KL Rahul : సోదరి వివాహం..అందుకే తొలి వన్డేకు దూరం

భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం జరగనున్న తొలి వన్డేకి వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరంగా ఉండనున్నాడు..

  • Written By:
  • Updated On - February 4, 2022 / 12:47 PM IST

భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం జరగనున్న తొలి వన్డేకి వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరంగా ఉండనున్నాడు.. ఫిబ్రవరి 9న భారత్, వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్‌లోనే రెండో వన్డే జరగనుండగా.. ఆ మ్యాచ్‌ సమయానికి జట్టుతో కేఎల్ రాహుల్ జట్టులో చేరనున్నాడు. అయితే వన్డే జట్టులోకి ఎంపికైనా.. తొలి వన్డేకి ఎందుకు రాహుల్ దూరంగా ఉన్నాడని అభిమానులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన సోదరి వివాహం ఉండటంతో కుటుంబంతో కలిసి ఉండేందుకే అతను తొలి వన్డేకి దూరమైనట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో సోదరితో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోను కూడా రాహుల్ పోస్ట్ చేశాడు. పెళ్ళి హడావుడి ముగిసిన తర్వాత కెఎల్ రాహుల్ జట్టుతో చేరనున్నాడని బోర్డు వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 6 నుండి భారత్ , విండీస్ వన్డే సిరీస్ జరగనుండగా.. టీమిండియాలో కోవిడ్ కేసులు బయటపడడం కలకలం రేపింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, స్టాండ్ బై ప్లేయర్ నవదీప్ సైనీకి అలానే సపోర్ట్ స్టాఫ్‌లోనూ ఓ నలుగురికి బుధవారం రాత్రి కరోనా పాజిటివ్‌గా తేలింది.దాంతో.. టీమిండియా ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్‌ని ఐసోలేషన్‌కి తరలించారు. ఇక గురువారం జరగాల్సిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు టీంఇండియా వన్డే జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే ఓపెనర్‌గా జట్టుకి అందుబాటులో ఉన్నాడు. రోహిత్ శర్మకి జోడీగా ప్రొఫెషనల్ ఓపెనర్ ఎవరూ అందుబాటులో లేరు. దాంతో.. భారత వన్డే జట్టులోకి టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ని భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఒక వేళ భార‌త జ‌ట్టులో మరిన్ని పాజిటివ్ కేసులు న‌మోదైతే సిరీస్ వాయిదా ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.