Amaravati : నేడు ఏపీలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆంధ్రుల ఆశగా, ఆకాంక్షగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడకకు అంతా సిద్ధమైంది. దీంతో ఐదు కోట్ల ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. వెలగపూడిలో ‘అమరావతి పునఃప్రారంభం’ పేరుతో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ రాష్ట్రంలో రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. జిల్లాల నుంచి బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్నారు.
Read Also: Hyundai: భారత్‌లో హ్యుందాయ్ సరికొత్త రికార్డు.. 90 లక్షల వాహనాలు విక్రయం!
ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ప్రాంతాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది. రాజధాని పరిధిలోని తుళ్లూరులో రైతులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ ప్రాంతం నుంచి వస్తున్న వాహనాలు చిలకలూరిపేట బైపాస్ వద్ద 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి గుంటూరు మీదుగా అమరావతికి చేరుకుంటున్నాయి. రాజధాని పరిసర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై కూటమి పార్టీల జెండాలు కట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో అలంకరించారు. రాజధాని పరిధిలోని తుళ్లూరులో రైతులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల కోసం 35 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా బారికేడ్లు పెట్టారు. ప్రతి గ్యాలరీలో వేదిక కనిపించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లు వేశారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు పెట్టారు. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్యాలరీలో తాగునీరు, మజ్జిగ అందిస్తారు. ముఖ్యమైన వ్యక్తుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజల కోసం మిగిలిన ప్రాంతాన్ని కేటాయించారు. భద్రత కోసం 6,500 మంది సిబ్బందిని నియమించారు. పర్యవేక్షణ కోసం 37 మంది IPS అధికారులను నియమించారు. వారికి సహాయంగా ట్రైనీ IPSలను కేటాయించారు.
కాగా, ప్రధాన వేదికపై ప్రధాని మోడీతో సహా 19 మంది కూర్చుంటారు. వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్రమంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, సీఎస్ విజయానంద్ తదితర ముఖ్యులు ఉంటారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఇప్పటికే వేదికతో పాటు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి గుర్తుగా ఒక పైలాన్‌ను నిర్మిస్తున్నారు. దీనిని ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు.