గడ్డి కోసుకునే పిల్ల భారతీయ సినిమాల్లో తొలి దళిత నటిగా ఎలా మారింది?

పి.కె. రోజీ.. మలయాళం సినిమా తొలి మహిళా నటి. అంతేకాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటించిన తొలి దళిత మహిళ కూడా. వి

  • Written By:
  • Updated On - November 6, 2021 / 11:44 AM IST

పి.కె. రోజీ.. మలయాళం సినిమా తొలి మహిళా నటి. అంతేకాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటించిన తొలి దళిత మహిళ కూడా. విగత కుమారన్ అనే ఫీచర్ ఫిల్మ్‌లో అగ్రవర్ణ మహిళగా నటించింది. కాని, రోజీ నట ప్రస్థానం అంత ఈజీగా కొనసాగలేదు. దళిత మహిళ సినిమాల్లో నటించడం హిందువుల్లోని అగ్రవర్ణాలకు ఆగ్రహం తెప్పించింది. అందుకే, కేరళ రాష్ట్రాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. కాని, కాలం మారింది. 2019లో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ వారి ఫిల్మ్ సొసైటీకి రోజీ పేరు పెట్టడంతో ఆమెకు తగిన గుర్తింపు వచ్చింది.

జె.సి.డానియల్… ఫాదర్ ఆఫ్ మలయాళం సినిమా అని పేరున్న వ్యక్తి. 1930లో దర్శకత్వం వహించి స్వయంగా నటించిన చిత్రం విగత కుమారన్. కొందరు ఈ సినిమా 1928లో వచ్చిందని కూడా చెబుతుంటారు. ఈ సినిమా చంద్రకుమార్ అనే వ్యక్తి కథ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడే తప్పిపోయి, కొన్నేళ్ల తరువాత తిరిగి తన కుటుంబాన్ని కలుసుకునే కథ ఇది. ఈ సినిమాకు అరుదైన రికార్డులున్నాయి. మలయాళ దేశం నుంచి నటించిన తొలి మహిళ రోజీ అవడం, ఆమె ఓ దళిత మహిళ అవడం ఒక రికార్డ్ అయితే, తొలి మలయాళ చలనచిత్రం విగత కుమారన్ కావడం మరో విశేషం.ఇన్ని విశేషాలు ఉన్న విగత కుమారన్ సినిమా కాపీ లేకపోవడం నిజంగా దురదృష్టకరమే. ఈ సినిమా నుంచి కేవలం ఒకే ఒక్క ఫ్రేమ్ మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు, విశేషాలు కనుమరుగయ్యాయి. చివరికి రోజీ కూడా. ఉమెన్ ఇన్ కలెక్టివ్ సంస్థకు రోజీ పేరు పెట్టడంతో మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది.

ఎవరీ పి.కె.రోజీ?

త్రివేండ్రంలోని నందన్‌కోడ్‌లో 1903లో పాలోజ్, కుంజి దంపతులకు జన్మించింది. రోజీ పులయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఈ వర్గాన్ని అప్పటి తరం వాళ్లు అంటరానివాళ్లుగా చూసేవాళ్లు. కాని, కేరళ, కర్నాటకలో ఇప్పుడు వీళ్లదే డామినేషన్. రోజీ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. జీవనాధారంగా గడ్డిని కోసి, అమ్ముకుంటూ బతుకును వెళ్లదీసింది. అయితే, చిన్నప్పుడు ఈమె పేరు రాజమ్మ అని అదే రోజమ్మ అయిందని అంటుంటారు. క్రిస్టియానిటీ చేరాక ఆ పేరు కాస్తా రోజీగా మారింది. కొంతమంది మాత్రం రోజీ అనే పేరును డైరెక్టర్ డానియల్ పెట్టారని చెబుతుంటారు. గ్లామరస్ ఐడెంటిటీ కోసమే రోజీ అనే పేరు పెట్టారని చెప్పుకుంటుంటారు.
పులయ కమ్యూనిటీలో చాలా మంది బుట్టలు అల్లి అమ్ముకునే వారు. అంతేకాదు, కథలు చెప్పుకుంటూ జానపద పాటలు పాడుకుంటూ తమ వృత్తి పనులు చేసుకునే వారు. ఇదే తనను నాటకాల వైపు నడిపించింది. అప్పట్లోనే కక్కరిస్సీ నాటకంలో నటించింది. త్రివేండ్రం డ్రామా కంపెనీలో తన పేరును కూడా ఎన్‌రోల్ చేసుకుంది. అప్పట్లో నాటకాల్లో నటించే ఆడవాళ్లంటే వ్యభిచారులు అనే తప్పుడు భావనతో ఉండేవాళ్లు. పైగా నిమ్న కులం నుంచి వచ్చిన వారంటే ఇంకాస్త లోకువ ఎక్కువ. తన సొంత కుటుంబమే వారిస్తున్నా నాటకాలు మాత్రం విడిచిపెట్టలేదు.

