిగా ప్రజలు ప్రవేశించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలకు నష్టం జరిగితే బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, వజ్రాలు తక్కువ ధరలకు దళారుల ద్వారా వ్యాపారులకు వెళ్లిపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు రంగు, నాణ్యత, బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తున్నప్పటికీ, చాలా మంది తమకెంతో విలువైన రాయిని తక్కువ ధరకే అమ్మేస్తున్నారని చెబుతున్నారు. వజ్రం దొరికితే జీవితం మారుతుందనే ఆశతో కొందరు ఇక్కడే వంట చేసుకుంటూ రోజులు గడుపుతున్నారు.