Federal Front: ఢిల్లీ పీఠంపై కోల్డ్ వార్‌

ఢిల్లీ గ‌ద్దె కోసం ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త‌, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్ద‌రూ స‌మాంతరంగా పావులు క‌దుపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాల‌ని బలంగా వినిపిస్తున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ 2018లో కొంత హడావుడి చేశాడు.

  • Written By:
  • Updated On - January 10, 2022 / 01:51 PM IST

ఢిల్లీ గ‌ద్దె కోసం ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త‌, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్ద‌రూ స‌మాంతరంగా పావులు క‌దుపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాల‌ని బలంగా వినిపిస్తున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ 2018లో కొంత హడావుడి చేశాడు. ఆ త‌రువాత మూడేళ్ల పాటు నిశ్శ‌బ్దంగా ఉన్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ స్వరాన్ని అందుకుంటున్నాడు. ఇంచుమించు ఇలాంటి నినాదంతో మ‌మ‌త బెన‌ర్జీ ఇటీవ‌ల దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఢిల్లీ పీఠం దిశ‌గా దూసుకెళ్ల‌డానికి ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తోంది. ఆ క్ర‌మంలో కామ్రేడ్ల ప్ర‌గ‌తిభ‌వ‌న్ భేటీ కేసీఆర్‌, మ‌మ‌త మ‌ధ్య కోల్డ్ వార్ కు బీజం వేసింద‌ని టాక్‌.
ఢిల్లీ పీఠం చ‌రిత్ర‌ను తీసుకుంటే..దాదాపుగా ఉత్త‌రాది పెత్త‌నం క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది. ఏపీ నుంచి స్వ‌ర్గీయ పీవీ, క‌ర్నాట‌క నుంచి దేవెగౌడ్ మిన‌హా ఎవ‌రూ ఢిల్లీ పీఠాన్ని అందుకోలేక‌పోయారు. పైగా వాళ్ల‌ద్ద‌ర్నీ ఉత్త‌రాది పెత్త‌నం ఎక్కువ కాలం ఆ ప‌ద‌విలో ఉంచ‌లేదు. ప్ర‌ధాని ప‌ద‌వి విష‌యంలో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి రాజ‌కీయాలు ఉంటాయో..ఇటీవ‌ల దేవెగౌడ త‌న పుస్త‌కంలో పొందుప‌రిచాడు. ప్ర‌ధాని ప‌ద‌విని తీసుకోవ‌డానికి ఆయ‌న ధైర్యంచేయ‌లేని ప‌రిస్థితుల‌ను ఆ పుస్త‌కంలో వివ‌రించాడు. ప్ర‌ధాని ప‌ద‌విలో ఉన్నంత కాలం ఏ విధంగా ఉత్త‌రాది లాబీయింగ్ ఇబ్బంది పెట్టిందో..కూడా గౌడ స్ప‌ష్టం చేశాడు. ఇక రాజ‌కీయ చాణిక్యునిగా పేరున్న స్వ‌ర్గీయ పీవీ న‌ర‌సింహారావు సైతం ప్ర‌భుత్వాన్ని న‌డిపేందుకు నానా తంటాలు ప‌డ్డాడు. చివ‌రకు ఆయ‌న మృత‌దేహాన్ని ఏఐసీసీ ఆఫీస్ కు తీసుకెళ్ల‌కుండా ఉత్త‌రాది పెత్త‌నం అడ్డుకుంది. ఆయ‌న స్మృతివ‌నం ఢిల్లీలో ఏర్పాటు చేయ‌డానికి ఇప్ప‌టికీ నార్త్ లాబీయింగ్ అడ్డుపడుతోంది.
ద‌క్షిణాది మీద ఉత్త‌రాది పెత్త‌నం గురించి 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ అనేక వేదిక‌ల‌పై బాహాటంగా మాట్లాడాడు. సాంస్కృతి, సంప్ర‌దాయ దాడి జ‌రుగుతోంద‌ని జ‌ల్లి క‌ట్టు ఉద్య‌మం సంద‌ర్భంగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి ఆనాడు మ‌ద్దతు ప‌లికాడు. ఉత్త‌రాది రాష్ట్రాల‌కు ఇచ్చిన నిధుల‌తో పోల్చుకుంటే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు వ‌చ్చిన త‌క్కువ వాటాను కూడా ఆయ‌న బ‌య‌ట‌పెట్టాడు. ద‌క్షిణ భార‌త‌దేశం వివ‌క్ష‌కు గుర‌వుతోంద‌ని వెలుగెత్తి చాటాడు. అంతేకాదు, ప్ర‌త్యేక దేశం నినాదం కూడా భ‌విష్య‌తులో వ‌స్తుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఆనాడు చేశాడు. 2019 ఎన్నిక‌ల ఫలితాల‌ను చూసిన ప‌వ‌న్ నేరుగా ఢిల్లీ వెళ్లి భేష‌ర‌తుగా ఉత్త‌రాది పెత్త‌నానికి స‌లాం చేశాడు. ఇప్పుడు గులాంగిరీ చేస్తున్నాడ‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల విమ‌ర్శ‌.
