Uttar Pradesh: యోగీ బాటే నా బాట అంటున్న అఖిలేశ్… ఇంకా సందిగ్ధంలోనే ప్రియాంక గాంధీ

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొన్నా.... ప్రధాన పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీ మధ్యే అన్నట్టు ఉంది. ఇక్కడ గెలుపు తమదంటే తమదేనని ఈరెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి.

  • Written By:
  • Updated On - January 23, 2022 / 03:29 PM IST

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొన్నా…. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీ మధ్యే అన్నట్టు ఉంది. ఇక్కడ గెలుపు తమదంటే తమదేనని ఈరెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే యూపీ ఎలక్షన్స్ లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సైతం ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాధ్ బాటలోనే పయణిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే.. ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గం విషయంలో యోగి ఆదిత్యనాథ్‌ను అనుసరిస్తూ తమ పార్టీకి కంచుకోట అనుకునే ప్రాంతం నుంచి అఖిలేశ్ బరిలోకి దిగుతున్నారు. తద్వారా సొంత సీటు గురించి పెద్దగా దృష్టిపెట్టాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో పర్యటించవచ్చని ఆయన భావిస్తున్నారు. నిజానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ విషయంలోనూ ఇదే చర్చ జరిగింది. హిందూ ఓట్లను సంఘటితం చేసే క్రమంలో రామమందిర నినాదాన్ని నిజం చేసి చూపిస్తున్న ‘అయోధ్య’ నుంచి పోటీ చేస్తారని తొలుత అందరూ భావించారు. ఇది కాకపోతే.. పార్టీ గట్టి పోటీని, సవాళ్లను ఎదుర్కొంటున్న పశ్చిమ యూపీలో ‘మథుర’ స్థానం నుంచి పోటీ చేసి, ఊపు తీసుకొస్తారని కూడా టాక్ నడిచింది. కానీ ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ యోగి తన కంచుకోట ‘గోరఖ్‌పూర్ సదర్’ నుంచే పోటీ చేస్తారని అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన రాష్ట్రమంతటా పర్యటించాల్సి ఉంటుందని, వేరే చోట పోటీకి దిగి ప్రయోగాలు చేస్తూ కూర్చుంటే, స్టేట్ లోని మిగతా నియోజకవర్గాలపై కాంన్సెన్ట్రేట్ చేయడం కుదరదని పార్టీ నేతలు భావించారు. మొత్తంగా యోగి, అఖిలేశ్ యాదవ్.. ఇద్దరూ కూడా సేఫ్ సీట్ నుంచి బరిలోకి దిగి, గేమ్ స్టార్ట్ చేశారు. అయితే యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ సదర్ నుంచి పోటీ చేస్తారని తెలిసిన వెంటనే అఖిలేశ్ స్పందించారు. యోగిని బీజేపీ అప్పుడే ఇంటికి పంపించేసిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. కానీ చివరకు అఖిలేశ్ కూడా సొంత ఇలాఖా నుంచే పోటీకి దిగక తప్పలేదు.

సమాజ్ వాదీ పార్టీ కంచుకోట ‘కర్హల్’..

సమాజ్‌వాదీ పార్టీకి గత కొన్ని దశాబ్దాలుగా విజయాలను అందిస్తూ కంచుకోటగా మారిన నియోజకవర్గం ‘కర్హల్’. ఈ స్థానం నుంచే అఖిలేశ్ యాదవ్ పోటీ చేయడం ఖరారైంది. ఈ నియోజకవర్గం అఖిలేశ్ స్వగ్రామం సైఫైకి కేవలం 5 కి.మీ దూరంలో ఉంటుంది. 2017 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మోదీ వేవ్‌లో బీజేపీ ఒక తరంగంలా దూసుకెళ్లి అత్యధిక స్థానాల్లో గెలుపొందినా సరే, ఈ నియోజకవర్గంలో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి శోభరన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి రామ శాక్యపై 38వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది సత్తా చాటారు. యాదవుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కర్హల్ నియోజకవర్గంలో 1993 నుంచి జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గెలుపొందుతూ వస్తోంది. ఒక్కసారి కూడా ఆ పార్టీ ఇక్కడ ఓటమి చవిచూడలేదు. దీంతో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డ అఖిలేశ్ ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతోనే ఇక్కడి నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన ఇక్కణ్ణుంచే పోటీ చేస్తారని గత కొంత కాలంగా ఊహాగానాలు వినిపించాయి. వాటిని ధృవీకరిస్తూ.. సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యులు రాంగోపాల్ యాదవ్ అధికారిక ప్రకటన చేశారు. రికార్డ్ మెజారిటీతో అఖిలేశ్ గెలుస్తారంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను అఖిలేశ్ సమీప బంధువు తేజ్ ప్రతాప్ సింగ్‌కు అప్పగించారు. ఇక్కడ ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది.

