History Mystery : నెహ్రూ..మౌంట్‌బాటన్‌..ఒక రాజదండం

న్యూ పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర కొలువుతీర బోతున్న "సెంగోల్" రాజదండం(History Mystery).. ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది.

  • Written By:
  • Publish Date - May 27, 2023 / 07:25 AM IST

న్యూ పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర కొలువుతీర బోతున్న “సెంగోల్” రాజదండం(History Mystery).. ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. అధికార మార్పిడికి గుర్తుగా దేశ తొలి ప్రధాని నెహ్రూ ఈ రాజదండాన్ని బ్రిటీష్ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ నుంచి అందుకున్నారని బీజేపీ అంటుంటే.. అదంతా కట్టుకథ అని కాంగ్రెస్ పార్టీ కొట్టి పారేస్తోంది. ఎక్కడో మ్యూజియంలో ఉన్న రాజదండాన్ని తీసుకొచ్చి.. నెహ్రూకు అంటగట్టి బీజేపీ ఫేక్ స్టోరీస్ ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ శుక్రవారం ఆరోపించారు. తమిళనాడులో రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ఈ వాదనను తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. “మద్రాస్ ప్రావిన్స్‌లోని ఒక మఠం ద్వారా తయారు చేయించిన రాజదండాన్ని(History Mystery) నెహ్రూకు బహూకరించారు. అయితే ఈ రాజదండాన్ని భారతదేశానికి బ్రిటీష్ వాళ్ళ నుంచి అధికార బదిలీకి చిహ్నంగా వాడారు అనేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు” అని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. జైరాం రమేష్ వాదనపై ట్విటర్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ఎందుకు అంతగా ద్వేషిస్తుందని ప్రశ్నించారు. భారతదేశ స్వాతంత్య్రానికి ప్రతీకగా, అధికార బదిలీకి చిహ్నంగా తమిళనాడుకు చెందిన శైవ మఠం పండిట్ నెహ్రూకు పవిత్రమైన సెంగోల్ రాజదండాన్ని అందించిందని అమిత్ షా అన్నారు. “కాంగ్రెస్ పార్టీ సెంగోల్ కు విలువ ఇవ్వకుండా మ్యూజియంలో పెట్టింది. కేవలం దాన్ని ఓ వాకింగ్ స్టిక్‌లా చూసింది. సెంగోల్‌ ను తయారు చేయించిన శైవమఠమే స్వయంగా దాని పవిత్రతను వివరించింది. అయినా కాంగ్రెస్ బోగస్ అని అనడం అవమానకరం” అని షా వ్యాఖ్యానించారు.

Also read : Sengol History : ‘సెంగోల్’ రాజదండం.. థ్రిల్లింగ్ హిస్టరీ

చారిత్రక ఆధారాల సంగతేంటి ?

  • తమిళనాడుకు చెందిన చోళరాజుల కాలంలో.. పాలనాధికారాల మార్పిడికి చిహ్నంగా రాజదండాన్ని వాడే వారు. రాజు కాబోయే వ్యక్తి .. రాజ గురువు చేతుల మీదుగా రాజ దండాన్ని అందుకునే సంప్రదాయం ఉండేది. తమిళ భాషలో సెంగోల్ అంటే ధర్మం అని అర్ధం. బంగారు పూత కలిగిన ఈ వెండి రాజదండం తయారీకి ఎంత ఖర్చయిందనే సమాచారం అందుబాటులో లేదు. 5 అడుగులకుపైగా పొడవు ఉండే ఈ దండంపై నంది చిహ్నం కూడా ఉంది. నంది చిహ్నం న్యాయానికి గుర్తు.
  • ఈ రాజ దండాన్ని తమిళనాడుకు చెందిన తిరువావడుదురై ఆధీనం మఠం నిర్వాహకులు.. మద్రాస్‌కి చెందిన ప్రముఖ నగల తయారీదారు ఉమ్మిడి శెట్టి జ్యుయెల్లర్స్ తో తయారు చేయించి 1947 ఆగస్టు 14న రాత్రి 11.45 గంటలకు నెహ్రూకు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పత్రికా కథనాలు, ఫొటో ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే అధికార మార్పిడికి గుర్తుగా ఏం కార్యక్రమాలు చేపట్టబోతున్నారని నెహ్రూను బ్రిటీష్ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ అడిగినట్లు కానీ.. ఆ తర్వాత దీనిపై రాజాజీని నెహ్రూ సలహా కోరినట్లు కానీ స్పష్టమైన ఆధారాలు లేవని పలువురు చరిత్ర నిపుణులు అంటున్నారు. మౌంట్‌బాటన్‌కు సెంగోల్ రాజదండం ఇచ్చి.. ఆయన చేతుల మీదుగా నెహ్రూ దాన్ని తీసుకున్నట్టు కూడా సమాచారం లేదని చెబుతున్నారు.
  • వీపీ మీనన్ రాసిన ‘‘ది ట్రాన్స్‌ ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా’’ అనే పుస్తకంలోనూ ఈ రాజదండాన్ని నెహ్రూ కు మౌంట్‌బాటన్‌ అందజేశారనే ప్రస్తావన లేదు.
  • ఇంగ్లండ్ లోని  సౌతాంప్టన్ యూనివర్సిటీలో ఉన్న లార్డ్ మౌంట్ బాటన్ పత్రాల ప్రకారం.. ఆగస్టు 14న రాత్రి ఇండియాకు అధికార మార్పిడి సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ జెండాను అవనతం చేయడం, భారత జాతీయ జెండాను ఎగరవేయడం మినహా సెంగోల్ రాజదండం ప్రస్తావన ఎక్కడా లేదు. ఫొటోగ్రాఫిక్ ఎవిడెన్స్‌ ను చూసినా.. ఆధీనం మఠానికి చెందిన వ్యక్తులు ఈ దండాన్ని నెహ్రూకు అందజేసినట్లు ఫొటోలలో స్పష్టంగా కనిపిస్తుంది. మౌంట్ బాటన్ ఇచ్చినట్లు ఎక్కడా ఫొటో ఆధారాలు లేవు.