సామాజిక‌, రాజ‌కీయ‌, సాంస్కృతిక, సంప్ర‌దాయాల్లో ఉత్త‌ర భార‌తానికి, ద‌క్షిణ భార‌తానికి వ్య‌త్యాసం ఉంది. పైగా తొలి నుంచి ఒకే సామాజిక‌వ‌ర్గం ఢిల్లీ పీఠాన్ని శాసిస్తోంది. వెనుక‌బ‌డిన వ‌ర్గానికి చెందిన మోడీ ప్ర‌ధాని ప‌దవిలో ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ఆర్ ఎస్ ఎస్ క‌నుస‌న్న‌న‌లో న‌డుస్తున్నాడ‌ని ప్ర‌త్య‌ర్థులు చెబుతుంటారు. అంటే, స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఢిల్లీ పీఠం ఏ సామాజిక‌వ‌ర్గం నీడ‌న ఉందో..అదే సామాజిక‌వ‌ర్గం మోడీని న‌డిపిస్తోంద‌ని ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన లీడ‌ర్ మ‌మ‌త బెన‌ర్జీ. ఆమెకు ఇదో పెద్ద ప్ల‌స్ పాయింట్. ఇక ఉత్త‌రాదిలోని చిన్నాచిత‌క పార్టీలు కూడా దీదీ వైపు మొగ్గుచూప‌డానికి అవ‌కాశం ఉంది. అందుకే, ఆమె ఉత్త‌రాదిలోని రాష్ట్రాల‌కు తృణ‌మూల్ కాంగ్రెస్ ను వేగంగా విస్త‌రింప చేస్తోంది. ఐదారు రాష్ట్రాల్లో టీఎంసీ మ‌నుగ‌డ ఉంది. రాజ‌కీయంగా ఇది కూడా ఆమెకున్న పెద్ద ప్ల‌స్ పాయింట్ అవుతుంది.
ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా అడుగులు వేస్తోన్న కేసీఆర్ ప‌క్కా ద‌క్షిణ భార‌త దేశ లీడ‌ర్‌. అంతేకాదు, ఒక ఉప ప్రాంతీయ పార్టీ అధ్య‌క్షుడుగా మాత్ర‌మే ఉన్నాడు. మూడోసారి గెలుపు కోసం ఆయ‌న శ్రమించాల్సిన ప‌రిస్థితులు తెలంగాణ‌లో ఉన్నాయి. ఏపీలో ఆయ‌న ప్రాబ‌ల్యం రాజ‌కీయంగా శూన్యం. మ‌మ‌త‌బెన‌ర్జీతో పోల్చుకుంటే తెలంగాణ‌లో కేసీఆర్ కు ఉన్న ఎంపీల సంఖ్య త‌క్కువ. లోక్ స‌భ‌లో కేవ‌లం ఆయ‌న‌కు 9 మంది మాత్ర‌మే ఎంపీలు ఉన్నారు. ఈసారి ఆ సంఖ్య కూడా ఉంటుందా? ఉండ‌దా? అనేలా రాజ‌కీయ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ద‌క్షిణ భార‌త దేశంలో ని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కాంగ్రెస్ ను(యూపీఏ) వీడి బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్స్ దాదాపుగా లేదు. ఏపీలోని వైసీపీ, టీడీపీ పార్టీలు కేసీఆర్ కు అండ‌గా ఉంటాయ‌న్న న‌మ్మ‌కం లేదు. తాజాగా కామ్రేడ్లు ప్ర‌గ‌తిభ‌వ‌న్లో క‌లిసిన సంద‌ర్భాన్ని ఆధారంగా చేసుకుని కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్ర‌మే కేసీఆర్ కు అండ‌గా నిలిచే అవ‌కాశం ఉంది. కానీ, కాంగ్రెస్ పార్టీని కాద‌ని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌ల‌మ‌నే పూర్తి విశ్వాసం క‌మ్యూనిస్ట్ ల‌కు దాదాపుగా ఉండ‌దు. ప‌శ్చిమ బెంగాల్ లోని రాజ‌కీయ వైరం కార‌ణంగా కామ్రేడ్లు మ‌మ‌త‌ను వ్య‌తిరేకిస్తారు. ఇదొక్క‌టే కేసీఆర్ కు పెద్ద ప్ల‌స్ పాయింట్ గా ఉంటుంది.ఇక క‌ర్నాట‌క‌లోని జేడీఎస్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వెళుతుంటుంది.
సో..కేసీఆర్‌, మ‌మ‌త ఢిల్లీ పీఠం రేస్ ను విశ్లేషిస్తే..ఇప్ప‌టికైతే దీదీ వైపు ఉన్న ప్ల‌స్ పాయింట్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఆ క్ర‌మంలో 2018 మాదిరిగా కేసీఆర్ ఫెడ‌ర‌ల్ స్టంట్ వేస్తున్నాడా? నిజంగా హ‌స్త‌న పీఠం వైపు గురిపెట్టాడా? అంటే ఇప్ప‌టికిప్పుడు చెప్ప‌లేం. ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు వేచిచూడాల్సిందే.