Site icon HashtagU Telugu

CM Jagan: సేంద్రీయ వ్యవసాయం వైపే మా ప్రయాణం.. కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలి..!!

Jagan mohan reddy

Jagan mohan reddy

ఏపీ ప్రభుత్వంపై నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది. అమరావతిలో సహజ, ప్రకృతి వ్యవసాయ పద్దతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం కోసం ఏపీ ముఖ్యమంత్రి ఇప్పటికే అద్భుతమైన చర్యలు తీసుకున్నారని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. తాను ప్రత్యక్షంగా ఆర్టీకేలను పరిశీలించానని.ఆర్టికేలు అందిస్తున్న సేవలు నిజంగా అభినందనీయమన్నారు.

వినూత్న వ్యవసాయ పద్దతులపై నీతిఆయోగ్ సదస్సు నిర్వహించడం ప్రశంసనీయమని..సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మన సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్నారు. రైతులు పురుగుల మందులు, రసాయన ఎరువులను వాడకుండా సేంద్రీయ విధానాల ద్వారా మాత్రమే పంటలు పండించాలని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే 6.30లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జగన్ తెలిపారు. రాష్ట్రంలో 2.9లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారని వెల్లడించారు. 10,778 రైతు భరోసా కేంద్రాల్లో 3009 చోట్ల ప్రకృతి వ్యవసాయం సాగుచేస్తున్నారని…రసాయన వ్యవసాయం నుంచి సేంద్రీయ వ్యవసాయం వైపునకు వెళ్లేలా తమ ప్రయాణాన్ని వేగవంతం చేస్తామని జగన్ పేర్కొన్నారు.

ఆర్బికేల ద్వారా రైతుల ముంగిటకే అన్ని రకాల సేవలు అందిస్తున్నట్లు జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10778 ఆర్బీకేలు సేవలు అందిస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి బలం ఇచ్చేందుకు ప్రత్యేకంగా కస్టర్ హైరింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్లో కల్తీలను పూర్తిగా అరికట్టడమే కాకుండా…ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బికేలల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. ఈ పంట అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని…బ్యాంకింగ్ కరస్పాండెంట్ ను కూడా పెట్టామని జగన్ వెల్లడించారు.

రైతుల్లో అవగహనను పెంపొందించేందుకు పొలంబడి నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రైతులు 30-50ఏండ్లుగా రసాయన ఎరువులు, పురుగు మందులతో వ్యవసాయం చేస్తున్నారని, ప్రకృతి వ్యవసాయ విధానాలకు జర్మనీ ప్రభుత్వం ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఆన్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ లెర్నింగ్ ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చినట్లు తెలపడం సంతోషంగా ఉందన్నారు. రానున్న ఐదేండ్లలో 20మిలియన్ యూరోలను జర్మనీ ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రాష్ట్రాలకు తగిన విధంగా అండగా నిలిచేలా ఆర్థిక సంఘం సిఫార్సులు చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

Exit mobile version