Punjab Polls: కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారిన ‘పంజాబ్’ రాజకీయం..!

భారతదేశంలో గత దశాబ్దకాలంగా జరుగుతున్న ఎన్నికల సరళిని గమనిస్తే మనకి ఓ విషయం అర్దం అవుతుంది. అదేంటంటే... ఓటర్లు ఎప్పుడూ కూడా పార్టీలు, వారిచ్చే ఎన్నికల హామీల కంటే..

  • Written By:
  • Updated On - January 31, 2022 / 06:48 PM IST

పంజాబ్ లో ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్ హైకమాండ్

సిద్దూకి ఛాన్స్ దొరికేనా…? చన్నీ నే అదృష్టం వరించేనా..?

అయోమయ స్థితిలో పంజాబ్ కాంగ్రెస్ రాజకీయం

భారతదేశంలో గత దశాబ్దకాలంగా జరుగుతున్న ఎన్నికల సరళిని గమనిస్తే మనకి ఓ విషయం అర్దం అవుతుంది. అదేంటంటే… ఓటర్లు ఎప్పుడూ కూడా పార్టీలు, వారిచ్చే ఎన్నికల హామీల కంటే.. ఆయా పార్టీల సీఎం, పీఎం అభ్యర్థులను చూసి మాత్రమే ఓట్లు వేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇక కేంద్రంలో వరుసగా రెండోసారి భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. అందుకు కారణం పార్టీ కాదు, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోదీ, కల్వకుంట్ల చంద్రశేఖర రావులేనని ఎవరినడిగా చెబుతారు. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదహరణలే మనకి కనిపిస్తాయి. ఆయా రాజకీయ పార్టీల నేతలపై ప్రజలు కనబరిచే ఆదరణే, ఆ పార్టీల నేతలను అధికార పీఠంపై కూర్చోబెడుతున్నాయనే సత్యం. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.. త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. అందరి దృష్టంతా ఆ రెండు రాష్ట్రాలపైనే ఉంది. అదేనండీ… ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల గురించే చెబుతున్నా. ఉత్తర్ ప్రదేశ్ లో ఇప్పటికే అధికార భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని, అలానే ఆ పార్టీకి సవాల్ విసురుతున్న ఎస్పీ, బీఎస్పీలు కూడా సీఎం అభ్యర్థుల విషయంలో స్పష్టతనిచ్చాయి. పంజాబ్‌లోనూ అధికార పీఠంపై గురిపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ముఖ్యమంత్రిని ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేక తర్జనభర్జన పడుతున్న పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడమే పెద్ద సవాలుగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తాజాగా పంజాబ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రశ్న కూడా ఇదే.

పంజాబ్ లో తిరుగులేని ఆప్…

పంజాబ్ రాష్ట్రంలో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ పంజా విసిరేలానే కనిపిస్తోంది. సర్వేలు కూడా ఆ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున వరుసగా రెండుసార్లు పార్లమెంట్ కు ఎన్నికైన భగవంత్ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడంతో పాటు, ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు గాను, ఆన్‌లైన్ పోల్ నిర్వహించి మరీ ప్రజలను, పార్టీ కార్యకర్తలను భాగస్వాములుగా చేశారు. ఈ ఆన్‌లైన్ పోల్‌లో 93% మంది మద్ధతు సంపాదించుకున్న భగవంత్ మాన్‌… తన అభ్యర్థిత్వానికి పోటీయే లేదని నిరూపించుకున్నారు. తనదైన శైలిలో ఆయన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.

పంజాబ్ లో ఒక ఒరలో రెండు కత్తులన్న చందంగా మారిన కాంగ్రెస్ పరిస్థితి..

