India Ireland T20 :ఐర్లాండ్‌తో బీ కేర్‌ ఫుల్

క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. ఫేవరెట్ అనుకున్న జట్లు కూడా కుప్పకూలిన సందర్భాలున్నాయి. పసికూన అనుకున్న జట్లు పెద్ద జట్లకు షాకిచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా షార్ట్ ఫార్మేట్‌లో ఎవరినీ ఖచ్చితంగా ఫేవరెట్‌గా చెప్పలేని పరిస్థితి.

  • Written By:
  • Updated On - June 25, 2022 / 04:54 PM IST

క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. ఫేవరెట్ అనుకున్న జట్లు కూడా కుప్పకూలిన సందర్భాలున్నాయి. పసికూన అనుకున్న జట్లు పెద్ద జట్లకు షాకిచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా షార్ట్ ఫార్మేట్‌లో ఎవరినీ ఖచ్చితంగా ఫేవరెట్‌గా చెప్పలేని పరిస్థితి. అందుకే అన్ని జట్లతోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పుడు ఐర్లాండ్ టూర్‌లో ఉన్న భారత జట్టుకు కూడా విశ్లేషకులు, మాజీలు ఇదే సూచన చేస్తున్నారు. ఎందుకంటే గతంలో పలు టాప్ టీమ్స్‌కు షాకిచ్చిన చరిత్ర ఐర్లాండ్ సొంతం. అలాగే గతంలో భారత్‌కు కూడా గట్టిపోటీనిచ్చిన మ్యాచ్‌లూ ఉన్నాయి. ప్రస్తుతం భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ ట్వంటీలు ఆడనున్న నేపథ్యంలో ఐర్లాండ్‌ గత రికార్డులను అందరూ శోధిస్తున్నారు. వాస్తవానికి ఐర్లాండ్ ఈ మధ్య కాలంలో పెద్దగా సంచలన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నా 2007 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ని ఓడించింది. ఎవ్వరూ ఊహించని విధంగా అప్పుడు సూపర్ 12 రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ జట్టుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆ తర్వాత 12 ఏళ్లకు 2019 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్, సగటు టీమిండియా అభిమాని టెన్షన్ పెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఎటాకింగ్ గేమ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. చివర్లో భారత బౌలర్లు పుంజుకోవడంతో 259 రన్స్‌కే పరిమితమైంది. 2018లోనూ టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించింది. అప్పుడు రెండు టీ ట్వంటీల్లోనూ ఘనవిజయాలు సాధించింది. అయితే ఈ సారి మాత్రం సీనియర్ ప్లేయర్స్‌ కాకుండా ఐపీఎల్‌లో రాణించిన యువక్రికెటర్లతో కూడిన టీమ్ ఐర్లాండ్‌ టూర్‌కు వచ్చింది. హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలోని భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్ళే ఉన్నారు. ఐర్లాండ్‌తో పోలిస్తే యంగ్ ఇండియా బలంగానే ఉన్నా… అప్రమత్తంగా లేకుంటే మాత్రం షాక్ తగలడం ఖాయం. కాగా ఐర్లాండ్‌ సిరీస్‌లో సత్తా చాటేందుకు భారత యువక్రికెటర్లందరికీ ఇది చక్కని అవకాశం. ప్రపంచకప్ కోసం జట్టు ఎంపికపై సెలక్టర్లు దృష్టి పెట్టిన నేపథ్యంలో హార్థిక్ పాండ్యాతో పాటు మిగిలిన ప్లేయర్స్‌ అందరూ తమ ప్రదర్శనతో ఆకట్టుకోవాల్సిందే. ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ చేస్తూ ఐర్లాండ్‌పై రాణించాలని వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి పసికూన అనుకుని తేలిగ్గా తీసుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హార్థిక్ సేనకు మాజీలు, విశ్లేషకులు సూచిస్తున్నారు.