UP: నేరస్థులు నాయకులయ్యారా లేక నాయకులు నేరస్థులయ్యారా?

  • Written By:
  • Publish Date - January 3, 2022 / 03:52 PM IST

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితుల అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నేరస్థులు రాజకీయ నాయకులయ్యారా లేక రాజకీయ నాయకులు నేరస్థులయ్యారా? అన్నది చెప్పడం కష్టం అని యూపీకి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం నేరస్థులను పెద్దఎత్తున అరికట్టిందని ప్రతి ఎన్నికల సభలోనూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని 80మంది లోక్‌సభ ఎంపీల్లో 25 మంది నేరచరితులు కాగా వారిలో 21 మందిపై తీవ్ర నేరాలకు సంబంధించి కేసులున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో మొత్తం 403 మంది ఎమ్మెల్యేల్లో 143 మందికి నేర చరిత్ర ఉండగా.. వారిలో 114 మంది బీజేపీ పార్టీ వారు కాగా.. సమాజ్‌వాదీ పార్టీ నుంచి 14 మంది, బీఎస్పీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు నేరచరితులు. స్వతంత్రులుగా ఎన్నికైన ముగ్గురూ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారే అని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది.

కాగా.. ఉద్యోగం కోసం వచ్చిన 16 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి, ఆమె తండ్రి, బంధువులను హత్య చేసిన కేసుతో పాటు అనేక నేరాల్లో ఇరుక్కున్న కుల్దీప్‌ సింగ్‌ బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. ప్రజల్లో నిరసన రావడంతో 2019లో అతడిని పార్టీ బహిష్కరించింది.

ముజఫర్‌నగర్‌ అల్లర్లతో సంబంధం ఉన్న బీజేపీ నేతలపై యూపీ సర్కారు 77 కేసులను ఉపసంహరించుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వీరిలో బీజేపీ ఎమ్మెల్యేలు సంగీత్‌ సోము, సురేశ్‌ రాణా, కపిల్‌ దేవ్‌తో పాటు సాధ్వీ ప్రాచీ ఉన్నారు. ఓ విద్యార్థిని కిడ్నాప్‌, అత్యాచారం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందపై కేసును యూపీ సర్కారు ఉపసంహరించుకుంది.

మావు-ఘాజీపూర్‌ ప్రాంతంలో అన్సారీ ముస్లిం ఓటు బ్యాంకును, అజయ్‌ మిశ్రా తేనీ హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేశారని.. ఇద్దరి మధ్యా సారూప్యం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీ కొన్ని సందర్భాల్లో మాఫియా, నేరచరితులతో పరోక్ష సంబంధాలు పెట్టుకుందని చెబుతున్నాయి.

పార్టీలతో సంబంధాల్లేని వారినే కాల్చేశారు! యూపీలో రాజకీయ పార్టీలతో సంబంధాలు లేని వారినే ఎన్‌కౌంటర్లలో ఎక్కువగా హతమార్చారని దైనిక్‌ భాస్కర్‌ పత్రిక తాజా సర్వేలో తేల్చింది.