Prashant with KCR: ప్రగతిభవన్లో ‘పీకే’ గూడుపుఠాని

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ సంచలనంగా మారింది. శనివారం రాత్రి కూడా ప్రగతిభవన్లోనే బసచేసినట్లు సమాచారం.

  • Written By:
  • Updated On - May 14, 2022 / 10:06 AM IST

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ సంచలనంగా మారింది. శనివారం రాత్రి కూడా ప్రగతిభవన్లోనే బసచేసినట్లు సమాచారం. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరోసారి ఆదివారం భేటీ అవుతారని తెలుస్తోంది. ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తోనే కలిసి పనిచేస్తానని పీకే స్పష్టం చేసినట్లు వినికిడి. కాంగ్రెస్ పెద్దలతో జరిపిన సంప్రదింపుల గురించి సీఎం కేసీఆర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్‌తో వరుసగా చర్చలు జరుపుతున్న ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలవడం రాజకీయవర్గాల్లో అలజడి రేగింది.టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తానని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.
తెలంగాణలో రాజకీయ, పరిపాలన తీరు, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రశాంత్ కిశోర్ టీమ్ సర్వే నిర్వహించింది. మొదట 39 నియోజకవర్గాల్లో సర్వే చేసి ఆ ఫలితాలను సీఎం కేసీఆర్‌కు అందజేశారట. ఆ తర్వాత 89 నియోజకవర్గాల్లో కూడా సర్వే చేపట్టారు. ఆ నివేదికను కూడా శనివారం భేటీలో సీఎం కేసీఆర్‌కు పీకే సమర్పించినట్లు సమాచారం. ఈ నెల 27న టీఆర్ఎస్ 21వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనుంది. హైదరాబాద్ హెచ్ఎసీసీలో ప్లీనరీని నిర్వహించనుంది. తాజా సర్వే, పార్టీ బలోపేతం సహా పలు అంశాలంపై ఆదివారం సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు.
ప్రశాంత్ కిశోర్ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళానికి తావిస్తోంది.

ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధమవడం, అదే సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తానని చెప్పడం ఈ రెండు పరస్పరం విరుద్ధం. కాంగ్రెస్‌లో చేరి తెలంగాణలో అదే పార్టీకి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారని కొందరు కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ వ్యవహారం అటు జాతీయ స్థాయిలో ఇటు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ పీకే కాంగ్రెస్‌లో చేరి ఇక్కడ టీఆర్ఎస్‌ కోసం పనిచేస్తే దానిని ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎలా స్వీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారనుంది.