Muslim and Dalit Voters : ముస్లిం, దళిత ఓటర్ల తీర్పు కీలకం

ముస్లిం మైనారిటీ ఓటర్లు (Muslim Voters), దళిత ఓటర్లు (Dalit Voters) ఏ పక్షానికి మద్దతు ఇస్తారు.. ఏ పార్టీని గెలుపు గుర్రంగా భావిస్తారు..

  • Written By:
  • Updated On - November 24, 2023 / 01:19 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Muslim and Dalit Voters is Crucial : తెలంగాణ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రచారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ ఓటర్లు (Muslim Voters), దళిత ఓటర్లు (Dalit Voters) ఏ పక్షానికి మద్దతు ఇస్తారు.. ఏ పార్టీని గెలుపు గుర్రంగా భావిస్తారు.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వారు మనసా వాచా కర్మణా కోరుకుంటున్నారు.. అనే చర్చ ఇప్పుడు రాష్ట్రమంతా అన్ని వర్గాల్లోనూ కొనసాగుతోంది. ఒకప్పుడు ముస్లిం ఓటర్లు (Muslim Voters) ఎంఐఎం నాయకులు చెప్పిన మాట తూచా తప్పకుండా వినేవారు. ఎంఐఎం తీసుకున్న నిర్ణయాన్ని ముస్లిం మత పెద్దలు కూడా అంగీకరించేవారు. అందరూ కలిసి ఒక మాట మీద వెళ్లేవారు.

We’re Now on WhatsApp. Click to Join.

హైదరాబాదులో ఎంఐఎంకి బలం ఉన్న స్థానాల్లో కచ్చితంగా ఎంఐఎం అభ్యర్థులను ముస్లిం ఓటర్లంతా గెలిపించేవారు. అలాగే ఎంఐఎం నాయకులు, మత పెద్దలు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లిం మైనారిటీ ఓటర్లు ఆయా అభ్యర్థులకు ఓట్లు వేసేవారు. కానీ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మతపరమైన విద్వేషాల రాజకీయాలు నడుపుతున్న బిజెపికి అనుకూలంగా ఎంఐఎం వ్యవహరిస్తుందన్న మచ్చను ఆ పార్టీ నాయకులు పోగేసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవడానికి కాంగ్రెస్ ఓడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తోంది బిజెపి. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా మైనారిటీ హక్కుల కోసం ముందుండి పోరాటానికి నడుంకట్టి సాగుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముస్లిం మైనారిటీ ప్రజలు సహజంగా కృషి చేయాల్సి ఉంది. కానీ ఎంఐఎం మాత్రం బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది. తాము పోటీ చేస్తున్న స్థానాలతో పాటు రాష్ట్రమంతా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయమని ఎంఐఎం నాయకులు ముస్లిం మైనారిటీ ఓటర్లకు చెప్తున్నారు.

ఇది ఈసారి బెడిసి కొట్టేలా కనిపిస్తోంది. ఒకపక్క బిజెపి, బీఆర్ఎస్ రెండూ ఒకటే అనే విషయం బహిరంగ రహస్యంగా మారిపోయిన తర్వాత, పరోక్షంగా బిజెపికి ఉపయోగపడే పనిని మైనారిటీ ఓటర్లు ససేమిరా చేయరు. అందుకే తొలిసారి తెలంగాణలో దాదాపు 16 సంఘాల ముస్లిం మతపెద్దలు ఎంఐఎం పోటీ చేస్తున్న చోట వారికి అనుకూలంగా ఓటు చేయమని, మిగిలిన చోట్ల కాంగ్రెస్కు ఓటు వేయమని ముస్లిం ఓటర్లను కోరారు. కానీ మరో పక్క ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ, ఇతర ఎంఐఎం నాయకులు తెలంగాణ రాష్ట్రమంతా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయమని ముస్లిం సోదరులకు చెబుతున్నారు. ఇక్కడే ముస్లిం మైనారిటీ వర్గాలలో పెద్ద వైరుధ్యం తలెత్తింది. ఈసారి తెలంగాణలో ముస్లిం సోదరులు కూడా తమ మనసుకు నచ్చిన పార్టీని అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

