Site icon HashtagU Telugu

IAS Officers: ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు నెల రోజుల జైలు శిక్ష.. తరువాత నిలుపుదల

Ias officers

Ias officers

ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు.. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖలో గతంలో కమిషనర్ గా చేసిన హెచ్.అరుణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్ లకు ఈ శిక్ష విధించారు. నెల రోజుల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.2,000 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశించారు.

ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారులైన అరుణ్ కుమార్, వీరపాండియన్ లు న్యాయమూర్తిని అభ్యర్థించడంతో తీర్పు అమలును ఆరువారాలపాటు వాయిదా వేశారు. కానీ కోర్టుకు సరైన టైముకు హాజరుకాలేకపోయిన పూనం మాలకొండయ్య విషయంలో మాత్రం తీర్పు అమలును నిలపడానికి న్యాయమూర్తి అంగీకరించలేదు. కోర్టులు ఎవరికోసం ఎదురుచూడవని చెప్పారు.

హైకోర్టు తీర్పు ప్రకారం పూనం మాలకొండయ్య ఈనెల 13వ తేదీ లోపు హైకోర్టు రిజిస్ట్రార్ ముందు సరెండర్ కావాల్సి ఉంది. అయితే.. సింగిల్ జడ్జ్ తీర్పుపై శుక్రవారంనాడే ధర్మాసనం ముందు అత్యవసరంగా అప్పీలు చేయడంతో.. పూనం అప్పీల్ పై విచారణ జరిగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన బెంచ్.. పూనం మాలకొండయ్య కేసులో సింగిల్ జడ్జ్ ఇచ్చిన
తీర్పును నిలిపేసింది.

అసలు ముగ్గురు ఐఏఎస్ లకు శిక్ష పడడానికి కారణమేంటంటే.. కర్నూలు జిల్లాకు చెందిన ఎన్.మదన సుందర్ గౌడ్.. 2019లో హైకోర్టులో వేసిన కేసు. ఇదే జిల్లాకు చెందిన మదన్ ను జిల్లా ఎంపిక కమిటీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-2)గా ఎంపిక చేయలేదు. దీనిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఆ ఉద్యోగానికి పిటిషనర్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని రెండు వారాల్లోనే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని 2019 అక్టోబర్ 22న హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. కానీ ఆ తీర్పు అమలు కాకపోవడంతో పిటిషన్.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.