Site icon HashtagU Telugu

Congress Reshuffle : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి రఘువీరా రెడ్డి, సచిన్ పైలట్

Congress Reshuffle

Congress Reshuffle

Congress Reshuffle : త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్, ఆ వెంటనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)కి నూతన కార్యవర్గాన్ని హస్తం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ కమిటీలో 39 మందిని సభ్యులుగా  నియమించారు.  సీడబ్ల్యూసీ కార్యవర్గంలో ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ  సహా పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై ముభావంగా ఉంటున్న ఆనంద్ శర్మ, శశిథరూర్, సచిన్ పైలట్ సహా పలువురు జీ-23 నేతలకు కూడా వర్కింగ్ కమిటీలో చోటు ఇచ్చారు. ఈ కమిటీలో ఏపీ నుంచి రఘువీరా రెడ్డికి చోటు కల్పించగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు.

Also read : Ceiling Fans – Govt Norms : ఆ సీలింగ్ ఫ్యాన్లపై బ్యాన్.. వాటిని అమ్మితే రెండేళ్ల జైలుశిక్ష !

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శాశ్వత ఆహ్వానితులుగా 32 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఏపీ కాంగ్రెస్ నేతలు టి.సుబ్బిరామి రెడ్డి, కొప్పుల రాజు, తెలంగాణ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ కూడా ఉన్నారు. శాశ్వత ఆహ్వానితుల్లో 14 మందిని సీడబ్ల్యూసీ ఇంఛార్జిలుగా నియమించారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మందిని ఎంపిక చేశారు. ఈ లిస్టులో ఏపీ నుంచి పల్లం రాజు, తెలంగాణ నుంచి వంశీచందర్ రెడ్డి పేర్లు ఉన్నాయి. ప్రత్యేక ఆహ్వానితుల్లో నలుగురిని సీడబ్ల్యూసీ ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా నియమించారు.