Presidential Candidate: 16 పార్టీల ఉమ్మడి సమావేశంలో కీలక చర్చ… టీఆర్ఎస్ డుమ్మా కొట్టింది అందుకే

రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చిన ప్రతిపక్ష సమావేశం జూన్ 15, బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగింది.

రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చిన ప్రతిపక్ష సమావేశం జూన్ 15, బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగింది. రాష్ట్రపతి ఎన్నికలకు నామినీగా శరద్ పవార్ పేరు మళ్లీ ప్రతిపాదించగా, ఆయన తిరస్కరించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐఎంఎల్, ఆర్‌ఎస్పీ, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీ(ఎస్), డీఎంకే, ఆర్‌ఎల్‌డీ, ఐయూఎంఎల్, జేఎంఎం వంటి 16 పార్టీల నేతలు హాజరయ్యారు. టిఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకోవడానికి టిఆర్‌ఎస్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ఈ కూటమితో కలిసి వెళ్ళాలా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తామని ఆప్ పేర్కొంది.

సమావేశం తరువాత, మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంపై చర్చించడానికి అనేక పార్టీలు కూర్చొని చర్చించాయని, తమ ఉమ్మడి అభ్యర్థిగా ఒకరిని నియమించాలని ఏకాభిప్రాయానికి వచ్చామని ఆమె తెలిపారు. ఇది మంచి ఆరంభమని, అభ్యర్థి ఎంపిక కోసం త్వరలోనే అందరం మరోసారి సమావేశమవుతామని మమత ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష అభ్యర్థులుగా ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను మమతా బెనర్జీ సూచించారని సమాచారం.

తమకు రాష్ట్రపతి ఎన్నికలు చాల ముఖ్యమని, 2024 ఎన్నికలకు ఇవి ప్రాబబుల్స్ లాంటివని మమత పేర్కొంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో ఈ దేశానికి సంరక్షకునిగా వ్యవహరించగల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని తాము నిర్ణయించుకున్నామని ఆమె మీడియాతో చెప్పారు. బిజెపి ప్రభుత్వ హయాంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు పూర్తిగా చెడిపోయాయని మమతా బెనర్జీ ఆరోపించారు. సమాఖ్య నిర్మాణంపై బిజెపి దాడి చేసిందని, రాష్ట్ర స్థాయిని మున్సిపాలిటీకి తగ్గించాలని ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, ఇది సరైన పద్ధతి కాదని మమత తెలిపారు.

మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పలువురు ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేసి రాష్ట్రపతి ఎన్నికలకు పేర్లను సూచించాల్సిందిగా కోరినట్లు సమాచారం. మల్లికార్జున్ ఖర్గే, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్‌లతో సహా పలువురు నేతలకు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేసినపుడు ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన పేరు గురించి అడగగా సమాధానం రాలేదని తెలుస్తోంది.