Ind Vs WI: అదరగొట్టిన సూర్యకుమార్ , తిలక్ వర్మ… కీలక మ్యాచ్ లో భారత్ విజయం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు కింగ్ , మేయర్స్ తొలి వికెట్ కు 55 పరుగులు జోడించారు.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 11:40 PM IST

3rd T20 Ind vs WI: సిరీస్ చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. దీంతో టీ ట్వంటీ సీరీస్ లో తొలి విజయం అందుకున్న టీమిండియా సీరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు కింగ్ , మేయర్స్ తొలి వికెట్ కు 55 పరుగులు జోడించారు. వీరి పార్టనర్ షిప్ ను అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. కింగ్ 42 , మేయర్స్ 25 రన్స్ చేశారు. తర్వాత నికోలస్ పూరన్ ధాటిగా ఆడినా..20 రన్స్ కు కులదీప్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మిగిలిన బ్యాటర్లు వేగంగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగారు. చివర్లో భారత స్పిన్నర్ కులదీప్ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టాడు. అయితే చివరి రెండు ఓవర్లలో కెప్టెన్ రోవ్ మెన్ పావెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లో 40 పరుగులు చేశాడు. దీంతో విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కులదీప్ 3 , అక్షర్ పటేల్, ముకేష్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ 1 పరుగుకే ఔటవగా… శుబ్ మన్ గిల్ 6 రన్స్ కే వెనుదిరిగాడు. దీంతో భారత్ పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. భారీ షాట్లతో స్టేడియం నలువైపులా బౌండరీల వర్షం కురిపించాడు.

ఫామ్ లో ఉన్న తిలక్ వర్మ కూడా చక్కని సపోర్ట్ ఇచ్చాడు. దీంతో సూర్య మరింత స్వేచ్ఛగా ఆడేసాడు. తనదైన బ్యాటింగ్ తో ఫాన్స్ ను అలరించాడు. సూర్య కుమార్ కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా మరింత ధాటిగా ఆడిన స్కై 44 బంతుల్లో 10 ఫోర్లు , 4 సిక్సర్లతో 83 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ ఓవర్ కు ఆరు పరుగులే ఉండడంతో భారత్ సునాయాసంగా గెలిచింది. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ మరోసారి ఆకట్టుకున్నాడు. సూర్య కుమార్ కు చక్కని సహకారం అందించిన తిలక్ చివర్లో కెప్టెన్ హార్దిక్ తో కలిసి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు.
దీంతో భారత్ మరో 2.1 ఓవర్లు మిగిలి వుండగానే 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ అందుకుంది. తిలక్ వర్మ 49 , హార్దిక్ పాండ్య 20 రన్స్ తో అజేయంగా నిలిచారు. సిరీస్ లో చివరి రెండు మ్యాచ్ లూ అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతాయి.