ఏపీ రాజకీయాలలో గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran) అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తున్న సమయంలో, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అతనిపై దాడికి యత్నించిన ఘటన సంచలనం రేపింది. దీనిపై పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తడంతో, మాధవ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. అయితే ఈ ఘటనలో పోలీసుల తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. మాధవ్‌ను అరెస్ట్ చేసిన తరువాత పోలీసులే కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో, ఈ వ్యవహారం పై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు.
Anupama Parameswaran: నటి అనుపమ ప్రైవేట్ ఫొటో వైరల్.. అసలు నిజమిదేనా?
గోరంట్ల మాధవ్ కోర్టుకు వెళ్లే వరకు తన ఫోన్‌లో మాట్లాడినప్పటికీ, అతనిని వెంట ఉన్న పోలీసులు అడ్డుకోలేదు. మాధవ్ ముసుగు పెట్టుకొనని నిరాకరించడంతో పాటు, పోలీసులను దూషించిన ఘటనలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. పోలీసులు తన పని తాను చేయాల్సిన సమయంలో మాధవ్‌కు సడలింపులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ విచారణ చేపట్టారు. మాధవ్‌ను జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు తీసుకెళ్తూ, కోర్టుకు తరలించేంత వరకు బందోబస్తు లో ఉన్న అధికారుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. కస్టడీలో ఉన్న మాధవ్ ఫోన్ ఉపయోగించినా పట్టించుకోకపోవడాన్ని విచారణలో తీవ్రంగా పరిగణించారు.
ఈ మొత్తం వ్యవహారం పైన డీఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గుంటూరు రేంజ్ ఐజీ 11 మంది పోలీసులపై వేటు వేశారు. వారిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను బదిలీ చేశారు. మాధవ్ వ్యవహారశైలి, పోలీసుల తీరుపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్యలతో పోలీసు విభాగంలో క్రమశిక్షణ కోసం ప్రభుత్వం గట్టి సందేశం ఇచ్చినట్లైంది.