TDP- Janasena : రాజమండ్రి వేదికగా జరిగిన టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశంలో మూడు కీలక తీర్మానాలు చేశారు. ‘‘ చంద్రబాబు అరెస్ట్ అక్రమం’’ అనేది వీటిలో మొదటి తీర్మానం. ‘‘అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటానికే టీడీపీ-జనసేన పొత్తు’’ అనేది రెండో తీర్మానం. ‘‘అన్ని వర్గాలను అభివృద్ధి బాటలో నడిపేందుకే ఈ పొత్తు’’ అనేది మూడో తీర్మానం. టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP- Janasena) ఈవివరాలను వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
రాబోయే 100 రోజులకు కార్యాచరణ
‘‘రాబోయే 100 రోజులకు సంబంధించిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాం. ఈ నెల 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లాల స్థాయిలో టీడీపీ, జనసేన నేతలు సమావేశమై చర్చలు జరుపుతారు. నవంబరు 1 నుంచి మేనిఫెస్టో రూపొందించుకుని ఇరు పార్టీలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై టీడీపీ, జనసేన శ్రేణులు పరిశీలించి వాస్తవాలు ఏంటన్నది పార్టీలకు నివేదికలు ఇస్తాయి. జేఏసీ తదుపరి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం’’ అని లోకేశ్ తెలిపారు. ‘‘నాకెలాంటి సందేహం లేదు. 2024లో ఏపీలో టీడీపీ-జనసేన గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.