ఇక పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉందంటే… ఒకే ఒరలో రెండు కత్తులు అన్నట్టు. ఎందుకంటే అక్కడ సీఎం పదవే తన జీవిత లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతూ ప్రయత్నిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఓవైపు, ఇచ్చిన కొద్ది సమయంలోనే తనను తాను ప్రూవ్ చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో సిద్ధూను ఢీకొడుతున్న చరణ్‌జీత్ సింగ్ చన్ని మరోవైపు. వీరిద్దరూ ఇప్పుడు పార్టీ అధిష్టానాన్ని అత్యంత సందిగ్ధంలోకి నెట్టిపడేశారనే చెప్పాలి. కాంగ్రెస్ సంస్కృతిలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించడం అత్యంత అరుదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీల్డ్ కవర్ ద్వారా సీఎం ని నిర్ణయించడం ఆ పార్టీలో కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీ.
కానీ పంజాబ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది. రాహుల్ గాంధీ తాజా పర్యటనలో అడుగడుగునా ఆయన ఇదే ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని కార్యకర్తలే నిర్ణయించాలని, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి తాత్కాలికంగా ఆయన సమాధానం దాటవేసినా… ఎన్నికలకు ముందు ఈ అంశమే నిప్పుతో చెలగాటంలా మారింది. దూకుడు, దుందుడుకుతనంతో పాటు, ధిక్కారస్వరాన్ని వినిపించే పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, తనను ఉత్సవ విగ్రహంలా వాడుకుని వదిలేస్తే సహించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఇక మరోవైపు తన సోదరుడికే పార్టీ టికెట్ నిరాకరించినా సరే… మచ్చుకైనా చిన్న మాట కూడా మాట్లాడకుండా చరణ్‌జీత్ సింగ్ చన్నీ పార్టీపై తన విధేయతను చాటుకున్నారు. సీఎం గా కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉన్నప్పటి నుంచే చీటికిమాటికి గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, సీఎం పదవిపై కన్నేసిన సిద్ధూ… ఆయన్ని సాగనంపిన తర్వాత పదవి తనదే అనుకున్నారు. కానీ హైకమాండ్ అనూహ్యంగా చరణ్‌జీత్ సింగ్ చన్నీకి ప్రభుత్వ పగ్గాలు అప్పగించడంతోనే… సిద్ధూ కుతకుతలాడిపోతున్న పరిస్థితి పంజాబ్ లో ఉంది. సిద్దూ అప్పటి నుంచి చన్నీతోనూ కోల్డ్ వార్ మొదలుపెట్టి, పేచీలకు దిగుతూనే ఉన్నారు. సరే, ఇది తాత్కాలికమే.. అని తనకు తాను సర్దిచెప్పుకుని తదుపరి ఎన్నికల్లో తానే సీఎం అభ్యర్థిని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సిట్యుయేషన్ లో కాంగ్రెస్ హైకమాండ్ కు ఏం చేయాలో తెలియని కొత్త తలనొప్పి ఎదురైనట్టైంది.

పార్టీ విధేయుడిగా ముందు వరుసలో చన్నీ.. కుల సమీకరణలు ఆయనకు అదనపు బలం…
పంజాబ్ సీఎం గా కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను సాగనంపిన తర్వాత… ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన చరణ్‌జీత్ సింగ్ చన్నీ, తనపై పార్టీ పెట్టుకున్న అంచనాలకు మించి పనిచేశారని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపిస్తూ సీనియర్ నాయకుల మన్ననలు కూడా అందుకున్నారాయన. తాను కేవలం తాత్కాలిక సీఎం నే కాదని, తదుపరి కూడా ముఖ్యమంత్రి రేసులో ఉండే నైపుణ్యం, చతురత, సామర్థ్యం ఉన్నాయని నిరూపించుకున్నారు. మరోవైపు
దళిత సిక్కు వర్గానికి చెందిన చరణ్ జీత్ చన్నీకి సామాజిక సమీకరణాలు కూడా కలిసొచ్చే అంశమే అని చెప్పొచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా 34 శాతం దళిత జనాభా పంజాబ్ రాష్ట్రంలో ఉన్నారు. సో… దీంతో అన్ని పార్టీలూ దళిత ఓట్ల కోసం చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా దళిత వ్యక్తినే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీ… ఎన్నికల్లో ఈ అంశాన్ని ఒక అస్త్రంగా మలుచుకుని ప్రచారం నిర్వహిస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్ చార్జీల తగ్గింపు, ప్రభుత్వోద్యోగుల డీఏ పెంపు వంటి చర్యలతో చన్నీ ఆకట్టుకున్నారు. ఎక్కువ రేటుకు విద్యుత్తు అందిస్తున్న ప్రైవేట్ విద్యుత్తు సంస్థలతో ఒప్పందాల రద్దు, తక్కువ ధరకు మళ్లీ ఒప్పందాలు చేసుకోవడం వంటి చర్యలు కూడా చరణ్ జీత్ సింగ్ చన్నీ గురించి చర్చించుకునేలా చేశాయి. “నవీ సోచ్, నవన్ పంజాబ్ (కొత్త ఆలోచన, సరికొత్త పంజాబ్)” అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారాయన. ముఖ్యమంత్రిగా తాను పనిచేసిన 111 రోజుల పాలన నచ్చితే, మరో ఐదేళ్లకు అవకాశం కల్పించండి అంటూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై చన్నీ సంకేతాలు పంపుతున్నారు. మరోవైపు ఎలాంటి రాజకీయ వారసత్వం, నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన తనకు పార్టీ చాలా చేసిందని… సీఎంగా ఎవరిని ఎన్నుకున్నా సరే, తన పూర్తి మద్ధతు, సహకారం ఉంటుందని చెబుతూ… వినమ్రత, పార్టీపై విధేయత చాటుకుంటున్నారు.
అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం చన్నీ సొంతమని ఆ పార్టీలోని నేతలే చెబుతుంటారు. దీంతో పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు సైతం చన్నీ నాయకత్వాన్నే సమర్థిస్తున్నారు. మృదు స్వభావి, విద్యావంతుడైన చన్నీయే ముఖ్యమంత్రి పదవికి అర్హుడని కొందరు బాహాటంగానే వ్యాఖ్యానిస్తుండగా… ఇంకొందరు నేరుగా పార్టీ అధిష్టానానికి తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. స్వల్ప కాలంలోనే సీఎం గా చన్నీ తనను తాను నిరూపించుకున్నాడని చెబుతున్నారు. 2012, 2017 ఎన్నికల్లోనూ సీఎం అభ్యర్థిని పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించిందని మంత్రి బ్రహ్మ్ మొహింద్రా గుర్తుచేస్తున్నారు. పైగా అత్యధిక దళిత జనాభా కలిగిన పంజాబ్ రాష్ట్రంలో దళితుడైన చన్నీని కాదని మరెవరిని ప్రకటించినా లాభం కంటే నష్టమే ఎక్కువని కొందరు నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి అంశాలన్నీ కూడా చరణ్ జీత్ సింగ్ చన్నీకి అనుకూలించేవే. దీంతో పార్టీ చన్నీ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సిద్దూ వ్యవహారశైలినే… ఆయనకి మైనస్ అంటున్న పార్టీ సీనియర్లు..

