Site icon HashtagU Telugu

Nadu Nedu : `నాడు-నేడు`లో జ‌గ‌న్మాయ‌!

Nadu Nedu Dharna

Nadu Nedu Dharna

కొండ నాలుక్కు మందుస్తే ఉన్న నాలుక పోయింద‌ని సామెత‌. ఏపీలోని నాడు-నేడు ప్రోగ్రామ్ ఇంచుమించు ఆ సామెత‌లా ఉంది. ఆ విష‌యాన్ని టీడీపీ మొద‌టి నుంచి చెబుతూనే ఉంది. ప్ర‌పంచ బ్యాంకు ఇచ్చే రూ. 2వేల కోట్ల నిధుల కోసం జ‌గ‌న్ స‌ర్కార్ ఇష్టానుసారంగా పాఠ‌శాల‌ల్ని కుదించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 8వేల ప్రాథ‌మిక పాఠ‌శాల్ని మూసివేయ‌డానికి జగ‌న్ స‌ర్కార్ సిద్ధం అవుతోంది.

సాధార‌ణంగా ప్ర‌పంచ బ్యాంకు రుణాలు పొందాలంటే కొన్ని నిబంధ‌న‌లు పాటించాలి. వాటిని పాటించ‌డానికి ఆమోదం తెలిపిన త‌రువాత మాత్ర‌మే ఏ ప్ర‌భుత్వానికైనా రుణాల‌ను ఇస్తుంద‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఏపీలోని స‌ర్వ‌శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ప‌థ‌కం కింద ప్ర‌పంచ బ్యాంకు రుణాలు ఇవ్వ‌డానికి కొన్ని కండీష‌న్ల‌ను పెట్టింది. మాన‌వ వ‌న‌రుల‌ను క‌నీస స్థాయిలో ఉపయోగించాల‌ని ఆ కండీష‌న్ల‌లోని ప్ర‌ధాన‌మైన‌ది. ప్రపంచ బ్యాంకు రుణం రూ.2 వేల కోట్ల పొంద‌డ‌మే ఏకైక లక్ష్యంగా విద్యార్థుల భవిష్యత్తును జ‌గ‌న్ స‌ర్కార్ పణంగా పెడుతోంది. ప్రపంచ బ్యాంకు నుండి US $ 250 మిలియన్ల (₹2,000 కోట్లు) రుణ సహాయంతో లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (SALT) ప్రాజెక్ట్ నాడు-నేడు మరియు పరిచయం వంటి పాఠశాల విద్యలో వివిధ మార్పుల‌ను ప్రోత్సహించేలా ప్ర‌పంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. అందుకే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధన తెర‌మీద‌కు వ‌చ్చింద‌ట‌. ఆ విష‌యాన్ని టీడీపీ నేత ప‌ట్టాభి మీడియా ఎదుట ఏక‌రువు పెట్టారు.

ప్ర‌పంచ బ్యాంకు నిబంధ‌న‌ల ప్ర‌కారం వెళుతోన్న ఏపీ స‌ర్కార్ విధానాల కార‌ణంగా ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులు వ‌ర‌కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార‌ని విప‌క్షాల ఆరోప‌ణ‌. ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలతో విలీనం చేయడం వల్ల 8,000 పాఠశాలలు మూత‌ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. “ఎన్‌రోల్‌మెంట్‌లో క్షీణత 2.80 లక్షల వ‌ర‌కు ఉంద‌ని స‌మాచారం. 2021లో సెకండరీ స్థాయిలో సగటు వార్షిక డ్రాపౌట్ రేటు 16.7%గా ఉంది. 10వ తరగతిలో గ్రేడ్ వారీగా వార్షిక సగటు డ్రాపౌట్ రేటు 31.3%. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌పంచ బ్యాంకు రుణం కోసం నేల‌విడిచి సాము చేస్తోంద‌ని టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌. ఇదే విష‌యాన్ని మీడియా ముఖంగా చెబుతున్న‌ప్ప‌టికీ ఏపీ స‌ర్కార్ పున‌రాలోచ‌న చేయ‌డంలేదు. దీంతో 8వేల స్కూల్స్ మూత‌ప‌డ్డాయ‌ని తెలుస్తోంది.

ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో పేరెంట్స్ స్కూల్స్ కోసం రోడ్ల మీద‌కు వ‌స్తున్నారు. పాఠ‌శాల‌ల్ని మూసివేయొద్ద‌ని డిమాండ్ చేస్తున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ ప్రోగ్రామ్ కు వెళుతోన్న ఎమ్మెల్యేల‌కు ఇదే అంశాన్ని ప‌లు చోట్ల త‌ల్లిదండ్రులు ఏక‌రువు పెడుతున్నారు. కానీ, జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం ఎడ్యుకేష‌న్ ట్రాన్స‌ఫ‌ర్ మేష‌న్ అంటూ ప్ర‌పంచ బ్యాంకు అడుగు జాడల్లో న‌డుస్తోంది. ఫ‌లితంగా రాబోయే ప‌రిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.