Pawan Kalyan : వాలంటీర్లను కించపరిచేలా, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీసీ సెక్షన్ 499, 500 కింద క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసును పరిగణనలోకి తీసుకున్న గుంటూరు జిల్లా కోర్టు.. మార్చి 25న విచారణకు రావాలని పవన్ కళ్యాణ్‌ను ఆదేశించింది. ఈ కేసును నాలుగో అడిషనల్ జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. గతేడాది జులై 9న వాలంటీర్లకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి వస్తున్నారనీ, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘వాలంటీర్ల వల్ల ఇళ్లలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. కొంతమంది వాలంటీర్లు బ్లాక్‌మెయిల్స్‌కు పాల్పడుతున్నారు’’ అని పవన్ కామెంట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ పవన్ కుమార్‌తో పాటు మరి కొందరు ఇచ్చిన వాంగ్మూలంపై కేసు నమోదు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా కోర్టుకు పవన్‌ను(Pawan Kalyan) విచారణకు పిలవడంతో.. ఏం జరుగుతుందో అనే టెన్షన్ జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో నెలకొంది. టీడీపీతో కలిసి ఎన్నికల ప్రచారానికి జనసేన రెడీ అవుతున్న టైంలో ఈ కేసు ఆ పార్టీకి సమస్యగా మారేలా కనిపిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
వైసీపీ మొదటి నుంచి వాలంటీర్ల వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఆల్రెడీ పంచాయతీ వ్యవస్థ ఉన్నా, ఆ వ్యవస్థలో పనిచేసేవారికి జీతాలు ఇస్తున్నా, వారికి పనులు అప్పగించకుండా, వాలంటీర్లకే అన్ని పనులూ అప్పగిస్తోంది ప్రభుత్వం. అలాగైతేనే లబ్దిదారులకు పథకాల ప్రయోజనాలు కరెక్టుగా అందుతాయని అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో వాలంటీర్ల శాలరీలను కూడా ఓసారి పెంచింది. ఏటా వారికి బహుమతులు కూడా ఇస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చి, వాలంటీర్లకు శాలరీలు మరింత పెంచాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందువల్ల వాలంటీర్లకు వ్యతిరేకంగా ఎవరు కామెంట్స్ చేసినా, బలంగా తిప్పికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : Baba Vanga : వచ్చే నెలలో ‘వంగ బాబా’ చెప్పింది జరగబోతోందట.. ఏమిటో తెలుసా ?
2023 జులై 9న పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ?
గత ఏడాది జులై 9న ఏలూరులో పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 29వేల నుంచి 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఆరోపించారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా తనకు సమాచారం తెలిసిందన్నారు. రాష్ట్రంలో అదృశ్యమైన మహిళల్లో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలినవారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మహిళల అదృశ్యం గురించి డీజీపీ సైతం సమీక్షించలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళ అదృశ్యం వెనుక వలంటీర్ల పాత్ర ఉందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వలంటీర్లు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంత మంది సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని, వారి ద్వారా వల వేసి అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తమున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పినట్లు పవన్ అప్పట్లో వెల్లడించారు.