Number 1 : నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా ఏపీ.. నదులు, సముద్రాలకు కాలుష్య గండం

Number 1 : దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

  • Written By:
  • Updated On - November 19, 2023 / 09:59 AM IST

Number 1 : దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 21న జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికెట్‌, అవార్డును ఏపీ అధికారులకు ప్రదానం చేయనున్నారు. గతంలోనూ ఏపీ ఈ అవార్డును దక్కించు­కుంది. ఈ నేపథ్యంలో  మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ శాఖ అధికారులు, సిబ్బందికి ట్విట్టర్‌  ద్వారా అభినందనలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆంధ్రప్రదేశ్‌‌కు సుదీర్ఘమైన 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్రం మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల జనాభా (2011 లెక్కల ప్రకారం) దాదాపు 6.05 లక్షలు ఉంది. వీరిలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య 1.50 లక్షలు. అప్పటి లెక్కల ప్రకారం 12,747 మోటారైజ్డ్‌, 1771 మెకనైజ్డ్‌, 14,677 సాంప్రదాయ బోట్లు రాష్ట్రంలో ఉండేవి. గడిచిన పన్నెండేళ్ల కాలంలో సాంప్రదాయ, మోటరైజ్డ్‌ బోట్ల సంఖ్య భారీగా తగ్గింది. వాటి స్థానంలో మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. అత్యంత ఆధునిక నౌకలు చేపల వేటకు అందుబాటులోకి వచ్చాయి. వందల కోట్లు పెట్టుబడులుగా పెట్టగల కార్పొరేట్లు ఈ రంగంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నారు. ఈనేపథ్యంలో జలచరాలకే కాదు.. మత్య్పకారుల ఉనికికి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. కాలుష్యం కారణంగా చోటుచేనుకుంటున్న వాతావరణ మార్పులతో సముద్రాలు ఉప్పొంగి, మత్స్యకారుల ఆవాసాలను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ తూర్పుతీరంలోని లక్షలాది మంది మత్స్యకారుల బతుకులు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి.

Also Read: Whats Today : నడ్డా, కేసీఆర్, కేటీఆర్ సుడిగాలి పర్యటనలు

సముద్ర జలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు మత్స్యకారులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. నదులలో ఏటికేడాది కాలుష్యం పెరుగుతోంది. సముద్రపు ఒడ్డున కూడా విచ్చలవిడిగా పరిశ్రమలకు అనుమతిస్తుండటంతో సముద్రమూ కాలుష్య సాగరంగా మారుతోంది. నదుల్లో చేరుతున్న కాలుష్యానికైతే లెక్కలున్నాయిగానీ, సముద్రంలో కలుస్తున్న విషపదార్థాలపై పూర్తిస్థాయి సమాచారం లేదు.ఫలితంగా వందల రకాల సముద్ర జీవజాలం, చేపల జాతుల ఉనికి ఇప్పుడు కనిపించడం లేదు. బంగాళాఖాతం పొడవునా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో భూమి కోతకు గురవుతోంది. కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్రనాథ్‌ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం ఏపీలో ఇప్పటికే 294.89 కిలోమీటర్ల మేర భూమి కోతకు గురైంది. ఇది మొత్తం తీర ప్రాంతంలో 28.7 శాతం. తీర ప్రాంతాలలోని కర్మాగారాల నుంచి విడుదలయ్యే కాలుష్య పదార్థాలు పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. దీనిని నియంత్రిస్తున్నట్లు, కాలుష్య నివారణకు చట్టాలను కఠినంగా వినియోగిస్తున్నట్లు.. ప్రభుత్వం చెబుతున్న విషయాలు మాటలకే పరిమితం. దీని ప్రభావం మత్య్స సంపదపైనే పెద్ద ఎత్తున(Number 1) పడుతోంది.