Roshani Begum: బ్రిటిషర్లను ఎదురించి పోరాడిన టిప్పు సుల్తాన్ ఆస్థాన నర్తకి

1799లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం టిప్పు సుల్తాన్‌ను చంపేసింది. మైసూర్ రాజ్యం నుంచి టిప్పు సుల్తాన్ రాజవంశం మొత్తాన్ని ఖాళీ చేయించి, ఆ రాజ్యంలోని మహిళలందరినీ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న వెల్లూరు కోటకు పంపించేశారు.

  • Written By:
  • Updated On - November 21, 2021 / 09:27 PM IST

1799లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం టిప్పు సుల్తాన్‌ను చంపేసింది. మైసూర్ రాజ్యం నుంచి టిప్పు సుల్తాన్ రాజవంశం మొత్తాన్ని ఖాళీ చేయించి, ఆ రాజ్యంలోని మహిళలందరినీ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న వెల్లూరు కోటకు పంపించేశారు. అలా వెల్లూరు కోటలో బంధించిన వందల మంది మహిళల్లో టిప్పు సుల్తాన్ రాజ నర్తకి అయిన రోషనీ బేగం కూడా ఒకరు.
నిజానికి రోషనీ బేగం పేరు పుమ్ కుసుర్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనికి చెందిన నృత్యకారిణి. టిప్పు సుల్తాన్ యువరాజుగా ఉన్నప్పుడు పుమ్ కుసుర్ తన సోదరితో పాటు అతని పరివారంలో చేరింది. రోషన్ బేగం టిప్పు సుల్తాన్ పెద్ద కుమారుడు అయిన ఫతే హైదర్ తల్లి. దీంతో ఆస్థానంలో రోషనీ బేగంలో అత్యున్నత స్థానం దక్కింది. ఫతే హైదర్‌20 ఏళ్ల వయసులో.. అంటే, 1801లో గీసిన రోషనీ బేగం కుమారుడి చిత్రపటం ఆధారంగా చూస్తే.. 1770ల్లో ఆమె టిప్పు సుల్తాన్ ఆస్థానంలో చేరినట్టు తెలుస్తోంది.
టిప్పు సుల్తాన్ మరణం తరువాత 1802లో మొత్తం 550 మంది స్త్రీలతో పాటు రోషనీ బేగంను కూడా మైసూర్ రాజ్యం నుంచి వెల్లూరు కోటకు తరలించారు. అప్పటి నుంచి తన జీవితాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ కస్టడీలోనే ఉండిపోయింది. ఉన్నట్టుండి విదేశీ వర్తక కంపెనీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ.. రోషనీ బేగం మాత్రం తన నృత్యాన్ని కొనసాగించింది.
1804లో గూజీబ్ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. సంప్రదాయంగా వస్తున్న నాట్యాన్ని ఆమెకు నేర్పించింది. క్రమంగా వెల్లూరు కోటలోకి కొత్తవారి రాక ప్రారంభమైంది. 1802లో 550 మంది ఉన్న స్త్రీల సంఖ్య 1806 వచ్చే సరికి 790కి చేరింది. కోటలోని వారి సంఖ్య పెరుగుతోందన్న వార్త మద్రాస్ గవర్నర్‌గా ఉన్న విలియం బెంటింక్‌కు తెలిసింది. దీంతో 1806 ఫిబ్రవరిలో వారి మెయింటనెన్స్ బడ్జెట్‌లో కోత పెట్టారు. అంటే, కోటలోకి వచ్చే వారి సంఖ్యను తగ్గించడానికి అప్పటి గవర్నర్ తీసుకున్న చర్య ఇది. ఈ చర్యను రోషనీ బేగం తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే వెల్లూరు తిరుగుబాటుకు దారి తీసింది.

Image Representation

విలియం బెంటింక్ బడ్జెట్‌లో కోత పెట్టిన వెంటనే 1806 ఫిబ్రవరి-జూన్ మధ్య కాలంలో చాలా కథ నడిచింది. టిప్పు సుల్తాన్ నలుగురు కుమార్తెల వివాహం కోటలో అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్కో వివాహం రోజుల తరబడి జరిగింది. నిత్యం, సంగీతం నృత్య ప్రదర్శనలతో కోటలోని సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంగీత, నృత్య ప్రదర్శనలు రోషన్ బేగం నేతృత్వంలోనే జరిగాయి. అయితే, ఇదే సందర్భంలో వెల్లూరు కోటలోని ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున పనిచేస్తున్న భారతీయ సైనికుల గురించి మరో రకమైన వార్త కథలు కథలుగా ప్రచారం జరిగింది. వారు ధరించిన యూనిఫామ్‌లు, తలపాగా నేరంగా పరిగణించారు. ఒకవేళ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించదలిస్తే.. ఆహారంగాని, నీళ్లు గాని ఇవ్వబోమని ఈస్ట్ ఇండియా కంపెనీ తెగేసి చెప్పింది. అంతే కాదు, పెళ్లి చేసుకునే హక్కు కూడా కోల్పోతారని ఆదేశాలిచ్చింది.
ఈస్ట్ ఇండియా కంపెనీ విధించిన బహిష్కరణ నిబంధన సైనికుల్లో సరికొత్త తిరుగుబాటుకు పునాది వేసింది. 1806 జులై 9న కోటలో నృత్య ప్రదర్శన ముగిసిన తరువాత మద్రాస్ పదాతిదళానికి చెందిన సిపాయిలు తిరుగుబాటు చేశారు. వాళ్లు 129 మంది ఈస్ట్ ఇండియా సైనికులను చంపి మైసూర్ ర్యాజ్య జెండాను ఎగరవేశారు. రోషనీ బేగం కుమారుడు ఫతే హైదర్‌ను తమ రాజుగా ప్రకటించుకున్నారు.
వెల్లూరు కోటలో ప్రతిఘటన ఎదురవడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపించింది. సైనికులకు ఎదురు తిరిగిన 350 మంది తిరుగుబాటుదారులను చంపించింది. వెల్లూరు తిరుగుబాటును సైనిక చర్యగా అభివర్ణించారు. పరిశీలించి చూస్తే భారతీయ సైనికుల తిరుగుబాటు వెనక రోషనీ బేగం హస్తం ఉందని స్పష్టంగా అర్ధమవుతుంది. రోషనీ బేగం తన నాట్యం, కథాగానం ద్వారా సైనికుల్లో తిరుగుబాటును ప్రేరేపించిందని, ఆ రకంగా బ్రిటిష్ సైన్యంపై దండెత్తేలా చేసిందని ఈస్ట్ ఇండియా కంపెనీ గ్రహించింది.