Rs 800 Cr Missing: జ‌గ‌న్ స‌ర్కార్ పై ప్ర‌భుత్వ ఉద్యోగుల కేసు

జ‌గ‌న్ స‌ర్కార్ పై కేసు పెట్ట‌డానికి ప్ర‌భుత్వం ఉద్యోగులు సిద్ధం కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

  • Written By:
  • Updated On - June 29, 2022 / 03:17 PM IST

జ‌గ‌న్ స‌ర్కార్ పై కేసు పెట్ట‌డానికి ప్ర‌భుత్వ ఉద్యోగులు సిద్ధం కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఉద్యోగుల‌కు తెలియ‌కుండా వాళ్ల ఖాతాల నుంచి రూ. 800 కోట్లు ప్ర‌భుత్వం విత్ డ్రా చేసుకుంది. ఆ విష‌యాన్ని తెలుసుకున్న ఉద్యోగ సంఘాల నేత‌లు మీడియా వ‌ద్ద ఏక‌రువు పెట్టారు. సుమారు 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి అన‌ధికారికంగా నిధుల‌ను డ్రా చేశార‌ని ఉద్యోగులు చేస్తోన్న ఆరోప‌ణ‌.

సాధార‌ణంగా జీపీఎఫ్ ఖాతాల నుంచి డ‌బ్బు డ్రా చేసుకున్న‌ప్పుడు సంబంధిత ఉద్యోగుల‌కు ఎస్ఎంఎస్ వ‌స్తుంది. కానీ, ఏ ఒక్క‌రికీ ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం లేదు. గుట్టుచ‌ప్పుడు కాకుండా జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ. 800 కోట్ల‌ను ప్ర‌భుత్వం డ్రా చేసుకుంది. ఆ విష‌యాన్ని ఆల‌స్యంగా తెలుసుకున్న ఉద్యోగ సంఘం నేత‌లు ఆ నిధుల‌ను సంర‌క్ష‌కునిగా ఉండాల్సిన అకౌంటెంట్ జ‌న‌ర‌ల్ (ఏజీ)ని నిల‌దీస్తున్నారు. అక్ర‌మంగా డ్రా చేసిన నిధుల‌కు బాధ్యునిగా ఆయ‌న‌పై కేసు పెట్టాల‌ని ఏపీ ఉద్యోగ సంఘాలు సిద్ధం కావ‌డం విశేషం.

మొత్తం 90,000 మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి అనధికార పద్ధతిలో ₹800 కోట్లు విత్‌డ్రా చేశారని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ ఆరోపించారు. “GPF నిధుల సంరక్షకుడిగా ఉన్న అకౌంటెంట్ జనరల్ (AG), అక్రమ ఉపసంహరణలను ఎలా అనుమతించగలరు అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. సోమవారం రాత్రి జీపీఎఫ్ ఖాతాల వార్షిక స్టేట్‌మెంట్లను ఏజీ అప్‌లోడ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఉద్యోగులు మంగళవారం వాటిని డౌన్‌లోడ్ చేసినప్పుడు షాక్ తిన్నారు. జీపీఎఫ్ సంర‌క్ష‌కుడిగా ఉండాల్సిన ఏజీ తో పాటు అక్క‌డ ప‌నిచేస్తోన్న సంబంధిత‌ అధికారులు నిర్దిష్ట మొత్తాలను విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు.

తన సొంత జీపీఎఫ్ ఖాతా నుంచి ₹83,000 డ్రా చేసినట్లు సూర్యనారాయణ వెల్ల‌డించారు. చాలా మంది ఉద్యోగులు సూర్య‌నారాయ‌ణ మాదిరిగా ఖంగుతిన్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై ఆర్థిక శాఖ మరియు CFMS సహా సంబంధిత శాఖ‌లు ఇలాంటి నిధులు డ్రా చేయ‌డంపై వివ‌ర‌ణ ఇవ్వలేకపోతున్నారు. అందుకే, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఉద్యోగుల నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమకు తెలియకుండా తమ ఖాతాల నుంచి జీపీఎఫ్ మొత్తాలు విత్‌డ్రా అయ్యాయని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. దీంతో ఆగ్ర‌హించిన‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యోగుల అనుమతి లేకుండా వారి ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం నేరమని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సూర్యనారాయణ హెచ్చ‌రించారు.