Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా ఎందుకనలేదు?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ సభలో చేసిన ప్రసంగం ఏం సూచిస్తుంది? అనే ప్రశ్నకు విభిన్నమైన సమాధానాలు వస్తున్నాయి.

  • Written By:
  • Updated On - November 9, 2023 / 10:22 AM IST

By: డా. ప్రసాదమూర్తి

హైదరాబాదులో తాజాగా జరిగిన బిజెపి బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రసంగించారు. ఆయన చేసిన ప్రసంగం, ఆయన రాజకీయ వైఖరికి ఆయన రాజకీయ అవగాహనకు అద్దం పడుతుంది. ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీని ఎన్నికల బరిలోకి దింపితే ఆ నాయకుడికి, ఆ పార్టీకి తాము నిర్వహించబోతున్న పాత్ర మీద ఒక స్పష్టత ఉంటుంది. ఎవరిని ఎదుర్కొంటున్నాం.. ఎందుకు ఎదుర్కొంటున్నాం.. తమ లక్ష్యాలు ఏంటి అనే విషయాల్లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఒక స్పష్టమైన రాజకీయ విజ్ఞతతో కూడిన అవగాహన ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ సభలో చేసిన ప్రసంగం ఏం సూచిస్తుంది? అనే ప్రశ్నకు విభిన్నమైన సమాధానాలు వస్తున్నాయి. తెలంగాణలో బిజెపితో కలిసి పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. దాదాపు 30 సీట్లు పైగా ఆశించినా, జనసేన పార్టీకి 9 స్థానాలు ఇస్తామని అంతిమంగా 8 స్థానాలకే పరిమితం అవుతున్నట్టు బిజెపి తెలిసింది. దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తలొగ్గారు. ఇది సరే, ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామని కాదు, తమ బలాబలాలను దృష్టిలో పెట్టుకొని వేరే పార్టీతో కలిసి ఎవరైనా పోటీ చేస్తారు. చేయవచ్చు తప్పులేదు. కానీ ఆ పోటీ దేనికి అనే విషయంలోనే ఒక స్పష్టమైన అవగాహన ఆ పార్టీకి ఉండాలి.

We’re Now on WhatsApp. Click to Join.

బిజెపి బీసీ ఆత్మగౌరవ సభలో ప్రసంగం చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడా ఒక్క మాట కూడా అధికార బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాగే బిజెపితో కలిసి తెలంగాణలో తాము ఎందుకు పోటీలో నిలబడ్డారో వివరణ కూడా ఇవ్వలేదు. అలా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? బిజెపి లక్ష్యం అధికార బీఆర్ఎస్ ను దించడమే కాబట్టి దానితో కలిసి పోటీ చేయడం అంటే తమ లక్ష్యం కూడా అదేనని అర్థం చేసుకోవాలని జనసేన వాదించవచ్చు. అలా అనుకున్నా ఆంధ్రాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు భావిస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను పదవి నుంచి కూలదోయడమే తమ లక్ష్యం అని ఒక్క మాటయినా చెప్పాలి. అంతేకాదు, తాము ఎందుకు బీఆర్ఎస్ ను ఓడించడానికి సిద్ధపడ్డారో కొంచమైనా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. తద్వారా తమ పార్టీ శ్రేణులకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఎక్కడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గాని, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ను గాని, ఆయన కుమారుడు కేటీఆర్ ను గానీ, ఆ ప్రభుత్వ విధానాలను గాని, ఆ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలు కానీ.. ఒక్క మాటైనా పవన్ ప్రస్తావించలేదు.

తన ప్రసంగంలో కేవలం నరేంద్ర మోడీ గుణగానం మాత్రమే చేశారు పవన్. ఒక మాటలో చెప్పాలంటే తన హృదయంలో కొలువుదీరిన భగవంతుడిని ఎలా ఒక భక్తుడు స్తోత్ర పాఠాలతో భజిస్తాడో అలాంటి స్తోత్ర పాఠాలతోనే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని కీర్తించారు. నరేంద్ర మోడీ చేసేవి ఎన్నికల రాజకీయాలు కాదని, ఆయన చర్య తీసుకున్నది ఏదైనా దేశ ప్రయోజనాల కోసమేనని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలంగాణ ప్రజల సమక్షంలో చెప్పారు. ఆర్టికల్ 370 విషయంలో గానీ నోట్ల రద్దు విషయంలో గానీ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో గానీ త్రిపుల్ తలాక్ విషయంలో గానీ రామ మందిరం విషయంలో గానీ నరేంద్ర మోడీ ఎన్నికల కోసం చేయలేదని, దేశ ప్రయోజనాల కోసం చేశారని పవన్ కళ్యాణ్ ఉవాచ. ఆ అంశాలన్నీ బిజెపి నాయకులు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాస్త్రాలుగానే వాడుతుంటారు. మరి పవన్ కళ్యాణ్ కి ఈ మాత్రం రాజకీయ పరిజ్ఞానం కూడా లేదా అనే సందేహం ఆయన ప్రసంగం విన్న వారికి కలగొచ్చు. ఇదంతా సరే తన ప్రసంగంలో మోడీ కీర్తన, భజన మినహాయిస్తే తెలంగాణలో తమ లక్ష్యసాధన ఏమిటో పవన్ ఎందుకు నిర్దేశించలేదు అనే ప్రశ్నకు జనసేన నాయకులు ఏం సమాధానం చెబుతారో తెలియదు. కానీ ఒక విషయం స్పష్టంగా అర్థమయిపోయింది.

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న విషయం తెలిసి కూడా బిజెపితో కలిసి పవన్ పోటీకి సిద్ధమయ్యారు. అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు సాధ్యమైనంత మేరకు తమవైపు లాక్కుంటే ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఇది బిజెపి ఎన్నికల వ్యూహంగా పలువురు రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా బిజెపి దేశవ్యాప్త రాజకీయ వ్యూహం కాంగ్రెస్ ని వీలైన చోటల్లా అడ్డుకోవడమే. ఆ వ్యూహమే తెలంగాణలో కూడా అమలు జరుపుతోంది బిజెపి. ఈ నేపథ్యంలో బిజెపితో చేతులు కలిపే వారు ఎవరైనా ఆ వ్యూహంలో భాగస్వాములు కావడమే. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో కేసీఆర్ ను గాని ఆయన ప్రభుత్వాన్ని గాని పల్లెత్తి మాట అనకపోవడం ఈ వ్యూహంలో భాగంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కు కేసిఆర్ కుటుంబంతో గట్టి సంబంధాలే ఉన్నాయని ఈ సందర్భంలో కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే కేసిఆర్ ప్రభుత్వాన్ని పవన్ ఒక మాటయినా అనలేదని అంటున్నారు. అంతేకాదు బిజెపితో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ మీద బీఆర్ఎస్ వారు కూడా ఎక్కడా ఒక చిన్న నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో నాయకులు పైకి మాట్లాడేది ఒకటి వారి అంతరాత్మల్లో ఉండేది మరొకటి. వారి మాటల్ని జనం అర్థం చేసుకుంటారేమో గాని, వారి అంతరాత్మల్ని చదివే జ్ఞానం సామాన్య పౌరులకు ఎక్కడిది?

Also Read:  Andhra Pradesh : ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన క‌లెక్ట‌ర్ భార్య‌