Site icon HashtagU Telugu

TTD Chairman BR Naidu: టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర జ‌రుగుతోంది: చైర్మ‌న్ బీఆర్ నాయుడు

TTD Chairman BR Naidu

TTD Chairman BR Naidu

TTD Chairman BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు కుట్రపూరితమని, టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని టీటీడీ ప్ర‌స్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాలను మీడియా, అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. గోశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, గోవులను తల్లిలా సంరక్షిస్తూ దాణా, వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. కరుణాకర్ రెడ్డి గత పాలనలో మరణించిన గోవుల ఫోటోలను తేదీలు మార్చి, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల చిత్రాలను చూపిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

బీఆర్ నాయుడు గత విజిలెన్స్ నివేదికను పేర్కొంటూ.. కరుణాకర్ రెడ్డి హయాంలో గోవులకు కాలం చెల్లిన మందులు, పురుగులు పట్టిన దాణా అందించినట్లు నిరూపితమైందని, దీనికి సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. రోజూ అసత్య ఆరోపణలతో టీటీడీ సంస్థపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. వ్యక్తిగతంగా తనపై ఆరోపణలు చేయమని, కానీ దైవ సంస్థను రాజకీయ కుట్రలకు ఉపయోగించడం శ్రీవేంకటేశ్వర స్వామి సహించరని అన్నారు.

Also Read: Deputy CM Bhatti: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం భ‌ట్టి.. త్వ‌ర‌లోనే మ‌రో 30 వేల ఉద్యోగాలు!

కరుణాకర్ రెడ్డికి దేవుడంటే భయం, భక్తి లేదని, అందుకే నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీటీడీపై నిజమైన సమస్యలు చెబితే సవరించుకుంటామని, కానీ బురద జల్లడం ఊరకే ఉండదని ఆయన స్పష్టం చేశారు. తన హయాంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా సేవలు అందిస్తున్నానని, కానీ కరుణాకర్ రెడ్డి హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో కమిషన్ల ఆరోపణలు వచ్చాయని, కాంట్రాక్టర్లు స్వయంగా ఈ విషయం చెప్పారని ఆయన వెల్లడించారు. గోశాలలో సహజ మరణాలు సంభవించినప్పటికీ.. వాటిని రాజకీయ లబ్ధికి వాడటం సరికాదని, ఇతర మతాలపై ఇలాంటి అసత్య ప్రచారం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యుడు జీ. భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.