స్వతహాగా క్రికెటర్ అయిన సిద్దూకి… ఆయన టీమ్ ఇండియాకి ఆడిన సమయంలో ప్రత్యర్దులపై ఎంత దూకుడుగా వ్యవహరించేవాడో… పొలిటీషియన్ అయ్యాక కూడా అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే… ఒకసారి డీఫాల్ట్ గా వచ్చింది, అంత ఈజీగా పోదు కదా. ఇక పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సిద్దూ విషయానికొస్తే…. ఆయన దుందుడుకు స్వభావం, పేచీకోరుతనం, ఎవరినీ లెక్కచేయని నైజం, పార్టీ ప్రయోజనాల కంటే తన సొంత లక్ష్యం కోసమే… అదేనండీ.. ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే పనిచేయడం వంటి లక్షణాలు సిద్ధూకి అంతగా అనుకూలించని అంశాలుగా చెప్పొచ్చు. గతంలో అమరీందర్ సింగ్‌ తోనూ సిద్ధూకు ఏమాత్రం పొసగలేదంటే, ఇప్పుడు చన్నీతోనూ లుకలుకలే కనిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని సైతం తన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ కోల్డ్ వార్ సృష్టించారనేది పెద్ద టాక్ . అడ్వకేట్ జనరల్ ఏపీఎస్ దేవల్ వ్యవహారం సహా అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. మరోవైపు చూస్తే… అభ్యర్థులకు సంబంధించిన టికెట్ల కేటాయింపు విషయంలో సిద్ధు తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారని… తద్వారా పార్టీ గెలిచిన తర్వాత తనను ముఖ్యమంత్రిగా బలపర్చడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని కొందరు సీనియర్ నేతలు విమర్శించిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూస్తే.. “సీఎం ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారు.. పార్టీ అధిష్టానం కాదు” అంటూ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసే ధిక్కార వ్యాఖ్యలు సైతం ఆయనకు మైనస్ మార్కులు వేస్తున్నాయనే చెప్పాల్సి ఉంటుంది. పంజాబ్ లో ముందు పార్టీని గెలిపించుకుని, తద్వారా సీఎం అవ్వాలన్న ఆలోచన లేకుండా… పార్టీలో తాను ముందు గెలిచి తర్వాత ఎన్నికల్లో గెలవాలన్న చందంగా సిద్ధూ వ్యవహారశైలి ఉంది. నిజం చెప్పాలంటే… ఇదే విషయం పార్టీ హైకమాండ్ ను సైతం అసహనానికి గురిచేస్తోంది. అయితే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా… సిద్ధూ ఎలా వ్యవహరిస్తారోనన్న ఆందోళన కూడా అధినాయకత్వాన్ని వేధిస్తోంది. ఇలాంటి సిట్యుయేషన్ లో ప్రస్తుతానికి యధాతధ స్థితి కొనసాగించడమే బెటర్ అన్నఒపీనియన్ ఎక్కువ మంది నేతల్లో వినిపిస్తోంది. కాకపోతే… ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎప్పటికైనా ప్రకటించాల్సిందే గనుక, వీలైనంత త్వరగా సీఎం క్యాండిడేట్ ని అనౌన్స్ చేస్తేనే మంచిదని మరికొంతమంది నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అక్కక కాంగ్రెస్ హైకమాండ్ ఎలా వ్యవహరిస్తుందో… ఈ సందిగ్ధ స్థితినుంచి ఏ విధంగా బయటపడుతుందో అన్నది వేచి చూడాలి.