Ancient Art : 200 ఏళ్లుగా మృదంగాలే వారికి జీవ‌నాధారం

కేరళలోని పెరువెంబ గ్రామంలోని ఓ కుటుంబం మృదంగాలను తయారుచేస్తోంది. నాలుగు తరాలుగా ఈ కుటుంబం మృదంగాల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 16, 2021 / 11:58 PM IST

కేరళలోని పెరువెంబ గ్రామంలోని ఓ కుటుంబం మృదంగాలను తయారుచేస్తోంది. నాలుగు తరాలుగా ఈ కుటుంబం మృదంగాల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మృదంగం వాయించడంలో డాక్టర్ కుజల్‌మన్నం రామకృష్ణన్‌కు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. 2006 కోయంబత్తూరులో రామకృష్ణన్ 301 గంటల పాటు ఏకధాటిగా, నిర్విరామంగా మృదంగం వాయించినందుకు గాను.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఐదుసార్లు ఆయన పేరును వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కించింది. కాని, ఈయన కృతజ్ఞత చెప్పింది మాత్రం పి.ఆర్. కాసుమణికి. పెరువెంబ గ్రామానికి చెందిన ఈయన కుటుంబం వల్లే తనకు ఈ స్థానం, స్థాయి దక్కిందని చెబుతారు రామకృష్ణన్. ఎందుకంటే, తమ ముత్తాతల కాలం నుంచి మృదంగాన్ని తయారుచేసి ఇస్తున్నది కాసుమణి కుటుంబం వాళ్లేనంటూ గొప్పగా చెప్పుకుంటుంటారు రామకృష్ణన్.

నిజానికి కేరళలోని పెరువెంబ గ్రామం సంగీత పరికరాల తయారీకి పెట్టింది పేరు. ఇక్కడి గ్రామంలో తయారైన మృదంగానికి ఇప్పటికీ పేరుంది. ముఖ్యంగా కాసుమణి చేతిలో తయారైన మృదంగానికి ఓ ప్రత్యేకత ఉంది. మృదంగాన్ని తయారుచేస్తున్న వీరి కుటుంబంలోని మూడో తరం వ్యక్తి ఈ కాసుమణి. ఈయన నైపుణ్యం నుంచి సంగీతకారులు జైకొట్టకుండా ఉండలేరు. ముఖ్యంగా కర్నాటక సంగీతంలో మృదంగానిదే ప్రత్యేక స్థానం. ఈ వాయిద్యం లేకపోతే కర్నాటక సంగీతానికి పరిపూర్ణత రాదు. ఒక్క కర్నాటక సంగీత కళాకారులే కాదు. భరతనాట్యం డ్యాన్సర్ శోభన, కర్నాటక సంగీతకారిణి జయకృష్ణన్ సైతం.. కాసుమణి నైపుణ్యానికి సలాం కొట్టిన వారే. కాసుమణి తయారుచేసిన సంగీత వాయిద్యాలకు కెనడా, మలేషియా, అమెరికా, సింగపూర్, గల్ఫ్ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. భారతీయులతో పాటు విదేశీయులు సైతం కాసుమణి మృదంగానికి ఫిదా అయిన వారే.

Also Read : కోటి రూపాయ‌ల ఆస్తిని రిక్షా పుల్ల‌ర్ కి ఇచ్చేసిన మ‌హిళ‌…!

కాసుమణిలాగే పెరువెంబ గ్రామంలో ఎంతో నైపుణ్యం ఉన్న కళాకారులు ఉన్నారు. వీళ్లంతా మృదంగం, మద్దలం, తబలా, తిమిలా, చెండా, ఇడక్క వంటి సంగీత వాయిద్యాలు తయారు చేసే వారు. కాని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పుడు చీరలు నేసే చక్రాలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు కేవలం 30 కుటుంబాల వాళ్లే సంగీత వాయిద్య పరికరాలు తయారుచేసే వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం కాసుమణి కుటుంబంలోని నాలుగోతరం వ్యక్తి, కాసుమణి కుమారుడు అయిన రాజేష్ సైతం ఇదే వృత్తిలో ఉన్నారు. 200 ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామని చెప్పుకొచ్చారు రాజేష్.

ఒక్కో మృదంగాన్ని తయారుచేయడానికి ఎంత లేదన్నా రెండు మూడు నెలలు పడుతుంది. పైగా వీటిని ఇంట్లోనే తయారుచేస్తుంటారు. అందుకే, మృదంగం తయారీ వెనక కుటుంబంలోని అందరి పాత్ర ఉంటుంది. ఈ కారణంగానే కుటుంబ వారసత్వంగా మృదంగ తయారీ నైపుణ్యం అలవరుతూ వస్తుంది. ముఖ్యంగా మృదంగంలో కనిపించే నల్ల మచ్చ రింగును పెట్టే బాధ్యత కాసుమణి తల్లిది. ఉడికించిన అన్నం, బ్లాక్ స్టోన్‌తో కలిపి ఈ నల్లరంగును మృదంగానికి అద్దుతారు. ఇక కాసుమణి మృదంగం ఆకారం కరెక్టుగా వస్తుందా లేదా అన్నది చూసుకుంటారు. కాసుమణి కుమారుడు రాజేష్.. 8 ఏళ్ల వయసు నుంచే ఈ పనిలో మెళకువలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. స్కూల్ ప్రాజెక్టులో భాగంగా అతిచిన్న మృదంగం తయారు చేశాడు. ఈ తయారీలో ఎన్నోసార్లు తన చర్మం కోసుకుపోయింది కూడా.

Also Read : 104 వయస్సులోనూ… తగ్గేదేలే…

మృదంగాల తయారీకి కావాల్సింది పనసపండు కలప, లెదర్. తమిళనాడులోని పన్రుటి గ్రామం నుంచి గట్టితనం ఉండే పనస చెట్టు కలప తెప్పించుకుంటారు. పైగా 30 ఏళ్ల పైబడిన పనస చెట్టు మాత్రమే మృదంగం తయారీకి పనికివస్తుంది. పనస చెట్టు మధ్య, కింద భాగాలను కోసి, దాన్ని రెండు నెలల పాటు ఎండబెట్టిన తరువాతే మృదంగం తయారీకి ఆ కలపను వాడతారు. ఒకప్పుడు మృదంగం ఆకారాన్ని చేతులతోనే చెక్కే వారు. ఇప్పుడు మిషిన్లు రావడంతో పని కాస్త తేలిక అయింది. ఇక మూడు వరుసల చర్మాన్ని వాడతారు. మృదంగం తీగలు తయారు చేసి, వాటిని గట్టిగా కట్టడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఈ పని కరెక్టుగా జరిగితేనే వాయిద్యం నుంచి అనుకున్న విధంగా సంగీతం వస్తుంది. ఇక లెదర్ మీద నల్లని మచ్చల కోసం ఉడికించిన అన్నంతో కలిపిన బ్లాక్ స్టోన్ పొడిని వాడతారు. దీని వల్ల బాస్ సౌండ్ బాగా వస్తుందని కాసుమణి చెబుతున్నారు. ఒక్కోటి 9 నుంచి 12 కేజీల బరువు ఉండే ఈ మృదంగాన్ని 15వేల నుంచి 20 వేల రూపాయలకు అమ్ముతారు.


కరోనా కారణంగా మృదంగాలకు సైతం గిరాకీ పడిపోయింది. పండుగలు, ఉత్సవాలు లేకపోవడంతో అమ్మకాలు పడిపోయాయి. పైగా కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా మృదంగాలను తయారుచేసినా.. దానికి తగ్గ ధర ఇవ్వకపోవడం కూడా వీరి పాలిట శాపంగా మారింది. అయినప్పటికీ, ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. కాసుమణి కుమారుడు రాజేష్ ఎంఏ చదివినప్పటికీ.. మృదంగాల తయారీపైనే నిమగ్నమయ్యాడు. ప్రస్తుతం ఈ వారసత్వాన్ని కొనసాగించే వారి కోసం అన్వేషణ సాగుతోంది. రాజేష్‌కు పిల్లలు లేకపోవడంతో మేనల్లుళ్లు, మేనకోడళ్లకు ఈ విద్య నేర్పించే పనిలో ఉన్నారు.