Commodity Democracy : అంగడి సరుకైన ప్రజాస్వామ్యం

అంతా ఓకే. కానీ ఈ ఎన్నికల్లో డబ్బు పోషించిన పాత్రను చూస్తే ప్రజాస్వామ్యానికి (Democracy) ఏం జబ్బు చేసిందో మనకు తేటతెల్లమవుతుంది.

  • Written By:
  • Updated On - December 5, 2023 / 11:44 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Commodity Democracy : ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వచ్చాయి. విజయం సాధించిన పార్టీలు ఉత్సవాలు చేసుకుంటున్నాయి. పరాజయం పాలైన పార్టీలు ఆత్మవిమర్శలు సాగిస్తున్నాయి. అంతా ఓకే. కానీ ఈ ఎన్నికల్లో డబ్బు పోషించిన పాత్రను చూస్తే ప్రజాస్వామ్యానికి (Democracy) ఏం జబ్బు చేసిందో మనకు తేటతెల్లమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల కంటే తెలంగాణలో అత్యధికంగా డబ్బు, మద్యం, వెండి బంగారం తదితర వస్తువులు పట్టుబడ్డాయి. ఇది నానాటికి అంచెలంచెలుగా ఒక సంప్రదాయంగా మారిపోతుందా అన్న ఆందోళన ప్రజాస్వామిక వాదులకు కలుగుతుంది. ప్రజలకు ఎంతో చేశాం, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం, మా జీవితాలే ధారపోశాం అని చెప్పుకుంటున్న పెద్దలు చివరికి ఓట్ల కోసం నోట్లు పంచే హీనస్థితికి ఎందుకు దిగజారారు? ఎవరైనా ఆత్మ పరిశీలన చేసుకుంటారా? పథకాల రూపంలో ఇప్పటికే ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చేశారు.

చివరికి ఎన్నికల సమయంలో, ఐదేళ్లు వేసిన బిచ్చం మీద నమ్మకం లేక, చివరిసారిగా ఓటుకు ఇంతని రేటు పెట్టి ఓటరు చేతిలో బిచ్చం వేయడానికి నాయకులు నిస్సిగ్గుగా తయారైపోయారు. తెలంగాణలో ఓటుకు మూడు వేల నుంచి 5000 దాకా పంపకాలు జరిగినట్టు తెలుస్తోంది. వారూ వీరుని కాదు, ఎవరైనా సరే. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అమృతోత్సవాలు జరుపుకుంటున్న మనం ప్రజాస్వామ్యాన్ని (Democracy) ఏ స్థాయికి దిగజార్చామో మీకు అర్థమవుతుందా అని ఎవరిని నిలదీయాలి. చివరికి అమరవీరుల బలిదానాలు, వారి ఆశలు, ఆకాంక్షలు ఇలా అంగడి సరుకైపోయిన ప్రజాస్వామ్యంలో పరిహాసం అవుతున్నాయా..! సిగ్గుతో ఎవరు తలదించుకోవాలి?

We’re Now on WhatsApp. Click to Join.

తెలంగాణలో 2018 తో పోలిస్తే అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, వెండి బంగారు వంటి లోహాలు, మద్యం, చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు వంటి సామాన్లు 454% పెరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే చివరికి ఐదేళ్లు ఎవరు పరిపాలించినా పార్టీల జయప్రజయాలను నిర్ణయించేది ఆ చివరి ఘడియల్లో పంచిపెట్టిన డబ్బు, ప్రవహించిన మద్యం, మెరిపించిన వెండి బంగారాలు మాత్రమే అని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. అంటే ప్రభుత్వాలు తమ పని మీద, లేదా ప్రతిపక్షాలు తాము చేసే వాగ్దానాల మీద కాకుండా డబ్బు, మద్యం, వెండి బంగారాల మీదే ఎక్కువగా ఆశ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

