జగన్ కాపుల కళ్లు పొడిచారు.. వైసీపీ పాలనలో కాపులకు అన్యాయం – టీడీపీ ఎమ్మెల్యే అన‌గాని

వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో కాపులకు జరిగిన అన్యాయం, అవమానం గత ఏ ప్రభుత్వంలోనూ జరగలేద‌ని టీడీపీ ఎమ్మెల్యే

Published By: HashtagU Telugu Desk
Tdp Mla Anagani

Tdp Mla Anagani

వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో కాపులకు జరిగిన అన్యాయం, అవమానం గత ఏ ప్రభుత్వంలోనూ జరగలేద‌ని టీడీపీ ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ తెలిపారు. జగన్ కాపుల్ని ఆర్దికంగా, రాజకీయంగా అణిచి వేసి కాపుల కళ్లు పొడిచారని ఆయ‌న ఆరోపించారు. అధికారంలోకి వచ్చీ రాగానే.. కాపుల అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన 5శాతం రిజర్వేషన్‌ను ఎత్తివేశారని.. ఇచ్చిన రిజర్వేషన్‌ను ఎత్తేసి.. కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ అబద్ధాలు చెబుతూ కాపు సామాజిక వర్గం మొత్తాన్ని మోసం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.3100 కోట్ల నిధులు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేశామ‌ని.. కానీ జగన్ కాపు కార్పొరేషన్‌ రుణాలకు చేసుకున్న దరఖాస్తులను కూడా రద్దు చేశారని తెలిపారు.

కాపులకు శాశ్వత ప్రయోజనం కలిగించాలనే లక్ష్యంతో ఎన్నికల హామీల్లో భాగంగా కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామ‌ని.. ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథ‌కం ద్వారా 4,528 మంది కాపు విద్యార్ధులకు లబ్ధి, ఎన్టీఆర్‌ ఉన్నత విద్యా పథ‌కం ద్వారా రూ.28.26 కోట్లతో 1,413 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూర్చామ‌న్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని కాపు నాయకునికి ఇచ్చామ‌ని.. కానీ జగన్ కాపు నేతల్ని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఎమ్మెల్యే అన‌గాని ఆరోపించారు. ప్రతి జిల్లాలో కాపు భవన్‌లను నిర్మించామ‌ని..ఒక్కో భవనానికి రూ.5కోట్లు కేటాయించామ‌ని తెలిపారు. సీఎం జగన్ కాపు భవన్ లను నిర్వీర్యం చేసి తాను మాత్రం ఊరికొక ప్యాలెస్ కట్టుకుంటున్నారని ఆరోపించారు. కాపులను అన్ని విధాల అణగద్రోక్కుతున్న జగన్ కి బుద్ది చెప్పేందుకు కాపులు సిద్దంగా ఉన్నారన్నారు

  Last Updated: 12 Feb 2023, 10:19 AM IST