Hyderabad To Leh: హైదరాబాద్ టు లద్దాక్.. సైకిల్ పై సాహసయాత్ర!

హైదరాబాద్‌లోని పటాన్‌చెరుకు చెందిన పదిహేడేళ్ల యువకుడు మాచర్ల వెంకటేష్ సాహసయాత్రకు శ్రీకారం చుట్టాడు.

  • Written By:
  • Updated On - July 5, 2022 / 09:49 PM IST

హైదరాబాద్‌లోని పటాన్‌చెరుకు చెందిన పదిహేడేళ్ల యువకుడు మాచర్ల వెంకటేష్ సాహసయాత్రకు శ్రీకారం చుట్టాడు. 26 రోజులపాటు లేహ్‌కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి తన కలను నెరవేర్చుకున్నాడు. మే 23 న హైదరాబాద్ నుంచి బయలుదేరి జూన్ 17 న 2,713 కిలోమీటర్ల ప్రయాణంలో 11 రాష్ట్రాలను దాటాడు. వెంకటేష్ నాలుగేళ్లుగా తన యాత్ర కోసం డబ్బులు సేవింగ్ చేశాడు. “ఇది అద్భుతమైన అనుభవం. ప్రయాణంలో నాకు సహాయం చేసే వ్యక్తులు దొరికారు. నాకు ఆహారం, డబ్బు, ప్రథమ చికిత్స అందించారు” అని వెంకటేశ్ తన యాత్రకు గురించి వివరించాడు. అయితే వెంకటేశ్ శిక్షణ పొందిన సైక్లిస్ట్ కాదు. అయితే లేహ్‌కు బయలుదేరడానికి ఒక నెల ముందు కన్యాకుమారికి యాత్ర చేశాడు. గత ఏడాది దేశవ్యాప్తంగా సైకిల్ తొక్కిన కోల్‌కతాకు చెందిన 55 ఏళ్ల పరిమల్ కంజి నుంచి వెంకటేష్ స్ఫూర్తి పొందాడు.

తాను రోజుకు 75 నుంచి 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించానని, అయితే 11,000 అడుగుల ఎత్తులో ఉన్న తన గమ్యస్థానానికి వెళ్లడం కష్టంగా ఉందని వెంకటేష్ పేర్కొన్నాడు. హెల్మెట్, హ్యాండ్ గ్లోవ్స్ ధరించి సైకిల్ తొక్కాడు. “లేహ్ వద్ద ఉన్న దృశ్యం ఉత్కంఠభరితంగా ఉంది. మంచు పర్వతాలు, తెల్లటి మేఘాలు, అదోక స్వర్గపు అనుభవం! ఆ అనుభూతిని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు” అని అంటున్నాడు వెంకటేశ్. గతేడాది ప్రమాదంలో మరణించిన తన ప్రాణ స్నేహితుడు సలీం జ్ఞాపకార్థం ఈ యాత్రను అంకితం చేశాడు. “సలీం భాయ్, నేను కలిసి సాహసం ప్లాన్ చేశాం. అది జరగలేదు. కానీ స్నేహితుడి కోసం యాత్ర చేశానని అంటున్నాడు వెంకటేశ్.