తెలుగు జాతి దిగ్గజం నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ విజయవాడకు చేరుకున్నారు. ఎన్టీఆర్ తనయుడు, ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయంలో రజనీకాంత్‌కు స్వాగతం పలికారు. పోరంకిలో ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం జరగనున్న కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుచంద్రబాబు నాయుడు, ఇతర నేతలు హాజరుకానున్నారు. ఎన్టీఆర్ టాలీవుడ్‌లో లెజెండరీ నటుడుగా చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ 300 చిత్రాల్లో నటించారు. అనేక పౌరాణిక పాత్రల పాత్రను పోషించారు. కృష్ణార్జున యుద్ధం (1962) మరియు దాన వీర శూర కర్ణతో సహా 17 చిత్రాలలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు.
1982లో టీడీపీ ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన అన్న నందమూరి తారకరామారావు తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. మే 28, 1923న ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మించిన ఎన్టీఆర్ 1983 నుండి 1989 వరకు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1994 డిసెంబరులో ఘనవిజయం సాధించి టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే కొన్ని నెలల తర్వాత ఆయన తిరుగుబాటును ఎదుర్కొన్నారు. ఈ తరువాత అనేక పరిణామాలు జరిగాయి. జనవరి 18, 1996న ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారు.