Site icon HashtagU Telugu

Will Journalists get Justice? : జర్నలిస్టులకు న్యాయం దొరుకుతుందా?

Will Journalists Get Justice..

Will Journalists Get Justice..

By: డా. ప్రసాదమూర్తి

Will journalists get justice? : చరిత్రలో ఎన్నడూ ఎరగనంత నిర్బంధాన్ని భారతదేశ ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఏలిన వారిని ప్రశ్నించే ప్రతి జర్నలిస్టూ ఒకటి టెర్రరిస్టే అన్న ముద్ర వేసి, అధికారంలో ఉన్నవారు తమ చేతుల్లో ఉన్న అన్ని నిర్బంధ చట్టాలనూ చర్యలనూ అమలు చేస్తున్నారు. దీనికి న్యూస్ పోర్టల్ “న్యూస్ క్లిక్” కు సంబంధించిన జర్నలిస్టులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు తాజా ఉదాహరణ. న్యూస్ క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్, సీనియర్ జర్నలిస్ట్ ప్రబీర్ పురకాయస్తను ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా అరెస్టు చేశారు.

ఈ సంస్థకు చెందిన దాదాపు పది మంది పైగా జర్నలిస్టులను (Journalists) అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వారి విలువైన ల్యాప్టాప్ లు, సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఒక్కసారిగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమయింది. దాదాపు 16 వార్తా సంస్థలు, ప్రభుత్వం సాగిస్తున్న ఈ అప్రజాస్వామిక నియంతృత్వ పోకడలను అదుపు చేయాలని, పాత్రికేయుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పరిరక్షించాలని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కు ఒక లేఖ రాసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సందర్భంగా ఢిల్లీ ప్రెస్ క్లబ్ దగ్గర అశేష సంఖ్యలో జర్నలిస్టులు (Journalists) తమ నిరసన తెలపడానికి సంఘటితమైనప్పుడు పోలీసులు ప్రదర్శించిన నిర్బంధకాండను దేశమంతా చూసింది. దీనితో స్వేచ్ఛగా స్వతంత్రంగా సాహసంగా తమ గొంతును వినిపించే పాత్రికేయుల పట్ల పాలకులు ఎంత నిరంకుశంగా తమ దమన నీతిని అమలు చేస్తున్నారో దేశానికి తెలియ వచ్చింది. దేశమంతా అన్ని ప్రాంతాలలో జర్నలిస్టులు మేధావులు రచయితలు ఈ నిర్బంధ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. నిన్న ముంబైలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

జర్నలిస్టుల (Journalists) మీద సాగుతున్న ఈ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా పాత్రికేయ వర్గాల నుంచే కాకుండా, వివిధ ప్రజాసంఘాల నుంచి, పార్టీల నుంచి, వివిధ వర్గాల ప్రజల నుంచి, మేధావులు రచయితలు కళాకారుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. గురువారం నాడు పలువురు మేధావులు రచయితలు, కళాకారులు, సామాజికవేత్తలు చెన్నైలో సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో పాత్రికేయులపై పోలీసులు సాగిస్తున్న నిర్బంధ చర్యలను తీవ్రంగా విమర్శించారు. తమ పాత్రికేయ వృత్తిని ఎలాంటి అధికార ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా కొనసాగిస్తున్న జర్నలిస్టుల మీద లేనిపోని ఆరోపణలు చేసి, వారిపై ఉగ్రవాదులనే ముద్ర వేసి, వారిని అణచివేసే వైఖరిని ప్రభుత్వం ప్రదర్శిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత హానికరమని వీరు ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసి ఎవరినైతే అరెస్టు చేశారో, ఎవరి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారో వారంతా ఎంతో రిప్యుటేషన్, నిజాయితీ ఉన్న జర్నలిస్టులని, అలాంటి వారిపై ప్రభుత్వం, పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడడం సత్యాన్ని అణచివేసే ప్రయత్నంగానే భావించాలని ఈ మేధావులు పేర్కొన్నారు. ఫోన్లు లాప్టాప్ లు వ్యక్తుల ప్రైవేటు ఆస్తి అని, వారి వ్యక్తిగత సామగ్రిని జప్తు చేయడం ద్వారా వ్యక్తుల ప్రైవేటు జీవితాలలో జోక్యం చేసుకోవడమేనని మేధావులు ఖండించారు.

అంతేకాదు గతంలో ఈ చట్టం కింద అరెస్టు చేయబడిన పలువురు వ్యక్తుల ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నప్పుడు అందులో ఉన్న డిజిటల్ సమాచారాన్ని ఏ విధంగా తారుమారు చేసిన ఉదాహరణలు ఉన్నాయో వీరు గుర్తు చేశారు. వ్యక్తుల వ్యక్తిగత పరికరాలను ఇప్పుడు స్వాధీనం చేసుకుని వాటిలో ఉన్న సమాచారాన్ని తారుమారు చేసే ప్రమాదం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. ఈ పరికరాలను కోర్టు ఆదేశాలు లేకుండా స్వాధీనం చేసుకోవడం చట్టరీత్యాన్ని నేరమని కూడా వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read:  Modi as ‘Jumla boy’, Rahul as ‘New Age Ravan’: రోజు రోజుకు ముదురుతున్న బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్..

దేశంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు జర్నలిస్టుల మీద అత్యంత క్రూరంగా అణచివేత కొనసాగుతున్నట్టుగా తాజా అరెస్టులు, పోలీస్ దాడులు చూస్తే అర్థమవుతుంది. కేవలం న్యూస్ క్లిక్ అనే ఒక ఇండిపెండెంట్ వార్తా సంస్థకు చెందిన జర్నలిస్టుల మీద ఇలాంటి చర్య తీసుకోవడం ద్వారా మిగిలిన వార్తా సంస్థలకు, వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టే భావించాలని ఈ మేధావులు అంతా ముక్తకంఠంగా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు దేశంలో స్వతంత్రంగా స్వేచ్ఛగా ధైర్యంగా ముందుకు సాగుతున్న జర్నలిజం గొంతు నొక్కే చర్యలేనని వారు విమర్శించారు. ఈ సంయుక్త ప్రకటనలో ఎందరో ప్రముఖులు సంతకాలు చేశారు.

సామాజికవేత్త అరుణారాయ్, రచయితలు గీతాంజలిశ్రీ, కేఆర్ మీరా, పెరుమాళ్ మురుగన్, జర్నలిస్టు పి.సాయినాథ్, చరిత్రకారులు రామచంద్ర గుహ, కర్నాటిక్ సంగీత కారుడు టీఎం కృష్ణ, రచయిత, చరిత్రకారిణి వి.గీత తదితరులు సంతకాలు చేశారు. ఎందరో మేధావులు, రచయితలు, సామాజికవేత్తలు, కళాకారులు, జర్నలిస్టులు ఈ ప్రకటన ద్వారా ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు, దేశంలో జర్నలిజాన్ని పరిరక్షించాలని, స్వతంత్ర మీడియాను కాపాడాలని అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఈ నిరసన అత్యున్నత న్యాయస్థానం హృదయాన్ని కదిలిస్తుందా.. జర్నలిస్టులకు న్యాయం లభిస్తుందా.. స్వేచ్ఛగా స్వతంత్రంగా పాత్రికేయ వృత్తిని కొనసాగించే వాతావరణం ఈ దేశంలో తిరిగి నెలకొంటుందా? ఇవే ప్రశ్నలు అందరిలోనూ కదులుతున్నాయి.

అసలే ఎన్నికల కాలం. ఇక మరెంత దమన నీతి చూడాలో తలుచుకుంటేనే అందరికీ భయంగా ఉంది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వైపే జర్నలిస్టుల చూపు అంతా ఇప్పుడు కేంద్రీకృతమైంది.

Also Read:  TDP : చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన టీడీపీ.. “కాంతితో క్రాంతి” పేరుతో నిర‌స‌న‌

Exit mobile version