Qutub Shahi Tombs: హైదరాబాద్ చరిత్రకు మెరుపులు అద్దుతున్న ఆగాఖాన్‌ ట్రస్ట్‌.. కుతుబ్‌ షాహీల సమాధులకు పూర్వ వైభవం!

గోల్కొండ ఖిల్లాకు అత్యంత సమీపంలో ఇబ్రహీంబాగ్‌లో ఉన్న కుతుబ్‌ షాహీల 30 సమాధులు ఉన్నాయి. వీటిలో 5వ గోల్కొండ సుల్తాను మహ్మద్ కులీ కుతుబ్‌ షా సమాధి అతిపెద్దది. ఒకప్పుడు ఇవి కళ తప్పి ఉండేవి.

  • Written By:
  • Updated On - September 20, 2022 / 06:38 PM IST

గోల్కొండ ఖిల్లాకు అత్యంత సమీపంలో ఇబ్రహీంబాగ్‌లో ఉన్న కుతుబ్‌ షాహీల 30 సమాధులు ఉన్నాయి. వీటిలో 5వ గోల్కొండ సుల్తాను మహ్మద్ కులీ కుతుబ్‌ షా సమాధి అతిపెద్దది. ఒకప్పుడు ఇవి కళ తప్పి ఉండేవి. ఇప్పుడవి తళతళ మెరుస్తున్నాయి. కళకళలాడుతున్నాయి. ఈ మెరుపుల వెనుక ఒక కృషి ఉంది. ఒక చొరవ ఉంది. అదే..ఆగాఖాన్‌ ట్రస్ట్‌!! గోల్కొండ కోట కేంద్రంగా దక్కన్‌ రాజ్యాన్ని 175 ఏళ్లు ఏలిన కుతుబ్‌షాహీల్లోని ఏడుగురు నవాబుల   సమాధులను(సెవెన్‌ టూంబ్స్‌) ఇండో పర్షియన్‌ శైలిలో నిర్మించారు. ఇప్పుడు వీటిని పునరుద్ధరించింది ఆగాఖాన్‌ ట్రస్టే.
ఈ పనుల కోసం టాటా ట్రస్ట్‌ కూడా ఆర్థిక సహకారం అందించింది. సుమారు రూ.100 కోట్లతో గత ఏడేళ్లలో ఈ పనులు చేశారు.బెంగాల్‌ వాస్తు, నిర్మాణ నిపుణులు ఈ సమాధులకు డంగుసున్నంతో సొబగులు అద్ది పూర్వ వైభవం తీసుకొచ్చారు.  గోల్కొండ రాజ్యాన్ని పాలించిన ఎనిమిది మంది పాలకుల్లో ఏడుగురితో పాటు మరో డెబ్బై మంది రాజవంశీకులను మరణానంతరం ఇబ్రహీంబాగ్‌లోనే సమాధి చేశారు. చివరి రాజు తానీషా.. ఔరంగజేబు చేతుల్లో బందీగా వెళ్లడంతో ఆయన సమాధి ఇక్కడ లేకుండాపోయింది.

నాడు సాలార్‌జంగ్‌ ఆధ్వర్యంలో..

కుతుబ్‌షాహీ కాలంలో గొప్పగా ఆదరణ పొందిన సమాధులను 19వ శతాబ్దంలో మూడో సాలార్‌జంగ్‌ ఆధ్వర్యంలో ఆధునికీకరించారు. వాటి
చుట్టూ ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. అద్భుతమైన నిర్మాణ శైలితో ఉన్న సమాధుల గోపురాలు, ఆర్చిలు, రాతి కట్టడాలు, షాండ్లియర్లు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఆగాఖాన్‌ ట్రస్ట్‌ పునరుద్ధరణ చేసింది. సుల్తాన్‌ కులీ కుతుబ్‌ షా, హయత్‌ బక్షీ బేగం సమాధుల సుందరీకరణ సైతం పూర్తయింది. నవాబులు, వారి కుటుంబాల మృతదేహాల ఖననానికి ముందు బంజారా దర్వాజా నుంచి బయటకు తీసుకువచ్చి స్నానం చేయించే ప్రాంగణానికి కూడా అత్యంత సుందరంగా కళాకారులు నగిషీలు చెక్కారు. అతిపెద్ద నిర్మాణమైన సుల్తాన్‌ కులీ కుతుబ్‌ షా సమాధినీ మళ్లీ పునరుద్ధరించారు.యునెస్కో నిబంధనల ప్రకారం ప్రత్యేక చారిత్రక కట్టడాలకు 100 మీటర్ల పరిధిలో ఆక్రమణలు లేకుండా చూడాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే మరో ప్రపంచ వారసత్వ హోదా కోసం కుతుబ్‌ షాహీల సమాధులు
పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది.