ఎప్పుడో సినీకవి సిరివెన్నెల అన్నట్టు అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా అని మళ్లీ మళ్లీ మరోసారి ప్రశ్నించాలి. కానీ ఎవరిని ప్రశ్నిస్తాం? ఈ విషయంలో అందరికందరే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు మారిపోయిన మహా మాయాజాలాన్ని చూస్తున్నాం. తెలంగాణలో అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 1 మధ్యకాలంలో 469.63 కోట్ల విలువైన నగదు, మద్యం, వెండి బంగారాలు, ఇతర సామాగ్రి పట్టుబడినట్లు రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా 11,859 కేసులను నమోదు చేసారట. ఈ లెక్కల్లో కేవలం నగదు రూపంలో 241.52 కోట్లు, 175.95 కోట్ల వెండి బంగారం, 13.36 కోట్ల మద్యం, 22.17 కోట్ల ఇతర మత్తు పదార్థాలు, 16.63 కోట్ల విలువచేసే ఇతర వస్తువులు పట్టుబడ్డాయి.

Also Read:  Bhatti Vikramarka- Uttam Kumar: సీఎం ఎంపికలో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్..!

చూశారా లెక్కలు! ఇవి కేవలం అధికారులు చెబుతున్న అధికారికంగా పట్టుబడిన వివరాలు మాత్రమే. 2018లో అలా పట్టుబడిన నగదు వెండి బంగారం మద్యం ఇతర వస్తువుల విలువ 103 కోట్లు మాత్రమే ఉంది. దీనితో పోలిస్తే ఎన్ని రెట్లు ఈ సంవత్సరం పెరిగిందో మనం ఊహించుకోవచ్చు. కేవలం పట్టుబడిన నగదు, మద్యం, వెండి బంగారాల విలువ మాత్రమే ఇది. మన ఊహకు కూడా అందనంత పంపకాల రూపంలో ప్రజల దగ్గరకు వెళ్ళిపోయింది. అది కొన్ని వందల రెట్లు ఉంటుందని అంచనా. అంటే కనీసం నియోజకవర్గానికి 100 కోట్లు వేసుకున్నా 11,900 కోట్లు అవుతుంది. అనధికారిక లెక్కల ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి రెండు మూడు వందల కోట్లు కూడా ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ఇలా ఊహించుకుంటూ లెక్కలు వేసుకుంటూ వెళితే అది ఎన్ని వేల కోట్లకు వెళ్తుందో మన అంచనాకు అందని విషయం. ఒక చిన్నపాటి రాష్ట్రానికి వార్షిక బడ్జెట్ అవుతుందని చెప్పినా అతిశయోక్తి కాదేమో.

ఇది కేవలం ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో పంపకాల విషయం మాత్రమే. మిగిలిన రాష్ట్రాల లెక్కలు తెలియవు. రేపు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. దేశమంతా ఇంకా ఎన్ని వేల లక్షల కోట్లు విలువ చేసే నగదు మద్యం, వెండి బంగారాలు నాయకుల చేతుల నుంచి బిచ్చగాళ్ళుగా మారిన ప్రజల చేతుల్లోకి వెళ్తాయో ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది. మరి అమృతోత్సవాలు జరుపుకుంటున్న ఈ స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్యం (Democracy) ఏమైంది? అంగడి సరుకుగా మారిపోయిందంటే తప్పేముంది? ముక్తాయింపుగా ఒక మాట చెప్పుకొని ఊపిరి పీల్చుకుందాం. అదేమంటే ఇంకా ఓటుని నోటు డిసైడ్ చేసే కాలం రాలేదు. ఎక్కువ డబ్బు పంపిణీ చేసినంతమాత్రాన అలా పంపిణీ చేసిన వాళ్ళని ప్రజలు పీఠాలు ఎక్కించడం లేదు. కానీ పరిణామాలు చూస్తే ఆ రోజు కూడా రావచ్చు.

Also Read:  Astrologer Venu Swamy: ఆంధ్రలో మళ్ళీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి.. చంచల్‌గూడ జైలు ఇద్దరు సీఎంలను ఇచ్చింది: వేణు స్వామి