Dharani Portal: భూ-యాజమాన్య సంస్కరణలా? భూ-స్వామ్య రాజకీయమా? – కోట నీలిమ

భూ-హక్కుల విషయంలో వారి ఆశలను, ఆశయాలను తుంగలో తొక్కుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ-సంస్కరణల పేరిట ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రవేశ పెట్టింది.

  • Written By:
  • Updated On - April 28, 2023 / 04:30 PM IST

By: Dr Kota Neelima 

Dharani Portal : ప్రపంచవ్యాప్తంగా జరిగిన దాదాపు అన్ని ఉద్యమాల వెనుక భూ-హక్కులు ప్రధాన కారణం. మన భారతదేశంలో, అందులోనూ ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో, జరిగిన అనేక పోరాటాలు భూ-హక్కుల ప్రాముఖ్యతకు ప్రతీతి. 2014లో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎంతో మంది పేదలు తమ జీవితాలు బాగుపడతాయి అని ఆశించారు. కానీ భూ-హక్కుల విషయంలో వారి ఆశలను, ఆశయాలను తుంగలో తొక్కుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ-సంస్కరణల పేరిట ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రవేశ పెట్టింది.

ప్రత్యేక రాష్ట్ర సాధనకు బీజం తెలంగాణ ప్రజలకు సమానత్వం మరియు న్యాయం అందించాలానే ఒక దృఢ సంకల్పం, వారి ఆకాంక్షలు నెరవేరుతాయని ధైర్యాన్ని కలిగించే ఒక ఉద్యమం. వీటిని తప్పక నెరవేరుస్తామని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆందోళనకు నాయకత్వం వహించిన పార్టీలలో ఒకటైన తెలంగాణ రాష్ట్ర సమితి వాగ్దానం చేసింది. అక్టోబర్ 2020లో ధరణి పోర్టల్‌ను (Dharani Portal) ప్రారంభించినప్పుడు ప్రజలు దానిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రారంభించిన మొదటి కొన్ని రోజుల్లోనే ఎన్నో అవాంతరాలతో పోర్టల్ నిలిచిపోతూ వచ్చి అనేక ఫిర్యాదులతో రెవెన్యూ శాఖకు తీవ్ర తలనొప్పిగా మారింది.

తెరాస ప్రభుత్వం 2018లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఒక సమర్థవంతమైన భూ సంస్కరణ వ్యూహం మరియు అమలు ప్రణాళికను రూపొందించడానికి 2014 నుండి 2020 వరకు 6 సంవత్సరాల సమయం ప్రభుత్వం దగ్గర ఉండగా, అందుకు పూర్తి భిన్నంగా ఇంతకు ముందు ఎప్పుడూ లేని సమస్యలను సృష్టించి, ప్రజల పట్ల పేలవంగా అమలు చేయబడిన డిజిటల్ పోర్టల్ ను ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది? ఒక సాధారణ సమాధానం – భూమి యాజమాన్యాన్ని అధికారికీకరించడానికి. తెలంగాణ సామాజిక-రాజకీయ పోరాటాల స్ఫూర్తి ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా న్యాయం లేదా అన్యాయం అనే ఒక డిజిటల్ క్లిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలను పరిశీలిద్దాం.

ధరణి అనేది ఒక సమీకృత భూ-నిర్వహణ వ్యవస్థ. ఇది ప్రభుత్వ భూ-పరిపాలన శాఖ ప్రధాన కమీషనర్ ద్వారా నిర్వహించబడుతుంది. సంపూర్ణ భూ-పారదర్శకత అనే నినాదంతో ధరణి పోర్టల్ (Dharani Portal) ఆవిష్కరించబడింది: భూమి రికార్డుల ఆధునికీకరణ; భూమి రిజిస్ట్రేషన్; సర్వే సంఖ్యల క్రమబద్ధీకరణ; భౌతిక రికార్డుల నవీకరణ; ఆన్‌లైన్ భూమి పత్రాలు; అప్పుల జాబితా; ఆన్‌లైన్ మ్యుటేషన్; మార్కెట్ విలువ నిర్ధారణ ఇందులోని కీలక అంశాలు. ల్యాండ్ రికార్డ్స్ అప్‌డేషన్ ప్రోగ్రామ్ (ఎల్.ఆర్.యు.పి. – 2017) పూర్తయిన తర్వాత 2018 నుండి తెలంగాణ ప్రభుత్వం కొత్త పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేయడం జరిగింది. తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ & పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టం, 2020 ప్రకారం ఈ కొత్తగా జారీచేసిన పట్టాదారు పాసుపుస్తకాలు మాత్రమే భూమి యొక్క యాజమాన్యానికి రుజువు.

తెలంగాణలో ఎప్పటినుంచో అందుబాటులోవున్న పహాణీలు మరియు హక్కుల రికార్డు (ఆర్.ఓ.ఆర్) పత్రాలు, పాత పట్టాదార్ పాస్‌బుక్‌లు మరియు ఇతర రకాల భూ యాజమాన్య ధ్రువీకరణ రికార్డులతో పోలిస్తే ధరణికి శాస్త్రీయ మరియు తార్కిక వైరుధ్యాలు ఉన్నాయి. తెలంగాణ భూ-హక్కులు మరియు పట్టాదార్ పాస్‌బుక్‌ల చట్టం, 2020 రూపకల్పనలో పాత పాస్‌బుక్‌లను కొత్తవాటితో మార్చాల్సిన అవసరం రానివ్వకుండా కేవలం వాటిని అంగీకరించే వెసులుబాటు ఇచ్చి ఉంటె సరిపోయేది. మునుపటి పహాణీలు మరియు పాస్‌బుక్‌లు సుదీర్ఘ పోరాటాల నుండి వచ్చాయి; ఆ పత్రాలలో సంగ్రహించబడిన, భద్రపరచబడిన ప్రతి వరుస, వివరాలు భూస్వామిపై రైతు సాధించిన విజయాలకు ప్రతీక. అయినప్పటికీ, కొంతమంది ప్రజాస్వామిక ‘పాలకులు’ వారి భావితరాలకు గుర్తుండిపోయేలా తలబెట్టే ఇలాంటి చారిత్రక నిర్ణయాలు చివరకు అలాంటి పాలకులకే అపకీర్తి తెచ్చిపెడతాయి. రెవెన్యూ వ్యవస్థలో ఆర్‌.ఓ.ఆర్‌, పహాణీలను పక్కన పెట్టి, కొత్తగా పట్టాభిషేకం చేసిన ధరణికి ప్రాధాన్యత ఇవ్వడం తెలంగాణ ప్రస్తుత ‘పాలకుల’ భూ-స్వామ్య నైజంకు అద్దం పడుతుంది.

తెలంగాణలో భూ-హక్కుల రికార్డుల పరిణామాన్ని అధ్యయనం చేయడం ఎంతో కీలకం. భూ-రికార్డుల పరిణామక్రమంలో ముందుగా పహాణీలు వస్తాయి. ఇవి భూమి రకం, యాజమాన్యంతో పాటుగా పటంలో సంఖ్య మరియు స్థానాన్ని, భూమి విస్తీర్ణం మరియు దాని సరిహద్దులకు సంబంధించిన వివరాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు, 1954-55 మధ్య రూపొందించిన పహాణీలను ఖాస్రా పహాణీలు  అని, అలాగే 1955 నుండి 1958 మధ్య రూపొందించిన వాటిని సెసాల పహాణీ అని పిలుస్తారు. ఈ పహాణీల నుండి సేకరించిన భూమి యొక్క సమాచారాన్ని తరువాత వివిధ రకాల గ్రామ రికార్డులలోకి క్రోడీకరించడం జరిగింది. తదనంతరం, రైతుల ఆధీనంలో ఉన్న భూములపై హక్కుల రికార్డు (ఆర్‌. ఓ. ఆర్) అందించడానికి, అలాగే టైటిల్ డీడ్‌లు ఇవ్వడానికి 1971లో ఆర్‌.ఓ.ఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఆర్‌.ఓ.ఆర్ ప్రక్రియను చేపట్టారు. 1980, 1989 మరియు 1993లో కాలానుగుణంగా ఈ చట్టాన్ని సవరించారు.

