Site icon HashtagU Telugu

Uttar Kashi Incident : ఉత్తర కాశీ ఘటన లేవనెత్తిన ప్రశ్నలెన్నో

The Uttar Kashi Incident Raised Many Questions

The Uttar Kashi Incident Raised Many Questions

By: డా. ప్రసాదమూర్తి

Uttar Kashi Incident : దేశమంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం, ఆ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. కానీ 41 మంది నిరుపేద కార్మికులు చీకటి కోరల్లో సొరంగపు పొరల్లో చిక్కుకొని వెలుగు ఎప్పుడు చూస్తామో అని ఎదురుచూస్తున్నారు. ఉత్తర కాశీ (Uttar Kashi)లోని సిల్కీయారా టన్నెల్ లో నవంబర్ 12న శిథిలాల మధ్య చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను ఆ చీకటి కోరల నుంచి బయటకు సురక్షితంగా రప్పించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలః చేస్తోంది. దేశమంతా హాయిగా టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఎన్నికల పరిణామాలు చూస్తూ ఎవరి జీవితాన్ని వారు నిశ్చింతగా గడుపుతున్న ఈ కాలంలో ఆ 41 మంది హృదయాల్లో ఒకటే కాంక్ష ఒకటే కల కదలాడుతూ ఉంటుంది. సురక్షితంగా తాము ఎప్పుడు బయటపడతామా, వెలుగు ఎప్పుడు చూస్తామా, తమ తల్లిదండ్రులని ఆలుబిడ్డల్ని బంధుమిత్రులని ఎప్పుడు కలుసుకుంటామా అన్నదే వారి తాపత్రయం.

We’re Now on WhatsApp. Click to Join.

నాలుగున్నర కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో పొట్ట చేత పట్టుకుని వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ కార్మికులు నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రోజురోజుకు అక్కడ ఏం జరుగుతుంది, లోపల ఉన్న కార్మికులందరూ సురక్షితంగానే ఉన్నారా, వారికి ఆహారం నీరు వగైరా సహకారం నిత్యం అందుతున్నదా, 12 రోజులుగా సొరంగంలో బతుకు ఆశతో అయోమయంలో భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్న ఆ కార్మికుల భద్రతకు భరోసా ఉన్నదా లేదా.. ఇలాంటి విషయాలు ఎన్నో వార్తల రూపంలో మనకు అందుతూనే ఉన్నాయి. వారిని కాపాడటానికి బయట పని చేస్తున్న ఇంజనీర్లు, వర్కర్లు, అధికారుల బృందాలకి.. లోపల ఉన్న వారికి మధ్య ఇంకా ఎంతో దూరం లేదని, శిథిలాలు క్రమంగా తొలగిస్తున్నారని రెండు వైపులా, నిలువునా అడ్డంగా డ్రిల్లింగ్ జరుగుతోందని కూడా వార్తలు తెలుస్తున్నాయి. రేపో మాపో వారంతా సురక్షితంగా బయటపడతారన్న ఆశ కూడా కలుగుతుంది.

ఇంతకీ భద్రత మాట ఏంటి?

ఉత్తర కాశీ (Uttar Kashi) టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిశా, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చినవారే. ఈ ఘటన ద్వారా మనకు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు అధికారులకు ఉంటుంది. ఈ ఘటన తర్వాత అనేక వార్తా సంస్థలు అనేక కథనాలు ప్రచురించాయి. వాటి ద్వారా అర్థమవుతున్నదేమంటే- మూడు నాలుగు రకాల కార్మికులను ఇక్కడ పనిలోకి తీసుకోవడం జరుగుతుంది. వారిలో స్కిల్డ్ లేబర్, అన్ స్కిల్డ్ లేబర్, జనరల్ లేబర్ ఇట్లా కేటగరీలు ఉంటాయి. అత్యధిక వేతనం 25 వేలకు మించి ఉండదు. పదివేల లోపు వేతనం కోసం పనిచేస్తున్న వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఇందులో పనిచేస్తున్న కొందరు యువ కార్మికులతో కొన్ని వార్తా సంస్థలు చేసిన ఇంటర్వ్యూల ద్వారా అర్థమైంది ఏమిటంటే, ఈ ప్రమాదకరమైన సొరంగ మార్గ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనే కార్మికులకు ముందస్తుగా ఎలాంటి శిక్షణ ఇవ్వడం జరగలేదు. అలాగే ఈ కార్మికులతో నిర్మాణ సంస్థ ఎలాంటి అగ్రిమెంట్లు జరపలేదు.

అంటే కార్మికులకు నిర్మాణం చేపట్టిన సంస్థకు మధ్య ఎలాంటి రాతకోతల ఒప్పందమూ లేదు. చట్టపరమైన ఎలాంటి హామీలు లేవు. అంతేకాదు, ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి ఒక ప్రైవేటు సంస్థ అత్యంత ప్రమాదమైనటువంటి ఇలాంటి పనులలో కార్మికులను నియమించినప్పుడు వారికి కావలసిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీసుకోవలసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని అర్థమవుతుంది. ఒకవేళ ఈ కార్మికులకు జరగరానిది ఏమైనా జరిగినా వారికి ఎలాంటి బీమా సదుపాయం కూడా ఇక్కడ అమలులో లేదన్న విషయం కూడా తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఎక్కడ నుంచో పొట్ట చేత పట్టుకుని కార్మికులు రాష్ట్రాల సరిహద్దులు దాటి, దేశాల సరిహద్దులు దాటి భార్యా పిల్లలను, తల్లిదండ్రులను, పుట్టిన ఊళ్లను వదిలి వెళుతుంటారు. వారు పని చేసే చోట వారి భద్రతకు సంబంధించి సకల చర్యలూ యాజమాన్యం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక్కడ అలాంటివి ఏమీ జరగలేదని తెలుస్తోంది. అందుకే సొరంగంలో చిక్కుకుపోయిన ఆ 41 మంది ప్రాణాలతో బయటపడినా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సమస్త భద్రతా చర్యలు తీసుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది, అధికారులకు ఉంటుంది, నిర్మాణాలకు కాంట్రాక్టులు పొంది సంస్థలకూ ఉంటుంది. ప్రమాదాలు జరిగిన తర్వాత నేరాన్ని ఒకరి మీద ఒకరు తోసుకొని తప్పించుకునే మార్గాలు ఎంచుకొనే ఉదాహరణలే ఎక్కువగా మనం చూస్తుంటాం. కనీసం ఉత్తర కాశీ (Uttar Kashi)లో జరిగిన ఈ ఘటనతోనైనా ప్రభుత్వాలకు, అధికారులకు, నిర్మాణ సంస్థలకు కళ్ళు తెరిపిస్తే చాలు.

Also Read:  Rajasthan Polling : రేపే రాజస్థాన్‌ పోలింగ్.. టాప్ పాయింట్స్ ఇవే