Also read : New Parliament : ఉదయం 7.30 టు మధ్యాహ్నం 2.30.. పార్లమెంట్ ప్రారంభోత్సవం ఇలా

అలా మ్యూజియంలోకి.. ఇలా వెలుగులోకి..

నెహ్రూకు సెంగోల్ రాజదండం అందజేస్తున్న ఫొటో ఒకటి తిరువావడుదురై ఆధీనం మఠంలో ఉండటాన్ని 2018లో కొందరు గమనించారు. ఈ విషయంపై అప్పట్లో ఓ వారపత్రికలో కథనం ప్రచురితమైంది. చెన్నైలోని ఉమ్మిడి శెట్టి జ్యుయెలర్స్ షాపులో ఈ రాజదండం తయారైందని అందులో పేర్కొన్నారు. ఇది గమనించిన ఆ షాపు నిర్వాహకులు సెంగోల్ రాజదండం ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. ఇందులో భాగంగా వారు అనేక మ్యూజియాలకు లేఖలు రాశారు. కొన్ని నెలల తర్వాత అలహాబాద్‌లోని ఆనంద భవన్‌ మ్యూజియం నుంచి ఒక రిప్లై వచ్చింది. తమ వద్ద అలాంటి రాజదండం ఉందని మ్యూజియం అధికారులు చెప్పారు. మూడు నెలల తర్వాత దానికి సంబంధించిన ఫొటోను పంపారు. ఆ తర్వాత ఉమ్మిడి జ్యుయెలర్స్ సభ్యులు మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడ ఈ దండంను నెహ్రూ రాజదండంగా పేర్కొంటూ ప్రదర్శనకు పెట్టి ఉండటాన్ని చూసి సంతోషించారు. రాజదండం పూర్వాపరాలను మ్యూజియంకు వివరించి, చెన్నైకి తిరిగి వచ్చిన ఈ జ్యుయెలర్ వ్యాపారులు సంబంధిత వీడియోను వాట్సాప్‌లో షేర్ చేశారు.అది వైరల్‌గా మారింది. కొందరు ముఖ్యులు చూసి .. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయం దానిని పరిశీలించిన తర్వాత పార్లమెంటులో లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర ప్రతిష్టించాలని నిర్ణయించిందని ఉమ్మిడి బంగారు జ్యుయెలర్స్ మేనేజింగ్ పార్ట్‌ నర్ అమరేంద్రన్ చెప్పారంటూ ఓ మీడియా సంస్థ కథనాన్ని పబ్లిష్ చేసింది.

డ్యాన్సర్ పద్మా సుబ్రహ్మణ్యం ఇచ్చిన సమాచారంతో..

“2021 ఫిబ్రవరిలో ఓ తమిళ పత్రిక సెంగోల్ రాజదండం గురించి న్యూస్  స్టోరీని పబ్లిష్ చేసింది. దానిని నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం ఆంగ్లంలోకి తర్జుమా చేసి, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపారు. దీంతో అది ఎక్కడో ఉందో తెలుసుకోవాలని ప్రధాని మోడీ కార్యాలయం ఆదేశించింది. ఎట్టకేలకు దానిని అలహాబాద్ లోని ఆనంద భవన్‌ మ్యూజియంలో గుర్తించారు. 2022 నవంబర్ 4న రాజ దండాన్ని అలహాబాద్‌ మ్యూజియం నుంచి ఢిల్లీలోని నేషనల్ మ్యూజియానికి తరలించారు” అని ఇటీవల చెన్నైలో మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.