BRS Party: సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ₹2లక్షల రుణమాఫీ చేయాలి : బోయినపల్లి వినోద్ కుమార్

  • Written By:
  • Updated On - March 28, 2024 / 10:39 AM IST

BRS Party: రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు సాగు నీళ్లు లేక ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారని… కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకునే సమయం ఉంటుంది కానీ…ఎండిన పంటలను పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పే సమయం కూడా లేదా అని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

మానకొండూర్ నియోజకవర్గం లోని బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్ల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం కాఫర్ డ్యాం నిర్మాణం చేసినట్లయితే ఇప్పుడు కరువు వచ్చే పరిస్థితి ఉండేది కాదని…గోదావరి నదిలో ప్రభుత్వ అసమర్థత కారణంగా రోజుకు 5000ల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నామని పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎర్రటి ఎండల్లో కూడా కాల్వల ద్వారా చెరువులకు నీళ్లు విడుదల చేయించడంలో పంటలు ఎండలేదని….కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు.

అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు ₹2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో రైతులు పంట రుణాలు తీసుకున్నారని, ఇప్పుడు బ్యాంకు అధికారులు ప్రభుత్వంతో సంబంధం లేదు..తీసుకున్న రుణాలు కట్టాలని రైతుల ఇంటికి వెళ్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ₹2లక్షల రుణమాఫీ చేయాలని..బ్యాంకు అధికారులు రైతుల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం బ్యాంకులకు రుణాలు చెల్లిస్తామని గ్యారంటీ ఇవ్వాలని…దీనికి సబంధించిన జీవోలను విడుదల చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు రైతుల ఇళ్ల వద్దకు బ్యాంకు అధికారులు వచ్చే వారని….మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.