YSRCP : డేంజ‌ర్ జోన్ లో 40 మంది ఎమ్మెల్యేలు, టిక్కెట్ లేన‌ట్టే!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు `టిక్కెట్‌ ఫ‌ర్ రేటింగ్‌` సూత్రాన్ని వినిపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 02:57 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు `టిక్కెట్‌ ఫ‌ర్ రేటింగ్‌` సూత్రాన్ని వినిపిస్తున్నారు. ఎవ‌రికి రేటింగ్ బాగుంటే వాళ్ల‌కు 2024 ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేయ‌డానికి సిద్ధం అయ్యారు. ఎమ్మెల్యేల ప‌నితీరు బాగాలేని చోట్ల ప్ర‌త్యామ్నాయ అభ్య‌ర్థులను ఇప్ప‌టికే జ‌గ‌న్ ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఐప్యాక్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 60 నుంచి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ డౌటుగా ఉందని తెలుస్తోంది.

ఇటీవ‌ల స‌మీక్షించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడేందుకు ఎనిమిది నెలల సమయం కేటాయించిన విష‌యం విదిత‌మే. అంతేకాదు, ఎప్ప‌టిక‌ప్పుడు స్కోర్‌లను సమీక్షిస్తానని చెప్పారు. అందుకు తగిన విధంగా ఐపాక్ బృందాలు, ఇతర సర్వే ఏజెన్సీలు ఇచ్చిన నివేదిక‌ల‌ను అధ్య‌య‌నం చేశార‌ని తెలుస్తోంది. స‌రిచేసుకోవ‌డానికి 8నెల‌లు టైం ఇచ్చిన‌ప్ప‌టికీ దాదాపు 60 మంది వైఎస్‌ఆర్‌సి శాసనసభ్యులు పనితీరు బాగాలేదని తేలింద‌ట‌. కేవ‌లం డజను మంది శాసనసభ్యుల పనితీరు మెరుగుపడింద‌ని తాజా నివేదిక‌లోని సారంశం. ఎమ్మెల్యేలకు మార్కులు, గ్రేడ్ లు ఇవ్వడం ద్వారా వారి పనితీరును మ‌రోసారి జ‌గ‌న్ సమీక్షించనున్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యేల రేటింగ్‌లను వాళ్ల‌కే చూపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఆ రేటింట్ ఆధారంగా టిక్కెట్లపై స్పష్టత ఇస్తార‌ని స‌మాచారం.

`గడప గడపకు మన ప్రభుత్వం`కార్యక్రమం ద్వారా అవకాశం కల్పించినప్పటికీ పనితీరులో ఇంకా వెనుకబడిన శాసనసభ్యులకు తుది హెచ్చరిక చేస్తార‌ని వినికిడి. సిఎం కూడా జిల్లాల పర్యటన ప్రారంభించాలని యోచిస్తున్నారని, ఆయన తన తండ్రి వైఎస్ఆర్ మాదిరిగానే రచ్చబండ సభలు నిర్వహించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌.
175 సీట్లు గెలవాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశ‌గా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రతి నెలా శాసనసభ్యుల పనితీరును విశ్లేషిస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతా ప్రాతిపదికన జగన్ ప్రతి నియోజకవర్గానికి నిధులు ఇస్తున్నారు. అయితే దాదాపు 40 మంది శాసనసభ్యులు ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స‌ర్వేల సారాంశం. అందుకే వారు డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది.

పనితీరు సరిగా లేని మంత్రులకు ఉద్వాసన తప్పదని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇటీవల ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. మార్కులు, గ్రేడ్‌ల ఆధారంగా శాసనసభ్యుల పనితీరును విశ్లేషించేందుకు ఆయన తాజా సమీక్షకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో జగన్ ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పుడు మ‌ళ్లీ వారి పనితీరును సమీక్షించేందుకు సమావేశం నిర్వహించడానికి ముహూర్తం పెట్టారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15న ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు జరగనున్నాయి. ఆ స‌మావేశాలు ముగిసేలోగా స‌మీక్షిస్తార‌ని తెలుస్తోంది.

అమరావతిని శాసనసభ రాజధానిగా అభివృద్ధి చేయడంతోపాటు వైజాగ్, కర్నూలులో కార్యనిర్వాహక రాజధాని, న్యాయ రాజధాని ఏర్పాటుపై జగన్ దూకుడుగా వెళుతున్నారు. వికేంద్రీకృత అభివృద్ధి నినాదం అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని వైఎస్‌ఆర్‌సీ ప్రధాన అజెండాగా తీసుకోబోతున్నారు. APలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి YSRC అంకితభావాన్ని వివరిస్తూ, వికేంద్రీకృత అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని జ‌గ‌న్ దిశానిర్దేశం స‌మీక్ష స‌మావేశంలో చేస్తార‌ని తెలుస్తోంది.