Keerthi Jalli: తెలుగువారి కీర్తిని పెంచిన ఐఏఎస్ కీర్తి జల్లి.. అసోం వరదల్లో బాధితులకు అండదండలు

ఏ తెలుగు బిడ్డ అయినా తెలుగు బిడ్డ. ఎక్కడ ఉన్నా.. తన స్వార్థం చూసుకోకుండా.. పదిమందికి సాయం చేయడం తెలుగువారి అలవాటు.

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 04:00 PM IST

ఏదైనా తెలుగు బిడ్డ తెలుగు బిడ్డే. ఎక్కడున్నా సరే.. తన స్వార్థం చూసుకోకుండా.. పదిమందికి సాయపడడం తెలుగువారికి అలవాటు. కీర్తి జల్లి కూడా అంతే. పేరుకు ఐఏఎస్ అధికారి. కానీ ఆ దర్పం, దర్జా ఏమీ కనిపించనివ్వరు. ప్రజాసేవే పరమావధి అన్నట్టుగా కంకణం కట్టుకున్నారు. అసోం వరదల్లో బాధితులను పరామర్శించడానికి, వారికి సహాయపడడానికి స్వయంగా వరద ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్న తీరును చూసి దేశమంతా ప్రశంసించింది. కానీ అవేవీ పట్టించుకోకుండా.. బాధితులకు సహాయం అందించడంలో బిజీ బిజీగా ఉన్నారు కీర్తి.

అస్సాం వాసులకు వరదలు కొత్త కాదు. కానీ అంతటి వర్షాలు, వరదల్లో ఓ ఐఏఎస్ అధికారి తమను చూడడానికి రావడం, ప్రభుత్వముందని భరోసా ఇవ్వడం, సహాయ కార్యక్రమాలను చేపట్టడం చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. ఇంతటి కీర్తిని మూటగట్టుకున్న కీర్తి మాత్రం.. అది తన డ్యూటీతోపాటు సామాజిక బాధ్యతగానే భావించారు. సింపుల్ గా చీరకట్టులో చెప్పులు లేకుండానే.. మోకాలి లోతు మట్టిలో నెమ్మదిగా అడుగులు వేస్తూ.. ప్రభుత్వ సహాయక చర్యల అమలు తీరును ఆమె పర్యవేక్షించారు.

కీర్తి స్వస్థలం వరంగల్ జిల్లా. ఆమె తండ్రి ఓ న్యాయవాది. ఆయన పేరు జల్లి కనకయ్య. తల్లి పేరు వసంత. 1989లో పుట్టిన కీర్తి.. 2011లో బీటెక్ పూర్తి చేశారు. కానీ ఎప్పటికైనా ఐఏఎస్ అవ్వాలనుకున్నారు. అందుకే పట్టుదలతో చదివి 2013లో సివిల్స్ లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకును, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకును సాధించారు. తరువాత జోర్ హట్ జిల్లాలో సబ్ డివిజనల్ ఆఫీసర్ గా చేస్తున్నప్పుడు అక్కడ ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేశారు. భోనీ బొమ్మల సాయంతో ఓటింగ్ ని పెంచారు. ఈ కృషికి గాను రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డును అందుకున్నారు.

హైలాకండి ప్రాంతంలో టీ ఎస్టేట్స్ లో పనిచేసే మహిళలను రక్తహీనత పీడిస్తోందని ఆమెకు అర్థమైంది. అందుకే వెంటనే స్థానికంగా దొరికే కొండ ఉసిరిని, బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టించారు. వాటితో ఉసిరి మురబ్బాలను తయారుచేయించారు. వీటిని మహిళలకు ఇవ్వడంతో మంచి ఫలితాలు వచ్చాయి. అంగన్ వాడీ పిల్లల విషయంలోనూ ఇంతే. వారంలో ఒక రోజు తల్లులే తమ పిల్లలకు భోజనం క్యారేజీ ఇచ్చి పంపించాలి. ఆ పిల్లలు తమ బాక్సులను వేరొకరికి ఇచ్చి వేరేవారి బాక్సులను తాము తీసుకుని తినాలి. దీని పేరు డిబ్బీ ఆదాన్ ప్రదాన్. అంటే పిల్లలు ఇతర రకాల ఆహారం కూడా తింటారు కాబట్టి పోషకాహార లోపం లేకుండా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కీర్తి ఆలోచనకు, దాని అమలుకు చేసిన ప్రయత్నానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి.

కీర్తి ప్రతిభను, పనితీరును గమనించిన ప్రభుత్వం ఆమెను కచార్ జిల్లాకు బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆమె అక్కడ తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆదిత్య శశికాంత్ ను పెళ్లి చేసుకున్న మరుసటి రోజే ఆమె డ్యూటీలో చేరిపోయారంటే.. తన వృత్తి, పనిపట్ల ఎంత అంకితభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలో కూడా అత్యుత్తమ సేవలను ప్రజలకు అందించారు. సిల్ చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కేవలం 16 పడకల ఐసీయూ మాత్రమే ఉంది. కానీ కొవిడ్ సమయంలో అవి ప్రజలకు చాల్లేదు. అందుకే కొత్తగా మరో ఐసీయూ యూనిట్ ను దగ్గరుండి కట్టిస్తున్నారు.

కీర్తి పనితీరును చూసి దేశమంతా అచ్చెరువొందుతోంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు అంటే.. ప్రభుత్వం చెప్పిన పనులను తు.చ. తప్పకుండా అమలుచేసేవారే అని చాలామంది అనుకుంటారు. కానీ వారు ప్రజాసేవకులు అన్న మాటను నిజం చేస్తున్నారు కీర్తి. ఇలాంటి ఐఏఎస్ లు రాష్ట్రానికి పది మంది ఉన్నా చాలు.. దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.