Pochampally : పేరు గొప్ప ఊరు దిబ్బ.. కష్టాల కడలిలో చేనేత కార్మికులు!

ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ 24వ సెషన్‌లో ఈ వారం 'ఉత్తమ పర్యాటక గ్రామం' అవార్డును పోచంపల్లి గ్రామం అందుకుంటున్నప్పటికీ, నేటికీ చేనేత కార్మికులు  కడు పేదరికంలో మగ్గుతుండటం కార్మికుల కష్టాలకు అద్దంపడుతోంది.

  • Written By:
  • Updated On - December 6, 2021 / 03:50 PM IST

ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ 24వ సెషన్‌లో ఈ వారం ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ అవార్డును పోచంపల్లి గ్రామం అందుకుంటున్నప్పటికీ, నేటికీ చేనేత కార్మికులు  కడు పేదరికంలో మగ్గుతుండటం కష్టాలకు అద్దంపడుతోంది.

హైదరాబాద్, విజయవాడలను కలిపే  హైవే  నుంచి కొంచెం దూరం వెళ్తే పోచంపల్లి గ్రామం కనిపిస్తుంది. ఈ గ్రామన్ని ‘సిల్క్ సిటీ’ అని కూడా పిలుస్తారు. పోచంపల్లి ఇకత్ సిల్క్ చీరకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న 80 శాతానికి పైగా కుటుంబాలు.. అంటే దాదాపు 3,000 కుటుంబాలు చీరను నూలు కట్టడం, చేతితో నేయడం ద్వారా జీవనోపాధి పొందుతుంటారు. ఈ గ్రామానికి వెళ్తే దారంతా చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తుంటాయి. ఈ చీరల కోసం కస్టమర్లు ఖరైదీన కార్లలో వస్తుంటారు. తాజా గ్లోబల్ అవార్డు వైభవంతో దూసుకుపోతున్న ఈ గ్రామానికి గుర్తింపులు కొత్త కాదు. 2004లో, పోచంపల్లి ఇకత్ భౌగోళిక సూచిక (GI) హోదాను పొందింది. 2013లో మేధో సంపత్తి హక్కు (IPR) రక్షణను పొందింది. పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రత, గ్రామంగానూ కూడా ప్రకటించబడింది.

మరీ ముఖ్యంగా, పోచంపల్లిలో సంఘ సంస్కర్త ఆచార్య వినోభా భావే 1951లో 100 ఎకరాల విరాళాన్ని స్వీకరించిన తర్వాత భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు, దానిని భూమిలేని కూలీలకు బహుమతిగా ఇచ్చారు. పోచంపల్లిలోని తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌టిడిసి) టూరిజం పార్క్, పర్యాటకుల కోసం మగ్గం నేయడం ప్రదర్శనలు జరుగుతాయి. 35 ఏళ్ల ప్రవీణ్ కుమార్ పట్టు చీర నేయడంలో బిజీగా ఉన్నారు. బీకామ్‌ గ్రాడ్యుయేట్‌ పూర్తిస్థాయి నేతగా మారేందుకు 15 ఏళ్ల క్రితం ఓ ప్రైవేట్‌ సంస్థలో ఆడిట్‌ విభాగంలో ఉద్యోగం మానేశాడు.

‘‘పట్టు నూలును బెంగళూరు నుంచి కొనుగోలు చేశామని, చీర నేయడానికి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతుందని ఆయన చెప్పారు. ముందస్తు నేత ప్రక్రియ మరో వారం మొత్తం పడుతుంది. డిజైన్లను ముందుగా నూలుపై గీస్తారు. ఇకత్ ఫాబ్రిక్‌ను నేయడానికి మగ్గంపై అమర్చే ముందు ఈ నూలులను వివిధ రంగులలో కట్టి, రంగులు వేస్తారు’’ అని కుమార్ వివరించారు. “డిజైన్‌లోని చిక్కులను బట్టి మా చీరల ధర రూ.7,000 నుండి రూ.20,000 వరకు ఉంటుంది. కానీ అదే డిజైన్ల ప్రింటెడ్ వెర్షన్‌లు ఇప్పుడు ఇ-కామర్స్ సైట్‌లలో 500 రూపాయల కంటే తక్కువ ధరలకు దొరుకుతాయి. దీని వల్ల ఎంతగానూ నష్టపోవాల్సి వస్తోంది” అని కన్నీటి పర్యంతమయ్యాడు.

ఐదు దశాబ్దాలకుపైగా ఇంట్లోనే సొంత మగ్గంపై ఇకత్ చీరలను నేస్తున్న విస్తారి గొట్టిముక్కల (60) తాజాగా ప్రపంచ గుర్తింపు రావడంతో గ్రామానికి మరింత మంది వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అతని భార్య అందాలు, ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన కొడుకు రమేష్, కోడలు అనితతో కూడిన విస్తారి కుటుంబం అంతా నేత పని మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ముడి సరుకును దుకాణదారుడు సరఫరా చేస్తాడు. పూర్తి చేసిన ఉత్పత్తులను తిరిగి ఇవ్వడంపై నెలకు రూ. 10,000 సంపాదిస్తారు. వీరంతా కలిసి నెలకు దాదాపు ఆరు చీరలను తయారు చేస్తారు. ‘‘పోచంపల్లిలో సొంతంగా మగ్గాలు ఉన్న చాలా కుటుంబాలు నెలవారీ వేతనాలకు పని చేస్తున్నాయి. గిరాకీని బట్టి ఆర్డర్లు వస్తాయి, వర్షాకాలంలో పని ఉండదు’’ అంటుంది గ్రామస్తురాలు అందాలు. “ఎక్కువ మంది మా చీరలు కొంటే, మాకు మరింత పని ఉంటుంది.”

చేతిపనులు తక్కువ లాభదాయకంగా మారాయని పేర్కొంటున్నారు మరొకరు. “ఒక నెలలో బేసిక్ డిజైన్‌ల ఏడు చీరలు నేయడానికి, నాకు 1.75 కిలోల వార్ప్, 3.5 కిలోల వెఫ్ట్ అవసరం. వీటి ధరలు  రూ.5,300. చేనేత కార్మికుల కూలీతో పాటు రంగు, బంగారు దారాల ధర కలిపితే రూ.48,500 వస్తుంది. ఈ చీరలను ఒక్కొక్కటి రూ.7,500లకు విక్రయిస్తున్నారు. ఈ ఉద్యోగంపై ఆధారపడిన ఆరుగురు సభ్యుల కుటుంబంగా, మేం కేవలం రూ. 4,000 లాభాన్ని పొందుతాము. కానీ అదే మా ఆదాయ వనరుగా మిగిలిపోయింది, ”అని అతను చెప్పాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి కార్మికులను చేతినిండా పని కల్పించు, ఆదుకోవాలని వేడుకుంటున్నారు.