Floods: ఎందుకీ వరదల ముప్పు..? ఎవరిది తప్పు..?

బుధవారం అరగంట పాటు కుండపోతగా కురిసిన వర్షంతో (Floods) హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. కేవలం 100 మిల్లీమీటర్ల వర్షపాతానికి నగరాలు మునిగిపోయే ప్రమాదం దాపురించింది.

  • Written By:
  • Updated On - September 28, 2023 / 01:33 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Floods: బుధవారం అరగంట పాటు కుండపోతగా కురిసిన వర్షంతో (Floods) హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. కేవలం 100 మిల్లీమీటర్ల వర్షపాతానికి నగరాలు మునిగిపోయే ప్రమాదం దాపురించింది. నిన్న సాయంత్రం సరిగ్గా 5 గంటలకు కురిసిన వర్షానికి హైదరాబాదులో కొన్ని ప్రాంతాలు దాదాపు మునిగిపోయినంత పనయింది. లంగర్ హౌస్ లో 94 ఎంఎం, శివరాంపల్లిలో 72.8 mm, షేక్పేట 61.8, మిగిలిన ప్రాంతాల్లో 40 నుంచి 50 ఎంఎం వరకు వర్షపాతం నమోదయింది. ఈ మాత్రం వర్షపాతం గతంలో పడలేదా, అంటే గతంలో కూడా ఇంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైన సందర్భాలు ఉన్నాయి. కానీ రాను రాను కురుస్తున్న వర్షాల తీవ్రత కంటే అవి సృష్టించే ప్రమాద తీవ్రతే ఎక్కువగా కనిపిస్తుంది. సెప్టెంబర్ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో తక్కువ కాలంలో ఎక్కువ వర్షపాతం నమోదయి అల్లకల్లోలం సృష్టించింది.

గత శనివారం నాగపూర్ లో అకస్మాత్తుగా కురిసిన వర్షం నాగపూర్ నగరాన్ని అల్లకల్లోలం చేసింది. కేవలం 100 mm వర్షపాతంతో నాగపూర్ పట్టణం నాలుగు వైపులా జలదిగ్బంధనానికి గురైంది. అనేకమంది ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతే కాదు ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. కేవలం నాగపూర్ కాదు ఉత్తరాదిన ఇటీవల కాలంలో విద్యుత్ వేగంతో కురిసిన వర్షాలు అనేక రాష్ట్రాల్లో ప్రళయం సృష్టించాయి. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో వర్షాలు సృష్టించిన భయోత్పాత పరిస్థితులు భవిష్యత్తును చాలా భీతావహంగా మారుస్తున్నాయి.

జూలై 9వ తేదీన ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. యమునా నది కోపోద్రిక్తంగా ఉప్పొంగి నగరాన్ని ముంచెత్తింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇటీవల వర్షాలకు లిబియా అల్లకల్లోలమైన వార్త మనల్ని భయపెడుతుంది. అయిదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. సౌతాఫ్రికాలో ఇదే నెలలో కురిసిన వర్షం మరో భయానక ఉదాహరణ. ఈ దేశం ఆదేశం అని లేదు. ప్రతి దేశంలో ప్రతి చోటా ఆకస్మిక వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

చరిత్రలో ఎన్నోసార్లు ఇంతకంటే భయానకమైన వర్షాలు కురిసిన ఉదంతాలు లేకపోలేదు. కానీ అప్పుడు నగరాలు మునిగిపోయిన సందర్భాలు తక్కువ. ఇప్పుడే ఇలా ఎందుకు జరుగుతుందనేది పెద్ద ప్రశ్న. దీనికి కారణంగా పలువురు వాతావరణ నిపుణులు, మేధావులు, శాస్త్రవేత్తలు అనేక విషయాలు చెబుతున్నారు. ముఖ్యంగా నదీ పరివాహ ప్రాంతాలను ఆవాస కేంద్రాలుగా మార్చి, నదులను ఒక పరిమిత ప్రాంతానికి రాను రాను కుదిస్తూ పోతున్నారు.

Also Read: MS Swaminathan Passed Away: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

ఇది నదుల ఆగ్రహానికి ఒక ప్రధాన కారణం. యమునానది స్వేచ్ఛగా ప్రవహించే ప్రాంతాలను జనావాసాలుగా మార్చి కార్పొరేట్ కబ్జాలకు తలుపులు తెరిచిన దుష్పరిణామాల ఫలితంగా ఢిల్లీ వర్షాలను చూడాలని నిపుణులు చెప్తున్నారు. అలాగే ప్రతి నగరంలోనూ డ్రైనేజీ సిస్టం ఆధునిక అవసరాలకు సరిపడా వృద్ధి చేయకపోవడం మరో కారణం. చెరువులను పూడ్చి వేయడం, నగరంలో కురిసిన వాన వెలుపులకు వెళ్లే దారులు మూసివేయడం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, విల్లాలు జనావాస ప్రాంతాల నిర్మాణం కోసం నదులను చెరువులను మాయం చేసే ముందు చూపులేని ఆధునికత ఇలాంటి జలప్రళయాలకు మరో కారణంగా నిపుణులు చెప్తున్నారు.

అంతేకాదు అడవులను అప్పనంగా కార్పొరేట్లకు అప్పగించి వాటిని మటుమాయం చేసి మరింత ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వేదాంతలాంటి కంపెనీలకు అడవులను ధారాదత్తం చేస్తున్న వారికి ఈ విషయాలు పట్టడం లేదు. అడవులు సమృద్ధిగా ఉంటే ఎంత వాన నీటినైనా అవి కడుపులో దాచుకుంటాయి. నగరాలలో నాలాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ సవ్యంగా ఉంటే ఎంత వాన నీరైనా వెలుపలకు వెళ్ళిపోతుంది. ఇంత చిన్న విషయాలను కూడా ఎవరో స్వార్ధ ప్రయోజనాల కోసం విస్మరించడం వల్ల నగరాలు జలప్రళయాలకు నిలయాలుగా మారుతున్నాయి. 2015లో చెన్నైలో కురిసిన వానకి, కొద్దిపాటి వరదకి ఆ నగరం ఎంత అల్లకల్లోలం అయిందో మనకు గుర్తే ఉంటుంది.

అందుకే ప్రమాదం ముంచుకొచ్చాక పరిష్కార మార్గాలు ఆలోచించడం తెలివి తక్కువతనం. ప్రమాదాలు ముందుగానే ఊహించి వాటి పరిష్కారాలను ముందుగానే కనుగొని వాటి అమలు కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వాలు పనిచేసినప్పుడే ఎలాంటి ప్రకృతి ప్రళయాలనైనా మనం తట్టుకోగలుగుతాం. కొన్ని ప్రళయాలు చెప్పి రావు‌. కానీ అనేక ప్రళయాలను మన ముందు చూపుతో ఆపగలం. మేమే విశ్వ నగర నిర్మాతలం అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు, మేమే విశ్వ గురువులం అని డంబాలు పలికే వాళ్ళు కురిసే వాన నీటిని అదుపులో పెట్టి, నగరాలను కాపాడగలిగితే అంతే చాలు. లేకుంటే నదులు సహజంగానే ఆగ్రహిస్తాయి.