WhatsApp Governance : అసెంబ్లీలో వాట్సాప్ గవర్నెన్స్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ..మనమిత్ర యాప్ ప్రపంచంలోనే మెరుగ్గా తీర్చిదిద్దుతాం అన్నారు. జూన్ 30వ తేదీ నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వందరోజుల్లో ఏఐ ఆధారిత వాయిస్ ఎనేబుల్ సేవలు తెస్తాం అన్నారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని లోకేశ్ అన్నారు. వ్యక్తిగత డేటాను ఎక్కడా ఎవరితోనూ పంచుకోవటం లేదన్నారు. పూర్తిగా ఎన్ క్రిప్టెడ్ డేటా మాత్రమే నేరుగా వినియోగదారుకు వెళ్తుందన్నారు. కేవలం పది సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అలాగే పౌరులకు సంబంధించిన సమాచారం కూడా పూర్తి భద్రంగా ఉంటుందని మంత్రి లోకేశ్ అన్నారు.
Read Also: Shark Tank Show : ‘షార్క్’గా మారిన తెలుగు వ్యాపారవేత్త.. శ్రీకాంత్ బొల్లా గ్రేట్
గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకువచ్చాక గత ప్రభుత్వం మీ-సేవా కేంద్రాల నుంచి కొన్ని సేవలను తొలగించిందని ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చినంత మాత్రాన మీసేవా కేంద్రాల నుంచి సేవలను తొలగించబోమన్నారు. ప్రజలు కావాలనుకుంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా లేదంటే మీసేవా ద్వారా ప్రభుత్వ సేవలు పొందొచ్చన్నారు. ఇక, ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జారీ అయ్యే పత్రాలకు పూర్తి చట్టబద్ధత ఉందన్నారు. సాంకేతికత విషయంలో పొరుగు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయని.. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఏపీ ప్రారంభించగానే అటు మహారాష్ట్ర కూడా నెల తర్వాత దీన్ని మొదలు పెట్టిందన్నారు.
ఏది అమలు చేసినా ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం అని లోకేశ్ వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే ఇరిగేషన్ స్థలాల ఆక్రమణ.. రియల్ ఎస్టేట్ సంస్థలు కాల్వలు. చెరువులు ఆక్రమించి వెంచర్లు వెయ్యడం.. బుడమేరు వాగు పరిస్థితిపై కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరిగింది. క్యూఆర్ కోడ్ ద్వారా ఒక్కసారి ధృవీకరణ పత్రం జారీ అయితే అది శాశ్వతంగా ఇచ్చినట్టే అని ప్రభుత్వం చెబుతోంది. ప్రతీ ఆరు నెలలకూ ఓ సారి ధృవీకరణ పత్రం పొందాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని వాట్సాప్ గవర్నెన్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ధాన్యం సేకరణను కూడా వాట్సాప్ తో అనుసంధానం చేయాలని నిర్ణయించాం అని మంత్రి లోకేశ్ తెలిపారు.