తొలిసారి అసెంబ్లీ బరిలో అఖిలేశ్..

ఇప్పటివరకు అఖిలేశ్ యాదవ్ లోక్‌సభ ఎన్నికలు ఎదుర్కొన్నారు తప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. గతంలో తాను సీఎంగా పనిచేసినప్పుడు కూడా కౌన్సిల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు తప్ప ఎమ్మెల్యేగా లేరు. ఆయన ప్రస్తుతం ఆజంగఢ్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఈసారి శాసన సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆజంగఢ్‌లోని గోపాల్‌పూర్ నియోజకవర్గం, బదౌన్‌లోని గున్నౌర్ నియోజకవర్గాలు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఈ రెండింటి కంటే ‘కర్హల్’లో పోటీచేయడమే అత్యంత సురక్షితమని చివరకు తేల్చారు. అందుకే అక్కడి నుంచి అఖిలేశ్ మొదటిసారి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు.

సేఫ్ సీట్ నే ఎంచుకున్న యోగీ..

ఉత్తర్ ప్రదేశ్ లో గోరఖ్‌పూర్ ప్రాంతం భారతీయ జనతా పార్టీకి గత కొన్ని దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిందనే చెప్పాలి. 1989 నుంచి జరిగిన దాదాపు ప్రతి ఎన్నికల్లో ఇక్కణ్ణుంచి భా.జ.పా గెలుపొందుతూ వచ్చింది. గోరఖ్‌నాథ్ మందిరం, మఠం ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం, హిందుత్వ భావజాలమే బీజేపీకి ఇక్కడ తిరుగులేని సానుకూలతలుగా పొలిటికల్ అనలిస్టులు చెబుతున్న మాట. 2002 నుంచి గోరఖ్‌పూర్ సదర్ నియోజకవర్గంలో యోగి ఆదిత్యనాథ్ సన్నిహితుడు డా. రాధామోహన్ దాస్ అగర్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2007లో బహుజన్ సమాజ్ పార్టీ, 2012లో సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నప్పటికీ, ఈ ప్రాంతంలో మాత్రం హిందుత్వ శక్తుల ఆధిపత్యమే కొనసాగింది. 2018లో గోరఖ్‌పూర్ లోక్‌సభ సీటుకు జరిగిన బై ఎలక్షన్స్ లో సమాజ్‌వాదీ పార్టీ గుర్తుపై నిషాధ్ పార్టీ నేత ప్రవీణ్ నిషాద్ గెలుపొందారు. ఆ వెంటనే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటుకుంది. భా.జ.పా, దాని అనుబంధ హిందూ సంఘాలకు అదనంగా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్‌కు సొంత బలగం కూడా ఉంది. ఈ ప్రాంతంలో చురుగ్గా పనిచేస్తున్న హిందూ యువ వాహిని సంస్థ ద్వారా యోగి తన పట్టును కొనసాగిస్తున్నారు. ఈ తరహా పరిస్థితి అయోధ్య, మథుర ప్రాంతాల్లో లేదు. గోరఖ్‌పూర్ ప్రాంతంలో యోగి ఆదిత్యనాథ్‌కు వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది. అయోధ్య గ్రామీణ ప్రాంతాల్లో కమళం పార్టీకి అంతగా సానుకూలత లేదని యోగికి తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన తన సొంత ఇలాఖా గోరఖ్‌పూర్ సదర్‌ను ఎంపిక చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీపై కొంత వ్యతిరేకత వస్తున్న నేపధ్యంలో… రిస్క్ ఎందుకని యోగీ ఈజీగా గెలిచే స్థానం నుంచే బరిలో దిగాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే… దేశ రాజకీయాల్ని డిసైడ్ చేసేవి యూపీ ఎన్నికలే. ఇక్కడ ఏ జాతీయ పార్టీ అధికారంలోకి వస్తే… కేంద్రంలో అదే పార్టీ రూలింగ్ చేస్తుంది అనేది గత చరిత్ర చెబుతున్న సత్యం. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా మాజీ ప్రధాని లాల్‌ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రిని యోగిపై పోటీకి దింపాలని చూస్తోంది. సునీల్ శర్మ 1980, 1985 ఎన్నికల్లో ఇక్కణ్ణుంచి గెలుపొందిన చరిత్ర కూడా ఉంది. ప్రత్యర్థులు ఎంత బలమైనవారైనా సరే, గోరఖ్‌పూర్ సదర్‌లో యోగిని, కర్హల్‌లో అఖిలేశ్‌ను ఎవరూ ఢీకొట్టలేరనేది విశ్లేషకుల అంచనా.