కక్కరిస్సీ నాటకం చేస్తున్నప్పుడే జె.సి.డానియల్ కంటపడింది రోజీ. వెంటనే తన కథలో సరోజినీ అనే పాత్రకు రోజీని ఎంచుకున్నాడు. ఆ సినిమాలో అగ్రవర్ణం అయిన నాయర్ కుటుంబ మహిళగా నటించింది. మొత్తం 10 రోజుల పాటు షూటింగ్ జరిగింది, రోజుకు ఐదు రూపాయల చొప్పున పారితోషకం అందుకుంది.విగత కుమారన్ సినిమాకు రెండు రిలీజ్ డేట్లు ఉన్నాయి. 1928 నవంబర్ 7, 1930 అక్టోబర్ 23. ఈ సినిమాను త్రివేండ్రంలోని కాపిటల్ థియేటర్‌లో ప్రదర్శించారు. అప్పట్లో అగ్రవర్ణాలకు చెందిన వాళ్లు రోడ్ల వెంట వస్తుంటే.. తక్కువ కులం వాళ్లు నడవకూడదు. అలాంటి రోజుల్లో రోజీ ఏకంగా ఓ అగ్రవర్ణ మహిళగా నటించింది.

అగ్రవర్ణాల ఆగ్రహం
సినిమా ప్రీమియర్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు జరిగిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ సంఘటన సమయంలో రోజీని అక్కడి నుంచి పంపిస్తే గాని సినిమాను ప్రదర్శించబోమని పెద్ద గోల చేశారు. అప్పట్లో గొప్ప లాయర్‌గా పేరున్న గోవింద పిల్లై ఈ సినిమా షోను ప్రారంభించారు. కాని, రోజీ అక్కడి నుంచి వెళ్లిపోతేనే తాను ప్రారంభోత్సవం చేస్తానని చెప్పడంతో.. చేసేది లేక డైరెక్టర్ డానియెల్ రోజీని అక్కడి నుంచి పంపించేశారు.
అప్పటికే, ఓ అగ్రవర్ణ మహిళగా దళిత అమ్మాయి నటించడం ఏంటని ఆగ్రహంతో ఉన్న హిందువులకు ఈ సినిమాలోని కొన్ని సీన్లు మరింత కోపం తెప్పించాయి. ఓ సీన్‌లో రోజీ కొప్పులోని పూలను డానియెల్ ముద్దుపెట్టుకుంటాడు. అంతే, ఆ సీన్ చూసిన తరువాత తెరను చింపేసి, రాళ్లు విసిరి నానా బీభత్సం సృష్టించారు. అంతేకాదు, రోజీ ఇంటిపైనా రాళ్ల దాడి చేశారు. సినిమా షో ప్రారంభమైన మూడో రోజు రోజీ ఇంటిని తగలబెట్టారు. దీంతో ఏం చేయాలో తెలియక ఊరి నుంచి పారిపోయింది. ఓ లారీ డ్రైవర్‌కు తన కష్టం చెప్పుకోవడంతో తను నాగర్‌కోయిల్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ లారీ డ్రైవర్ పేరు కేశవ పిల్లై. ఈయన అగ్రవర్ణం అయిన నాయర్ కుటుంబానికి చెందిన వాడు. అయినా సరే, దళిత మహిళ అయిన రోజీని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత రోజీ పేరు రాజమ్మాళ్‌గా మారింది. పేరు చివరన అమ్మాళ్ అని ఉంటే.. అగ్రవర్ణానికి చెందిన వారిగా కేరళలో ఓ గుర్తింపు ఉండేది.

డైరెక్టర్ డానియల్‌కు విగత కుమారన్ సినిమానే తొలి, ఆఖరి చిత్రంగా మిగిలింది. ఆ సినిమా తరువాత జరిగిన సంఘటనలతో సినిమా ఇండస్ట్రీ నుంచే బయటికొచ్చేశారు. తన జీవితం మొత్తం పేదరికంలోనే గడిపారు.
రోజీ 1988లో చనిపోయారు. తన బతికున్నంత కాలం ఆమెను గుర్తుపట్టిన వాళ్లు, గుర్తుంచుకున్న వాళ్లు, ఆమెను కీర్తించిన వారు లేరు. ఒక దళిత మహిళగా ఆమె చేసిన సాహసాన్ని ఎవరూ గుర్తించలేదు. 2013లో తొలిసారి సినిమా చరిత్రకారులుగా గుర్తింపు పొందిన కున్నుకోళి, రైటర్ విను అబ్రహం.. రోజీ కథను బయటకు తీశారు.