Sachin – Deepfake : సచిన్‌ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌.. ఏముందో తెలుసా?

Sachin - Deepfake : డిజిటల్ కంటెంట్‌ తయారీలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ దుర్వినియోగం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - January 15, 2024 / 07:02 PM IST

Sachin – Deepfake : డిజిటల్ కంటెంట్‌ తయారీలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ దుర్వినియోగం జరుగుతోంది. ఈ సాంకేతికతతో డీఫ్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రముఖులపై ఇలాంటి వీడియోలు తీసిన సందర్భాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌ అవుతోంది. ఒక గేమింగ్‌ యాప్‌ తరఫున సచిన్ మాట్లాడుతూ.. దానికి ప్రచారం కల్పిస్తున్న విధంగా ఈ డీప్ ఫేక్ వీడియో ఉంది. ‘స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’ పేరుతో ఉన్న గేమింగ్‌ యాప్‌ తరఫున సచిన్‌ ప్రచారం చేస్తున్నట్లుగా అందులో ఉంది. ఈ యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో సచిన్ వివరిస్తున్నట్లుగా వీడియోను మార్ఫింగ్‌ చేయడం గమనార్హం. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో  చివరకు సచిన్‌ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన దీనిపై(Sachin – Deepfake) స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

డీప్ ఫేక్ వీడియోలోని వ్యాఖ్యలను సచిన్ ఖండించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని  స్పష్టం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.‘‘ఈ వీడియోలు నకిలీవి. టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ కన్పించినా నెటిజన్స్ వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలి. సోషల్‌ మీడియా మాధ్యమాలు అప్రమత్తంగా ఉంటూ ఈ ఫిర్యాదులపై స్పందించాలి. నకిలీ సమాచారం, డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరం’’ అని సచిన్ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌ను కేంద్ర ఐటీశాఖ మంత్రి, మహారాష్ట్ర సైబర్‌ విభాగం ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్లకు ట్యాగ్‌ చేశారు. ఆ మధ్య సచిన్‌ కుమార్తె సారా టెండూల్కర్ కూడా డీప్‌ ఫేక్‌ బారిన పడ్డారు. టీమ్‌ ఇండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా ఉన్నట్లు ఒక మార్ఫింగ్‌ ఫొటో వైరల్‌ అయ్యింది. సారా తన సోదరుడు అర్జున్‌ టెండూల్కర్‌తో ఉన్న ఫొటోను కూడా డీప్‌ఫేక్‌ చేశారు. అర్జున్‌ ముఖం స్థానంలో గిల్‌ ఫొటోను మార్చి  వైరల్‌ చేసినట్లు వెల్లడైంది. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారని, వాటిని నమ్మొద్దని తెలిపారు.

Also Read: FASTag – KYC : ఇక ఆ ఫాస్టాగ్స్ పనిచేయవు.. జనవరి 31 వరకే ఛాన్స్

డీప్‌ఫేక్ వీడియోలను ఎలా తనిఖీ చేయాలి

  • వీడియోలో విచిత్రమైన, విభిన్నమైన ముఖ కదలికలు, వ్యక్తీకరణలు ఉంటే సందేహించాలి.
  • ఇబ్బందికరమైన శరీర భంగిమలు, శరీర నిష్పత్తులు, అసహజ కదలికలు ఉండేవి డీప్‌ఫేక్‌ వీడియోలే.
  • వ్యక్తి పెదవులతో సరిపోలని ఆడియోను జాగ్రత్తగా వినండి.
  • వ్యక్తి యొక్క సాధారణ ప్రవర్తన.. వీడియోలోని సీన్‌లు సరిపోతాయో లేదో చెక్ చేయండి.
  • వీడియోలోని విజువల్స్‌పై డౌట్ వస్తే..  విశ్వసనీయత కోసం దాని సోర్స్‌ను తనిఖీ చేయాలి.
  • వీడియోలోని వ్యక్తి జీవన శైలి, భావజాలానికి విరుద్ధమైన వ్యాఖ్యలు ఉంటే దాని సోర్స్‌ను తనిఖీ చేయాలి.