3 Capitals AP: ఏపీ అసెంబ్లీలో మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల బిల్లు?

మూడు రాజ‌ధానుల అంశాన్ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 05:23 PM IST

మూడు రాజ‌ధానుల అంశాన్ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో మూడు రాజ‌ధానుల అవ‌స‌రాన్ని ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా ఆయ‌న మ‌ళ్లీ వినిపించ‌బోతున్నారు. ఈ స‌మావేశాల్లోనే బిల్లును ప్ర‌వేశ పెడ‌తారా? లేక ప్ర‌జెంటేష‌న్ వ‌ర‌కు ప‌రిమితం అవుతారా? అనేది సందిగ్ధంగా ఉంది.

మూడు రాజ‌ధానుల బిల్లును ఉప‌సంహ‌రించుకున్న రోజే స‌మ‌గ్రంగా బిల్లు తీసుకొస్తామ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు స‌మ‌గ్ర బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌డానికి ఆయ‌న సిద్ధం అవుతున్నారు. వ‌ర్షాకాల స‌మావేశం మొద‌టి రోజే ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత బిల్లును పెట్టే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మంత్రులు అమ‌ర్నాథ్‌, ధ‌ర్మాన ప్ర‌సాద రావు, బొత్సా స‌త్య‌నారాయ‌ణ, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం మూడు రాజ‌ధానులు ఆవ‌శ్య‌క‌త‌ను వినిపిస్తున్నారు. దీనిపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కూడా కోరుతున్నారు.

విశాఖ‌ప‌ట్నం నిర్వ‌హ‌ణ రాజ‌ధానిగా ఉండాల‌ని అక్క‌డి నేత‌లు కోరుకుంటున్నారు. ఆ మేర‌కు ప్ర‌జ‌ల్ని కూడా మాన‌సికంగా సిద్ధం చేస్తున్నారు. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వెల్లి వ‌ర‌కు సాగుతోన్న రైతుల మ‌హాపాద‌యాత్ర 2.0 ను అడ్డుకోవ‌డానికి వైసీపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు మూడు రాజ‌ధానుల‌ను నిర‌సిస్తూ అమ‌రావ‌తి కోసం జోలి ప‌ట్టిన సంద‌ర్భంగా విశాఖ వెళ్లిన ఆయ‌న మీద చెప్పులు విసిరారు. అలాంటి సంఘ‌ట‌న‌లు మ‌ళ్లీ ఉత్త‌రాంధ్ర‌లో పున‌రావృతం కావ‌డానికి అవ‌కాశం ఉంది. ఆ విష‌యాన్ని మంత్రులు స్వ‌యంగా చెబుతున్నారు. అందుకే, పాద‌యాత్ర వ‌ద్దంటూ ఉత్త‌రాంధ్ర నేత‌లు చెబుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మూడు రాజ‌ధానుల అంశాన్ని ఎజెండాగా తీసుకుని వెళ్ల‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యించుకున్నారు. ఆ మేర‌కు పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశార‌ని తెలుస్తోంది. విప‌క్షాలు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడు రాజ‌ధానుల అంశం ఎజెండాగా తీసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స‌వాల్ విసిరిన క్ర‌మంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఆయ‌న ప‌రిపాలన కంటే మూడు రాజ‌ధానుల అంశంపై 2024 ఎన్నిక‌ల్లో చ‌ర్చకు ఎక్కువ‌గా వెళ్ల‌నుంది. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు సెంటిమెంట్ కు ఫీల్ అయితే లాభం చేకూరుతుంద‌ని జ‌గ‌న్మోహన్ రెడ్డి ఆశిస్తున్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ కూడా మూడు రాజ‌ధానుల అంశం నిశ్శ‌బ్ద విప్ల‌వం మాదిరిగా సెంటిమెంట్ గా ఉంద‌ని స‌ర్వే ఇచ్చింద‌ట‌. ఇటీవ‌ల సేక‌రించిన స‌ర్వే ఆధారంగా మూడు రాజ‌ధానుల అంశాన్ని ఎన్నిక‌ల ఎజెండాగా పెట్టాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఆ దిశ‌గా అడుగులు వేస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద‌స‌రా నుంచి విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా మార్చుతార‌ని తెలుస్తోంది.