వీటికి  సంబంధించిన నియమాలు జారీ చేయబడ్డాయి. తదనంతరం ప్రభుత్వం, కమీషనర్ ఆఫ్ సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, హైదరాబాద్ ద్వారా కార్యనిర్వాహక ఆదేశాలు, సూత్రాలు కూడా జారీ చేయబడ్డాయి. ఆర్.ఓ.ఆర్. ఈ క్రింది మూడు లక్షణాలను స్పష్టం చేస్తుంది: 1) యాజమాన్యం; 2) యాజమాన్యం యొక్క పరిమితి; మరియు, 3) చెల్లించిన/చెల్లించవలసిన రాబడి. ఇది లీజు భూములు మరియు కౌలుకు కూడా వర్తిస్తుంది. ఆర్.ఓ.ఆర్ వల్ల భూమిపై ఉన్న రుణాలు, అలాగే భూమి యొక్క యాజమాన్య స్థితి (ప్రభుత్వం లేదా సంఘం), ఇతర హక్కులను కూడా వెల్లడిస్తుంది. తరువాత కాలంలో, ఆర్.ఓ.ఆర్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ప్రజలకు పట్టాదార్ పాస్‌బుక్‌లు జారీ చేయడం జరిగింది. ఏదేమైనా, రెవెన్యూ అధికారులు భూమికి సంబంధించిన విభిన్న అంశాలను నిర్ధారించడానికి పహాణీలు మరియు గ్రామ రికార్డులోని పాత రికార్డులను ప్రాతిపదికగా తీసుకుంటూ వచ్చారు.

అయితే ధరణి తర్వాత, ప్రజలు ఆర్.ఓ.ఆర్ ని ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు కానీ పోర్టల్ నుండి పొందలేరు. దీనికంటే (ధరణికంటే) ముందు, ఆర్.ఓ.ఆర్ ను ప్రజలు మా భూమి వెబ్ పోర్టల్ నుండి పొందే అవకాశం ఉండేది. నేడు, ధృవీకరించబడిన కాపీ కోసం, భూ-యజమానులు తప్పనిసరిగా ‘మీ-సేవ’ను  ఆశ్రయించాలి. ఆర్.ఓ.ఆర్ 1-బి కు న్యాయస్థానంలో విశిష్టమైన విలువ కలిగి ఉన్న కారణం చేత, ఇది భూములపై తప్పుడు క్లెయిమ్‌ల (దావాల) నుండి రక్షణగా ఉంటూ భూ-యజమానులు హక్కులను పరిరక్షిస్తుంది. కాబట్టి ఇది అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి అనివార్యమైనది. తరతరాలుగా వారసత్వంగా సంక్రమిస్తున్న భూములు మరియు అన్ని రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా ఇది చాలా కీలకం. భూమిపై అధికారిక రుణాలు పొందడానికి మరియు ముఖ్యంగా, రైతు బంధు, పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీని పొందేందుకు యాజమాన్య పత్రాలు అవసరం.

ఆర్. ఓ. ఆర్ 1-బి ధృవీకరణ పొందడానికి ముందు దరఖాస్తుదారుడు/రాలు అనేక విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే: యాజమాన్యంలో మార్పులకు సంబంధించిన వివరాలు; నీటిపారుదల రకాలు; హక్కులపై పరిమితి; మ్యుటేషన్ చరిత్ర; నేల / భూమి రకం; సర్వే నంబర్; ఏదైనా పౌర లేదా రెవెన్యూ బాధ్యతలు; పెండింగ్ / తీసుకున్న పంట రుణాలు; వివిధ రకాల పంటలు; పెండింగ్ వ్యాజ్యాలు; అన్ని భూ-యజమానుల స్వాధీనం; భూమి యొక్క వర్గీకరణ; మరియు, చెల్లించిన/చెల్లించని పన్నులు.

ధరణి పోర్టల్‌ (Dharani Portal) లో ఆర్.ఓ.ఆర్ 1-బి పొందడంలో రైతులు క్రింది సమస్యలను ఎదుర్కొంటున్నారు: 

1. సర్వే నంబర్లు మరియు యజమాని పేరు మధ్య అసమతుల్యత

2. రికార్డుల్లో సర్వే నంబర్లు లేకపోవడం

3. రికార్డుల నుండి యజమానుల పేర్లు లేకపోవడం

4. యాజమాన్యం యొక్క మ్యుటేషన్ చరిత్ర లేకపోవడం

5. భూ-విస్తీర్ణంలో లోపాలు / అవకతవకలు.

6. భూమి యొక్క వర్గీకరణలో తప్పులు.

ఈ వివరాలు లేని భూ-యాజమాన్యం లేదా భూ-స్వాధీనం కలిగిన రైతులు వారి పేరు మీద ఆర్.ఓ.ఆర్ 1-బి పొందలేరు. అయినప్పటికీ, అటువంటి రైతులు తరచుగా ‘పాత పాస్‌బుక్’ లేదా ముందు వివరించినట్లుగా, ధరణికి ముందు జారీ చేయబడిన వివిధ పహాణీ మరియు పాస్‌బుక్‌లను కలిగి ఉంటారు. భూ-యజమానుల పేరు ధరణి పోర్టల్‌లో కనిపిస్తే తప్ప, ఇవి గుర్తించబడవు, ఇది తప్పుడు క్లెయిమ్‌లకు (దావాలకు) మరియు తప్పులకు కూడా దారి తీస్తోంది. దీని పరిష్కారం కోసం భూ-యజమానులు రెవెన్యూ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ తరచూ శారీరక ఇబ్బందులు, అధికారుల చేతుల్లో దుష్ప్రవర్తనకు గురవుతున్నారు. పౌరులు కూడా తమ ప్రయత్నాలు అనవసరమని గ్రహించారు; ఆర్.ఓ.ఆర్ లో ‘దిద్దుబాట్లు’ నెపంతో అసలు ఎప్పుడూ లేని తప్పులను సరిచేస్తున్నారు అనే వాదన కూడా ఉంది.

రెండు ఉదాహరణలు దీనిని వివరిస్తాయి:

మొదటిది, జులై, 2022లో తెలంగాణ హైకోర్టు చిన్న మరియు సన్నకారు రైతుల భూమిని నిషేధిత భూముల జాబితాలోకి తప్పుగా చేర్చిన కేసులో జోక్యం చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో చోటుచేసుకోవడం గమనార్హం.  రెండవది, ధరణి పాసుపుస్తకాలు అందుకున్న 76 మంది గిరిజన రైతుల పేర్లను అక్రమంగా తొలగించినందుకు తెలంగాణ హైకోర్టు జిల్లా అధికార యంత్రాంగాన్ని నిలదీసింది. ధరణి పోర్టల్ నుండి వారి పేర్లు రహస్యంగా మాయమైన నాటినుంచి వారికి రైతుబంధు సహాయం అందడం ఆగిపోయింది.

ఎన్నికైన ప్రభుత్వాలు రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉంటూ వాటి పరిథిలో మాత్రమే డిజిటల్ సంస్కరణలు చేపట్టాలి. అలా కానీ పక్షంలో ధరణి లాంటి సంస్కరణలు కేవలం రాజకీయ సాధనాలుగానే నిలిచిపోతాయి. తెలంగాణలో భూ-యాజమాన్యమే రాష్ట్ర రాజకీయాలను నిర్ణయిస్తుందన్నది నిజం. కానీ ఈ రాష్ట్ర చరిత్రను ఒకసారి ఉటంకిస్తే, ఇక్కడ అన్యాయాన్ని, ముఖ్యంగా పేద రైతులకు జరిగిన అన్యాయాన్ని మరిచిపోయే ప్రసక్తి లేదని అవగతమవుతుంది.

(డాక్టర్ కోట నీలిమ రాజకీయ విశ్లేషకులు, రచయిత్రి మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ)
నిరాకరణ: ఇవి రచయిత యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు.

Also Read:  Telangana: సూడాన్‌ నుంచి భారత్ చేరుకున్న 14 మంది తెలంగాణ వాసులు