Site icon HashtagU Telugu

One Nation One Election: కేసీఆర్ కు తలనొప్పిగా మారిన వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌

One Nation One Election

New Web Story Copy 2023 09 03t115227.781

One Nation One Election: దేశంలో ఏకకాలంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.బీజేపీ ప్రతిపాదన తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు చిక్కులు తీసుకొచ్చేలా కనిపిస్తుంది. ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్ ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికలతో బిఆర్ఎస్ కాస్త వెనకడుగు వేస్తున్నట్టు పరిణామాలు చెప్తున్నాయి.సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఇదే జరిగితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్ ఎన్నికల స్ట్రాటజీపై ఆ ప్రభావం పడనుందని విశ్లేషకులు అంటున్నారు. (One Nation One Election)

ఒక దేశం ఒకే ఎన్నికలు అనే విధానాన్ని అన్వేషించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే మోడీ ప్రభుత్వం ఆలోచన బీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు. ఈ పరిణామంపై పార్టీ ఇంకా అధికారికంగా స్పందించలేదు కానీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ సీనియర్‌ నేతలతో ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో ఎన్నికలు జరిగినా తమ పార్టీ సిద్ధంగా ఉందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌ చెబుతున్నా అంతర్గతంగా ఆ పరిస్థితులు ఆ పార్టీలో కనిపించడం లేదు.

119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ (KCR) ప్రకటించడంతో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకంతో ఉంది. 2014 వరకు తెలంగాణ అసెంబ్లీకి లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్నికలు జరిగేవి. కానీ కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ క్రమంలో మూడు నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో ఎన్నికలు 4-5 నెలలు ముందుకు సాగాయి. అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో ముడిపెట్టాలనే కేసీఆర్ వ్యూహం ఆశించిన ఫలితాలను ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది.

ఇదిలా ఉండగా కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత తమ మద్దతుదారులతో కలిసి ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు.ఎన్నికలు వాయిదా పడితే ప్రచారాన్ని నిలబెట్టుకోవడం సవాలుగా మారుతుందని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్‌ఎస్ యోచిస్తోంది. నిజానికి 2018లో ఒకే దేశం, ఒకే ఎన్నికలకు బీఆర్ ఎస్ మద్దతు ఇచ్చింది.ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని లా కమిషన్‌కు పార్టీ తెలిపింది.

Also Read: India-Pakistan: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ రద్దు.. ఏ జట్టుకి ప్లస్ అయ్యింది..?