Site icon HashtagU Telugu

Nellore: ఉక్రెయిన్ లో నెల్లూరు విద్యార్థులు.. ఆందోళ‌నలో త‌ల్లిదండ్రులు!

Ukrain

Ukrain

ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన దాదాపు 12 మంది విద్యార్థులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్ లో బంకర్‌లు, ఇతర ప్రాంతాల్లో వారు త‌లదాచుకుంటున్నారు. తమను దేశం నుంచి తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆశ్రయించారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను భారతదేశానికి తరలించాలని లేదా పరిస్థితి సాధారణీకరించే వరకు కనీసం దేశంలో భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో చదువుతున్నారు. ఇప్పుడు వారు త‌మ‌ తల్లిదండ్రులు, స్నేహితుల‌తో వీడియో కాల్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు.

హరనాథపురం నుండి విశాల్, రవీంద్ర నగర్ నుండి తబస్సుమ్, నేతాజీ నగర్ నుండి శమంత్, వరలక్ష్మి, కొండాయపాలెం నుండి శ్రీ చైతన్య తేజ; వెంకటాచలం నుంచి సాయి సుధాకర్ రెడ్డి, వింజమూరు పట్టణానికి చెందిన నరసింహ తేజ, అనంతసాగరం నుంచి గంగినేని జస్వంత్, కావలి పట్టణానికి చెందిన చ్ లికిత్, జ్వాలా భానుమతి ఉన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల వివ‌రాల‌ను తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు అన్ని మండలాల తహశీల్దార్‌లను కోరారు. అన్ని వివరాలు అందుబాటులో ఉంటే విద్యార్థుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.

Exit mobile version