సందిగ్ధంలో ప్రియాంక..

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు తమ తమ స్థానాలను ఖరారు చేసుకోగా… కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా సీఎం అభ్యర్థినే ఖరారు చేయలేకపోతోంది. యూపీ యూత్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా పరోక్షంగానే తాను తప్ప ఇంకెవరున్నారు అంటూ ప్రియాంక గాంధీ సంకేతాలు పంపినప్పటికీ, మర్నాటికే తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థినే ఇంకా తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా లేదా అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకవేళ పోటీ చేయాలనుకున్నా.. ఎక్కణ్ణుంచి పోటీ చేయాలన్నదే ఆ పార్టీ ముందున్న అతి పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే, యోగి, అఖిలేశ్ మాదిరిగా కంచుకోట అని చెప్పుకోదగ్గ సీటు 403 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీకి కనిపించడం లేదు. 1989 నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ.. రాయ్‌బరేలి, అమేఠీ స్థానాలను మాత్రం కొన్నాళ్ల పాటు కంచుకోటగా మార్చుకోగలిగింది. ఇందుకు కారణం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరుసగా అక్కణ్ణుంచి పోటీ చేయడమే. అయితే 2019 నాటికి ఆ పరిస్థితి కూడా తారుమారైంది. సోనియా గాంధీ ఎలాగోలా గెలవగలిగినా… రాహుల్ మాత్రం ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అమేఠీలో అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ చేజిక్కించుకోగా.. రాయ్‌బరేలి పరిధిలోని రాయ్‌బరేలి ఎమ్మెల్యే (కాంగ్రెస్) అదితి సింగ్, హర్‌చంద్‌పూర్ ఎమ్మెల్యే (కాంగ్రెస్) రాకేశ్ సింగ్ ప్రస్తుతం బీజేపీ కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున పోటీకి సై అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తుందా అన్నది కూడా సందేహంగానే ఉంది.

ఇకపోతే ప్రియాంక గాంధీ నిర్వహించే సభలకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నప్పటికీ, పార్టీకున్న ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే… ఆ జనసందోహాన్ని ఓట్లుగా ఎంతవరకు మార్చుకోగలదు అన్న సందేహం తలెతుత్తోంది. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ తలపడని ప్రియాంక గాంధీ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? ఒకవేళ చేసి, గెలుపొందినా సరే, ప్రతిపక్షంలో తానొక్కరే కూర్చోవాల్సిన పరిస్థితికి సిద్ధపడతారా..? అన్న ప్రశ్నలు రాజకీయవర్గాల నుంచి ఎదురవుతున్నాయి. ఇక మరోవైపు చూస్తే… ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏడు విడతల్లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు..

ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ 312 స్థానాల్లో (39.67శాతం ఓట్లు) భారతీయ జనతా పార్టీ విజయం సాధించి, అధికార పగ్గాలు చేపట్టింది. సమాజ్‌వాది పార్టీ 47 స్థానాలకు పరిమితం కాగా.. బీఎస్పీ కేవలం 19 స్థానాల్లోనే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం కేవలం ఏడంటే.. ఏడే 7 స్థానాలకు పరిమితం కావల్సి వచ్చింది.

మొత్తంగా చూస్తే… ఉత్తర్ ప్రదేశ్ శాసన సభకు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ విడివిడిగా పోటీ చేస్తుండటంతో అక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంటోంది. అయితే ప్రధాన పోటీ మాత్రం యోగీ వర్సెస్ అఖిలేశ్ అన్నట్లే ఉంది. కొన్ని చోట్ల అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని ఎంఐఎం పార్టీ కూడా మిగిలిన నాలుగు ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తానంటోంది. అయితే… ఈ పార్టీల భవితవ్యం తేలాలంటే మాత్రం మార్చి 10 వరకు వెయిట్ చేయక తప్పదు.