Inspiring Story: కర్రతో కాలు.. ధైర్యంతో పోరు.. కష్టాల కడలిని ఎదురీదిన ఓ విజేత గాథ !!

కష్టం వస్తే కుప్పకూలిపోయే వాళ్ళను చూస్తున్నాం.. జీవిత సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ల గురించి నిత్యం మీడియాలో వింటున్నాం..

  • Written By:
  • Publish Date - September 8, 2022 / 11:30 AM IST

కష్టం వస్తే కుప్పకూలిపోయే వాళ్ళను చూస్తున్నాం..

జీవిత సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ల గురించి నిత్యం మీడియాలో వింటున్నాం..

కష్టాలను ఎదురీది కష్టపడి చెమటోడ్చే ఓపిక లేక అడుక్కొని తినే వాళ్ళను చూస్తున్నాం..

నాణేనికి బొమ్మ బొరుసు ఉంటుంది. అలాగే సమస్యలు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే సాహసులు కూడా సమాజంలో మన చుట్టూ ఎందరో ఉన్నారు.

అటువంటి ఒక సాహసి.. ఒక విజేతను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఆయనే మాన్ సింగ్ రామ్ మండావి. ఛత్తీస్ ఘడ్ లోని ఏజెన్సీ ఏరియా బస్తర్ వాస్తవ్యుడు. 31 ఏళ్ల క్రితం ఒక ప్రమాదంలో ఆయన తన కుడి కాలును కోల్పోయారు. అయితే ప్రభుత్వమో.. స్వచ్ఛంద సంస్థలో కృత్రిమ కాలు ఇస్తాయని మాన్ సింగ్ రామ్ మండావి ఎదురు చూడలేదు. తానే స్వయంగా కర్రతో ఒక కృత్రిమ కాలిని తయారు చేసుకున్నాడు. దాన్ని ధరించి మునుపటిలా సైకిల్ కూడా తొక్కడం మొదలుపెట్టాడు. సైకిల్ పై తన ఇంటి నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో అడవుల మధ్య ఉన్న పొలానికి వెళ్ళాడు. గత 31 ఏళ్లుగా ఇలా కర్ర కాలుతో సైకిల్ తొక్కడం, పొలానికి వెళ్లడం
మాన్ సింగ్ రామ్ మండావి దినచర్యలో భాగం అయిపోయింది.
ఈక్రమంలో ఏ ఒక్క రోజు కూడా తనకు కాలు లేదు.. అనే ఆలోచన ను ఆయన దరి చేరనివ్వలేదు. తన పొలంలో పంట పండించి.. దాన్ని తీసుకెళ్ళి పక్కనున్న టౌన్ లో అమ్మేసి వచ్చే డబ్బులతో కుటుంబాన్ని మాన్ సింగ్ నడుపుతున్నాడు. తన పిల్లలను చదివిస్తున్నాడు. జీవిత పోరాటం అంటే ఏమిటో చూపిస్తున్నాడు.

“కాళ్ళు ..చేతులు విరిగిన వాళ్ళు చాలామంది భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. మీకు అలాంటి ఆలోచన రాలేదా?” అని ప్రశ్నిస్తే మాన్ సింగ్ ఇలా బదులిచ్చారు. “కలలో కూడా భిక్షాటన చేయాలనే ఆలోచన నాకు రాలేదు. కృత్రిమ కాలుతో కష్టపడి జీవించగలను అనే ఆత్మవిశ్వాసమే.. కాలు పోయిన తర్వాత కూడా నన్ను ముందుకు నడిపింది.” అని తేల్చి చెప్పారు.

ఏడాదిన్నర పాటు పని చేస్తుంది..

“నేనే స్వయంగా ఈ కర్ర కాలును తయారు చేసుకుంటాను. దీన్ని ఒకసారి తయారు చేస్తే దాదాపు ఏడాది, ఏడాదిన్నర పాటు పని చేస్తుంది. గతంలో ఒక స్వచ్ఛంద సంస్థ నాకు ఒక కృత్రిమ కాలు ఇచ్చింది. అయితే అది కొన్ని రోజులకే విరిగిపోవడంతో పక్కన పెట్టాను. ఎవరిపైనా ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో స్వయంగా కర్ర కాలును రెడీ చేసుకొని వాడుతున్నాను” అని మాన్ సింగ్ వివరించారు.

జీవితం అనే ఈ యుద్ధంలో నిజమైన విజేత ఎవరు అంటే.. కష్ట కాలాన్ని ధైర్యంగా ఎదురీదే మాన్ సింగ్ లాంటి వాళ్లే. ఈతరం యువత చదువులో , టెక్నాలజీ లో ఎంతో దూసుకుపోతోంది. కానీ జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు కుప్పకూలుతోంది. సమస్యను ఎలా ఎదుర్కోవాలి? జీవితంలో ఒంటరితనం , ఓటమి ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి? ఓటమిని ఓపికగా ఎదుర్కొని విజయంగా ఎలా మార్చుకోవాలి? అనే అంశాల గురించి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మాన్ సింగ్ అలుపెరుగని జీవిత పయనం కూడా మనకు ఎంతో విలువైన పాఠాన్ని నేర్పుతుంది.