Rajyasabha Tickets : వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు వీళ్లే?

పారిశ్రామిక‌వేత్త మై హోం రామేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుతం మీడియా అధిపతిగా కూడా ఉన్నారు.

  • Written By:
  • Updated On - May 11, 2022 / 11:21 AM IST

పారిశ్రామిక‌వేత్త మై హోం రామేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుతం మీడియా అధిపతిగా కూడా ఉన్నారు. ఆ కోటా నుంచి రాజ్య‌స‌భ‌కు ఈసారి ఎంపిక‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మీడియా నెట్ వ‌ర్క్ అధిప‌తిగా ఆయ‌న్ను ప్ర‌త్యేకంగా బీజేపీ గుర్తిస్తోంది. ఇటీవ‌ల స‌మ‌తామూర్తి విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కు ప్ర‌ధాని మోడీ రావ‌డం, ఆ సంద‌ర్భంగా కేసీఆర్‌, చిన‌జీయ‌ర్ మ‌ధ్య దూరం పెర‌గ‌డం వంటి అంశాల‌ను తీసుకుంటే బీజేపీకి ఆయ‌న ద‌గ్గ‌ర‌య్యార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే రాజ్య‌స‌భ ప‌ద‌వికి ఆయ‌న్ను ఎంపిక చేయాల‌న్న ఆలోచ‌న బీజేపీ అగ్ర‌నేత‌లు చేస్తున్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌.

ప్ర‌స్తుతం ఆయ‌న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు మెంబ‌ర్ గా ఉన్నారు. రెండోసారి ఆ ప‌ద‌విని అనుభ‌విస్తున్నారు. ఏపీలోని వైసీపీ స‌ర్కార్ నామినేట్ చేసిన ప‌ద‌వి టీటీడీ బోర్డు మెంబ‌ర్‌. ఇప్పుడు అదే పార్టీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఆయ‌న్ను ఎంపిక చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు ఢిల్లీ బీజేపీ అగ్ర‌నేత‌ల నుంచి వైసీపీ అధిష్టానంకు సంకేతం వెళ్లింద‌ని ప్రచారం ఊపందుకుంది. మొత్తం నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఈసారి వైసీపీకి రానున్నాయి. వాటిలో ఒక‌టి మైంహోం రామేశ్వ‌ర‌రావు ద‌క్క‌నుంద‌ని బ‌లంగా వినిపిస్తోంది. ఇక రెండో పేరు అదానీ స‌తీమ‌ణి కి ద‌క్కుతుంద‌ని వినికిడి. మూడో స్థానానికి తెలంగాణకు చెందిన బీసీ నేత ‘ఆర్‌.కృష్ణయ్య’ కు ద‌క్కనుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆయ‌న 2019 ఎన్నికలకు ముందు వైకాపాకు మద్దతు ఇచ్చారు. బీసీలను వైకాపా వైపు మళ్లించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అప్పట్లోనే ఆయనకు ‘జగన్‌’ రాజ్యసభ హామీ ఇచ్చిన మేర‌కు ఈసారి ఆ ప‌ద‌వి ద‌క్క‌నుంద‌ని బీసీ వ‌ర్గాల్లోని చ‌ర్చ.

వైసీపీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోసారి రాజ్య‌స‌భ దాదాపు ఖాయం అయింద‌ని తెలుస్తోంది. తొలిసారి రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఆయ‌న చేసిన ప‌నితీరు ఆధారంగా రెండోసారి ఇవ్వాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. కేంద్రంతో ఆయ‌న న‌డిపిన లాబీయింగ్ వైసీసీకి, జ‌గ‌న్ కు మ‌ధ్య పూల‌బాట వేసింది. ఒక‌టి రెండు సార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ విష‌యంలో బెడిసికొట్టిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత అన్నీ స‌ర్దుకున్నాయి. దీంతో రాజ్య‌స‌భ స‌భ్యునిగా విజ‌య‌సాయిరెడ్డికి మంచి మార్కులు సంపాదించార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. పైగా ఆయ‌న‌కు పోటీగా ఉండే వైవీ సుబ్బారెడ్డి ప్ర‌స్తుతం టీటీడీ చైర్మ‌న్ గా రెండోసారి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. దీంతో మ‌రోసారి విజ‌యసాయిరెడ్డికి రాజ్య‌స‌భ ఖ‌రారు అయింద‌ని వినికిడి.

గ‌త రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఢిల్లీ బీజేపీ చెప్పిన‌ట్టు ముఖేష్ అంబానీ కోటా కింద ప‌రిమ‌ళ న‌త్వానికి రాజ్య‌స‌భ‌ను ఇవ్వ‌డం జ‌రిగింది. ఈసారి ఆదానీ గ్రూప్ కోటా కింద గౌతమ్ ఆదానీ సతీమణి ప్రీతి ఆదానీ లేదా మైహోం రామేశ్వ‌ర‌రావుకు రాజ్య‌స‌భ‌ను ఇవ్వాల‌ని బీజేపీ కోరింద‌ని స‌మాచారం. మిగిలిన నాలుగో సీటును. మైనార్టీల‌కు ఈసారి కేటాయించే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది. ఒక వేళ మైనార్టీల‌కు రాజ్య‌స‌భ‌ను ఇవ్వాల‌నుకుంటే టాలీవుడ్ కుబేరునిగా ఉన్న ఆలీ పేరు ప్ర‌ముఖంగా ఉంటుంద‌ని టాక్‌. చాలా కాలంగా ఆయ‌న కీల‌క ప‌ద‌విని ఆశిస్తున్నారు. ఆలీకి రాజ్య‌స‌భ ఇవ్వ‌డం ద్వారా మైనార్టీ, సినీ ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక వేళ ఆలీకి ఇవ్వ‌క‌పోతే, మైనార్టీ వ‌ర్గాల్లో పారిశ్రామిక వేత్తలుగా ఉన్న వాళ్లు వైసీపీలో ఉన్నారు. వాళ్ల‌లో ఒక‌ర్ని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.

మొత్తం నాలుగు రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ఎంపిక చేసుకునే వెసుల‌బాటు ఉన్న‌ప్ప‌టికీ రెండు ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల కోటా ఉండ‌నుందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి అనూహ్యంగా పారిశ్రామిక వేత్త పరిమళ్ నత్వానీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. రిలయన్స్ సంస్థల అధినేత, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి క‌ల‌వ‌డంతో రాజ్య‌స‌భ ఖ‌రారు అయింది. ఆదానీ గ్రూప్ కు ఈసారి రాజ్య‌స‌భ‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇస్తే, దేశంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాల వైసీపీలో ఉన్న‌ట్టే. అంతేకాదు, సీఎం జగన్ టీం మెంబర్స్ అవుతారు. కానీ, మైహోం రామేశ్వ‌రావు పేరు ఢిల్లీ బీజేపీ ఈసారి ప్ర‌మోట్ చేస్తోంద‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. నాలుగు స్థానాల్లో విజ‌య‌సాయిరెడ్డి, ఆర్ కృష్ణ‌య్య‌, మైహోం రామేశ్వ‌రావు లేదా ఆదానీ గ్రూప్, మైనార్టీకి చెందిన లీడ‌ర్ కు ద‌క్కు ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది.