BJP Politics : కర్ణాటకలో కమల రాజకీయం ఫలిస్తుందా?

కర్ణాటకలో జనతా సెక్యులర్ బీజేపీ (BJP) మధ్య ఒక ఖచ్చితమైన రాజకీయ ఒప్పందం కుదిరినట్టు తాజా వార్తలు తెలియజేస్తున్నాయి.

  • Written By:
  • Updated On - September 23, 2023 / 06:46 PM IST

By: డా. ప్రసాదమూర్తి

BJP Politics in Karnataka : సరిగ్గా 16 సంవత్సరాల క్రితం తెగిపోయిన బంధం తిరిగి అతుక్కుంది. కర్ణాటకలో జనతా సెక్యులర్ బీజేపీ (BJP) మధ్య ఒక ఖచ్చితమైన రాజకీయ ఒప్పందం కుదిరినట్టు తాజా వార్తలు తెలియజేస్తున్నాయి. ఈ సంవత్సరం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన బిజెపి, జనతాదళ్ (ఎస్) రెండూ తక్షణం అంతర్ మథనం, ఆత్మ విమర్శ, ఆత్మావలోకనం చేసుకొని, పాత కక్షలు, తగాదాలు, వైరుధ్యాలు, ఘర్షణలు పక్కనపెట్టి ఏకం కావాలని నిర్ణయించుకున్నాయి. కర్ణాటక విజయంతో చాలా ఉత్సాహంగా ఉరకలేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అడ్డుకట్ట వేయడానికి అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఏ అవకాశాన్నీ బిజెపి వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో కోల్పోయిన ప్రాభావాన్ని, గత వైభవాన్ని తిరిగి పొందాలంటే జేడీఎస్ తో పొత్తు తప్పనిసరి అని బిజెపి గమనించినట్లు ఉంది.

జనతాదళ్ (ఎస్) పేరులోనే సెక్యులర్ అనే పదం ఉంది. ఈ పార్టీతో, సెక్యులర్ అనే పదంతోనే పేచీ ఉన్న బిజెపికి రాజకీయ పొత్తు ఎలా సంభవం అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అవన్నీ సిద్ధాంతాల వరకే. రాజకీయంలో మాత్రం ఎన్నికలలో గెలుపు, అందలాల వైపు పరుగు మాత్రమే పరిగణనలోకి వస్తాయి. అందుకే జనతాదళ్ ఎస్ గతంలో కర్ణాటకలో బిజెపి పొత్తు పెట్టుకుంది. అయితే ఆ పొత్తు గమ్మత్తుగా మాయమైన చరిత్ర మాత్రం ఎవరూ మర్చిపోలేం.

రెండు పార్టీలూ చెరిసగం కాలం ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని ఒప్పందం ఆనాడు జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం మాజీ ప్రధాని హెచ్ డి దేవగౌడ కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పదవీకాలం రెండున్నరేళ్లు ముగిసిన తర్వాత బిజెపికి ఆ పదవిని అందజేయాలి. అందుకు జెడి (ఎస్) నో చెప్పింది. అదిగో అక్కడ అలా ముగిసిపోయింది ఆ బంధం. రాజకీయాలంటేనే ఎలాంటి శాశ్వత నియమ నిబంధనలు, ఒప్పందాలు, ప్రమాణాలు పనికిరావు. అంతా తాత్కాలికమైన వొడంబడికే ఉంటుంది. ఇది జనతాదళ్ సెక్యులర్ పార్టీ కమలనాధులకు ఆనాడు చెప్పిన సమాధానం. మరి అలా తెగిపోయిన బంధం ఇప్పుడు ఎలా అతికింది అంటారా, అదే రాజకీయం. అవసరం పాత కక్షలు, గతకాలపు వైరాన్ని మాయం చేసి, ముందున్న తక్షణ ఫలితాలను మాత్రమే ప్రధానమైనవిగా చేస్తుంది. మరి ఈ రెండు పార్టీలకి మధ్య ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా సయోధ్య కుదరాల్సి వచ్చిందో ఒకసారి చూద్దాం.

కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముక్కోణపు పోటీ జరిగింది. దాంట్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మైసూర్ ప్రాంతంలో బలంగా ఉన్న జెడిఎస్ కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. జెడిఎస్, వక్కలిగ సామాజిక వర్గానికి కర్ణాటకలో బలమైన ప్రతినిధిగా చెప్తారు. బిజెపికి లింగాయతుల మద్దతు ఉంది. జెడిఎస్ తో ఒప్పందం పెట్టుకుంటే వక్కలిగ సామాజిక వర్గం మద్దతు కూడా తమకు ఉంటుంది. అలాగే విడివిడిగా పోటీ చేయడం వల్ల ఎలాంటి దెబ్బ తగిలిందో అసెంబ్లీ ఎన్నికలు చెబుతున్నాయి. కనుక ఇక తప్పనిసరిగా జెడిఎస్ తో బంధాన్ని పునరుద్ధరించుకోవడానికే బీజేపీ (BJP) సిద్ధమైంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం ఎలా కుదురుతుంది అనేది కూడా ఒక సమస్య. ఈ విషయంలో కూడా రెండు పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టుగా కనిపిస్తోంది. మైసూర్ ప్రాంతంలో ఉన్న 14 లోక్ సభ స్థానాల్లో నాలుగు సీట్లు జెడిఎస్ కి కేటాయించడానికి బిజెపి అంగీకరించినట్టుగా అర్థమవుతుంది.

మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలియజేశారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జేడిఎస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. కాబట్టి ఇరు పార్టీలకు ఈ బంధం పునరుద్ధరణ అనివార్యమైంది. ఇప్పటికే హెచ్ డి దేవగౌడ, ప్రధాని మోడీ మధ్య సామరస్య పూర్వక చర్చలు సాగినట్టుగా యడ్యూరప్ప చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమార్ స్వామిని ఆయన నివాసం వద్ద హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా కలిశారు. తమ కలయిక ఫలప్రదమైందని వారు తెలియజేశారు.

కలియకలు, సమావేశాలు ఫలప్రదం కావడం అంటే రాజకీయ ఒప్పందాలు ఒక కొలిక్కి రావడమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు ఇదే కాబోలు. 16 సంవత్సరాల క్రితం తమకు ద్రోహం చేశారని, నమ్మించి వెన్నుపోటు పొడిచారని, చేసిన వాగ్దానం నెరవేర్చకుండా మాట తప్పారని బిజెపి ఏ పార్టీ మీదైతే నిందలు మోపిందో, ఆరోపణలు చేసిందో, అదే పార్టీతో ఇప్పుడు చేయి చాపి రాజకీయ కౌగిలింతకు ఉత్సాహం చూపింది. వీరి కలయిక కర్ణాటకలో రాజకీయ సమీకరణాలలో కొన్ని అనివార్యమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. విజయోత్సాహంతో ముందుకు దూసుకుపోతున్న కాంగ్రెస్ ఈ కలయికను ఎలాంటి శక్తితో ఎదుర్కొంటుందో చూడాలి. ఏది ఏమైనా సిద్ధాంతాలు వేరు, రాజకీయ ప్రయోజనాలు వేరు. నాయకులు రాజకీయ ప్రయోజనాలే చూస్తారు అని ఈ తాజా పరిణామం మనకు చెబుతోంది.

Also Read:  CBN Arrest Effect : BRS పార్టీలో చీలిక‌?, `పోచారం` రియాక్ష‌న్ తో అప్ర‌మ‌త్తం!