తండ్రి పేరు ఇబ్రహీం కులీ కుతుబ్ షా , తల్లి పేరు భగీరథి..

మొఘల్ వంశానికి చెందిన ఔరంగజేబు 1687 సంవత్సరంలో హైదరాబాద్ పై దండయాత్ర చేశాడు. అంతకుముందు వరకు హైదరాబాద్ ను గోల్కొండ సుల్తానులు ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. గోల్కొండ సుల్తానుల్లో ఐదోవాడి పేరు కులీ కుతుబ్ షా.
ఆయన తండ్రి పేరు ఇబ్రహీం కులీ కుతుబ్ షా , తల్లి పేరు భగీరథి. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన, చార్మినార్ ను కట్టిన ఘనుడు కులీ కుతుబ్ షానే.

చారిత్రక మెట్ల బావులకు పూర్వ వైభవం..

గ్రేటర్‌లో చారిత్రక మెట్ల బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ, కుడా, టూరిజం, హెచ్‌ఎండీఏ శాఖలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక మెట్ల (దిగుడు) బావులను శుభ్రం చేసి, పునరుద్ధరించారు.
2013లో బడీ బౌలిని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచిన ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ మొత్తంగా ఆరు బావులను గడిచిన 3 సంవత్సరాలలో శ్రమించి వేగంగా పునర్నిర్మించారు. బడీబౌలి 16.5 మీటర్ల లోతుతో పునరుద్ధరించారు.
సెవన్‌టూంబ్స్‌ జంషీడ్‌ కులీకుతుబ్‌షా పశ్చిమ వైపున ఉన్న పశ్చిమ బౌలి నీటి సామర్థ్యం 3.7 మిలియన్‌ లీటర్లు. దీనిని రిటైనింగ్‌ వాల్స్‌ 18 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ బావిని దుర్గం చెరువు నీళ్లతో నింపారు. అదే విధంగా కుతుబ్‌షాహిల కాలంలో ఈ బావి నుంచే గోల్కొండ కోటకు పైపులైన్‌ ద్వారా నీటి సరఫరా జరిగేది. నవాబులు ఈ నీటినే తమ అవసరాలకు వాడుకునేవారు.

హమామ్‌ బౌలి..

హమామ్‌ బౌలిని కుతుబ్‌షాహిలు స్నానాల కోసం వాడేవారు. పూర్తిగా పాడైన ఈ బావిని ఇరానీల స్నానాల గదుల పద్ధతిలో పునర్నిర్మించారు. ఈ బావిలోకి వెళ్లడానికి మెట్లను నిర్మించారు. దీని నీటి సామర్థ్యం 4.7 మిలియన్‌ లీటర్లు.ఈద్గా బౌలిని పెద్ద, పెద్ద గ్రానైట్‌ రాళ్లతో పునర్నిర్మించారు. అన్ని బావుల కన్నా భిన్నంగా దీనిని ఎంతో నైపుణ్యంతో నిర్మించారు. ఇందులో గ్రానైట్‌ రాళ్లను చేతి పనితో తయారు చేసి పెట్టారు. మెట్లు మొత్తం చాలా జాగ్రత్తగా పెట్టడానికి నిపుణులైన పనివారు శ్రమించారు. 25 మీటర్ల లోతు వరకు ఈ బావిలోకి మెట్లు ఉన్నాయి. ఈద్గా బౌలి చుట్టూ రిటైనింగ్‌వాల్‌ను కూడా పెద్ద సైజు రాళ్లతో నిర్మించడం గమనార్హం.
కుతుబ్‌షాహిల కాలంలో నిర్మించిన ఈ బావి పూర్తిగా మట్టిలో కూరుకుపోయి ఉండగా ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ వారు దీనిని బయటకు తీశారు. ఈ బావి నీటి సామర్థ్యం 2.8 లీటర్లు.ఈస్టర్న్‌ బౌలి పూర్తిగా భూమిలోకి పూడుకుపోయి ఉండగా దానిని తవ్వి బయటకు తీశారు. తూర్పు బావిని ఎంతో కష్టపడి పునర్నిర్మించారు. ఈ బావి సెవన్‌టూంబ్స్‌లో నుంచి దక్కన్‌పార్కులోకి వచ్చే వర్షం నీటితో నిండేలా రూపొందించారు. ఇందులో నీటి సామర్థ్యం 2.5 మిలియన్‌ లీటర్లు.