అందుకే ఈసారి ఎంఐఎం సాంప్రదాయకంగా గెలుస్తున్న చోట కూడా అంత మెజారిటీ రాకపోవచ్చని, ఒకటి రెండు స్థానాలు ఓడిపోయినా ఆశ్చర్యం లేదని, ముస్లిం ఓటర్లు చాలా కృతనిశ్చయంతో ఈసారి కాంగ్రెస్‌ ని గెలిపించాలన్న పట్టుదలతో ఉన్నారని పలు విశ్లేషణలు సర్వేల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనారిటీ వర్గాల కోసం ఒక ఐటీ పార్కు నిర్మిస్తానని వాగ్దానం చేశారు. ఎన్నికలు ఐదు రోజులు ఉండగా చేసిన ఇలాంటి వాగ్దానాలను ఎంతవరకు ఎవరు నమ్ముతారు అనేది వేచి చూడాల్సిందే.

Also Read:  CM KCR: బీఆర్ఎస్ ప్రచారానికి వర్షం అడ్డంకి, కేసీఆర్ బహిరంగ సభ రద్దు

ఇంకోపక్క దళితుల ఓట్లు కూడా రాష్ట్రంలో చాలా కీలకంగా మారాయి. దాదాపు 20 శాతం ఎస్సీ ఓట్లు ఉండవచ్చని ఒక అంచనా. అందుకే దళితులలో బలమైన మాదిగ సామాజిక వర్గాన్ని తమ వైపు ఆకర్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సాక్షాత్తు హైదరాబాదు బహిరంగ సభలో లక్షలాది మాదిగ సోదరుల సమక్షంలో తాను మాదిగల పోరాటం వైపు నిలబడతానని మాట ఇచ్చారు. ఆ మాట ఎన్నికల తర్వాత ఆయన ఎంత నిలబెట్టుకుంటారో లేదో తెలియదు గాని, 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముందుండి నడుపుతున్న మందకృష్ణ మాదిగ ఇప్పుడు బిజెపికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. బిజెపి మాయలో ఆయన పడిపోయారా.. మోసపోయారా.. లేక బిజెపి ప్రలోపానికి లొంగిపోయారా అనేది దళిత వర్గాల్లో పెద్ద గందరగోళానికి చర్చకు దారితీసింది.

ఇదే నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ తరఫున విడిగా అభ్యర్థులను నిలబెట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం సాగిస్తున్నారు. ఆయన ఎస్సీల్లో ఎన్ని వర్గాల ఓట్లను ఎంత మేరకు చీల్చగలరో తెలియదు. కానీ ఒక పక్క మందకృష్ణ మాదిగ, మరోపక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లను గణనీయంగా చీల్చగలిగితే ఆ మేరకు అధికార బీఆర్ఎస్ పార్టీ కంటే నష్టపోయేది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీయే అని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అయితే ముస్లిం మైనారిటీల మాదిరిగానే తెలంగాణలో దళిత ఓటర్లు కూడా తమ అంతరాత్మ చెప్పిన విధంగానే ఓట్లు వేస్తారని, నాయకులు ప్రలోభాలకు లొంగినా, వారు వాస్తవానికి, సత్యానికి కట్టుబడి ఓట్లు వేస్తారని మరో వాదన వినిపిస్తోంది.

కనుకనే దళిత ఓట్ల ఆకర్షణ కోసం కూడా నాయకులు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కీలకవర్గాలు ఎటువైపు మొగ్గుతాయో అటువైపే విజయం కూడా మొగ్గు చూపే అవకాశం మాత్రం ఉంది. డిసెంబర్ 3న ఆ విషయాలు ఎలాగూ తెలుస్తాయి. ఎదురు చూద్దాం.

Also Read :  Uttar Kashi Incident : ఉత్తర కాశీ ఘటన లేవనెత్తిన ప్రశ్నలెన్నో