MLA Raja Singh : మ‌రో నపూర్ శ‌ర్మ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ప్ర‌వ‌క్త‌పై వీడియో క‌ల‌క‌లం

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధి న‌పూర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల గాయం మాన‌క‌ముందే ఎమ్మెల్యే రాజాసింగ్ ప్ర‌వక్త‌ను కించిప‌రుస్తూ ఒక వీడియోను విడుద‌ల చేయ‌డం దుమారాన్ని రేపుతోంది.

  • Written By:
  • Updated On - August 23, 2022 / 12:37 PM IST

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధి న‌పూర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల గాయం మాన‌క‌ముందే ఎమ్మెల్యే రాజాసింగ్ ప్ర‌వక్త‌ను కించిప‌రుస్తూ ఒక వీడియోను విడుద‌ల చేయ‌డం దుమారాన్ని రేపుతోంది. ప్ర‌వ‌క్త‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన వీడియోను ప‌రిశీలించిన పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. మునావర్ ఫరూకీ షో హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రిచేలా ఉంద‌ని, ప్ర‌తిగా ప్రవ‌క్త మీద వీడియోను రాజాసింగ్ విడుద‌ల చేశారు. ఆ విష‌యాన్ని పోలీసుల ఎదుట సింగ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

కమెడియన్ మునావర్ ఫరూకీ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తే ప్ర‌తిగా ఓ ‘కామెడీ’ వీడియోను విడుదల చేస్తానని రాజాసింగ్ గతంలోనే చెప్పారు. ఆయన షో నిర్వహించకుండా అడ్డుకోవాలని, లేదంటే వేదికను తగలబెడతానని హెచ్చరించిన విష‌యం విదిత‌మే. దీంతో మునావర్ ఫరూకీ షో రోజున పోలీసులు రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మునావర్ ఫరూకీ షో నిర్వహించాడు. దీంతో ముందు చెప్పినట్టుగానే రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా మాట్లాడారంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తాజా వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ మునావర్ ఫరూకీ తమ మనోభావాలను కించపరిచాడని ఆరోపించారు. మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ రాజాసింగ్ వీడియో విడుదల చేసిన తర్వాత హైదరాబాద్‌లో నిరసనలు చెలరేగాయి. బషీర్‌బాగ్‌లోని నగర కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుట ఆందోళనకారులు ధ‌ర్నాకు దిగారు. ప‌లు ప్రాంతాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. రాజాసింగ్ మనోభావాలను కించపరిచారని, ఆయ‌న్ను అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఎమ్మెల్మే రాజాసింగ్ వీడియోను విడుద‌ల చేయ‌డం ద్వారా మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌ణం అయ్యాడ‌ని ఆయ‌న్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో. హిందూ, ముస్లిం ల మ‌ధ్య పాత బ‌స్తీలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. తెలంగాణ అంత‌టా పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. రాజాసింగ్ అరెస్ట్ ను నిర‌సిస్తూ ఆయ‌న అనుచ‌రులు రంగంలోకి దిగారు. దీంతో ఉద్రిక్త‌త నెల‌కొంది.