MLC Elections : ఈనెల (ఫిబ్రవరి) 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా సత్తాను చాటుకోవాలనే పట్టుదలతో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి సర్కారు ఉంది. గ్రాడ్యుయేట్లు కచ్చితంగా తమ వైపే మొగ్గు చూపుతారన్న విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించిన కీలక బాధ్యతలను పలువురు మంత్రులకు సీఎం చంద్రబాబు అప్పగించారు.
Also Read :Tomato Prices : టమాటా ధరలు ఢమాల్.. రంగంలోకి చంద్రబాబు సర్కార్
పీడీఎఫ్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC Elections) స్థానాల పరిధిలో సమీకరణాలు అనూహ్య రీతిలో ఉన్నాయి. ఉభయగోదావరి, కృష్ణా – గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి విజయం అంత సులభమేం కాదు. ఇక్కడ పీడీఎఫ్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పరిధిలో కూటమి పార్టీల నేతల మధ్య సమన్వయం కొరవడిందనే విషయంపై సీఎం చంద్రబాబుకు నివేదిక చేరినట్లు తెలిసింది. దీంతో అక్కడ కూటమి పార్టీల నేతలతో చంద్రబాబు పలుమార్లు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారని సమాచారం. ఈ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్ సీపీ పోటీ చేయడం లేదు.అయినా కూటమి పార్టీల నేతల మధ్య సమన్వయం కుదరకపోవడాన్ని ప్రతికూల అంశంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గోదావరి – క్రిష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. క్షేత్రస్థాయిలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు బేషజాలు లేకుండా కలిసిమెలిసి పనిచేస్తే తప్పకుండా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తాయి. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో ప్రధాన పోటీ ఉపాధ్యాయ యూనియన్ల మధ్యే నెలకొంది.
టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్..
ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘవులు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పేరాబత్తుల రాజశేఖర్ ఆర్థికంగా బలమైన నాయకుడు. డీవీ రాఘవులు మధ్యతరగతి వర్గానికి చెందిన వారు. ఉపాధ్యాయుడిగా పదవీవిరమణ పొందారు. మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు గెడ్డం విజయసుందర్ కూడా బరిలో ఉన్నారు. ఈ స్థానం పరిధిలో మొత్తం 3,14,984 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో 1,83,347 మంది పురుషులు. 1,31,618 మంది మహిళలు, 19 మంది ట్రాన్స్‌జెండర్స్.